24, నవంబర్ 2020, మంగళవారం

  🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                          *ధార్మికగీత - 90*

                                    *****

         *శ్లో:- చలత్ కాష్ఠో జ్వల  త్యగ్ని: ౹*

                 *కృద్ధః  సర్పో విజృంభతే  ౹*

                 *క్షోభా దేవ  మనుష్యస్య ౹* 

                 *శక్తే:  ప్రాయో విజృంభణమ్ ౹౹* 

                                      *****

*భా:- లోకంలో కొందరు మౌనముద్రలో, ప్రశాంతంగా, నిబ్బరంగా ఉన్నట్లు కనబడతారు. వారిని సౌమ్యులుగా, సాధువులుగా పరిగణించినా ఆశ్చర్య పడనక్కరలేదు. వారికి చిన్నపాటి  కష్టం గాని, ప్రతిఘటన గాని  జరిగితే, వారి సహజ శక్తి పరాక్రమాలు వెల్లడి అవుతాయి. ఎలా? కాలుతున్న కట్టెలను కదిలించి చూడండి. అగ్ని గాలికి  పెద్ద పెద్ద మంటలతో ఉవ్వెత్తున జ్వలిస్తుంది.  పడుకున్న పామును  కదిలిస్తే, అది కోపంతో రెచ్చిపోయి, పడగ విప్పి బుసలు గొడుతుంది. అలాగే మనుజుల యొక్క నిజమైన శక్తి సామర్ధ్యాలు కూడ కష్ట సమయాల్లోనే వెల్లడి అవుతాయి. గీతాబోధతోనే రణంలో  భీరువైన పార్థుని  శౌర్యపరాక్రమాలు వెలుగు చూశాయి. సీతాన్వేషణ క్లేశంలో ఉన్న హనుమను వానరులు పొగడ్తలతో ముంచెత్తగానే, అతని   విరాడ్రూపం, పరాక్రమము లోకానికి వెల్లడైనాయి. పాండవులు ఐదూళ్లడగగానే రారాజు సహజసిద్ధమైన  లోభితనపు పరాకాష్ట బయటపడింది. మానవునిలోని  నైజంతో కూడిన శక్తి,సమర్థత  బయట పడాలంటే  కష్ట నష్టాలే సాటిలేని మేటి గీటురాయి అని సారాంశము*.

                                 *****

                 *సమర్పణ   :   పీసపాటి*  

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: