24, నవంబర్ 2020, మంగళవారం

మూడు కలలు

  *మూడు కలలు -- చందమామ కథలు*


*ధర్మనిరతుడైన గోకర్ణికరాజు మణికర్ణుడికి యోగిపుంగవులన్నా, సాధు సన్యాసులన్నా అమిత గౌరవం. ఆయన తరచూ మహనీయులైన యోగులను దర్శించి వారి ఆశీర్వాదం పొందేవాడు. రాజధానికి వచ్చే సాధు సన్యాసులను సాదరంగా ఆహ్వానించి భక్తి శ్రద్ధలతో అతిథి సత్కారాలు చేసేవాడు. ఒకసారి జడధారి అనే సన్యాసి రాజభవనానికి విచ్చేశాడు.*


*యథాప్రకారం రాజు ఆయనకు అతిథిసత్కారాలు అందించి, సాష్టాంగ దండ ప్రమాణం చేశాడు. రాజు వినయ విధేయతలకు, ధర్మబుద్ధికి పరమానందం చెందిన జడధారి, ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు బోధించి, బయలుదేరే ముందు, ‘‘మహారాజా! నీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి. నువ్వు ఈ రోజు నుంచి మూడు రాత్రులు వరుసగా మూడు దుస్వప్నాలు కాంచబోతున్నావు. అప్రమత్తతతో వ్యవహరించు. లేకుంటే ప్రమాదం బారిన పడగలవు,'' అని హెచ్చరించి వెళ్ళాడు.*


*అది విన్న రాజు ఎంతగానో కలవరపడ్డాడు. వెంటనే మంత్రులను సమావేశపరచి, విషయం వివరించాడు. అప్పుడు వివేకవర్థనుడనే వృద్ధ మంత్రి, ‘‘జడధారి మీకు రాత్రి సమయంలోనే దుస్వప్నాలు రాగలవని హెచ్చరించాడు గనక, మీరు పగటి పూట నిద్రించి మూడు రాత్రులూ మెలకువగా గడపండి. అప్పుడు స్వప్నాలూ రావు. ప్రమాదాలు సంభవించే అవకాశమూ ఉండదు,'' అని సలహా ఇచ్చాడు. రాజుకు ఆ సలహా నచ్చింది. ఆయనకు సంగీతం, చదరంగం, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తిమెండు.*


*అందువల్ల రాత్రి సమయంలో వాటితో కాలక్షేపం చేస్తే నిద్రరాదని భావించాడు. తక్కిన మంత్రులు కూడా అదే మంచిదని ఆభిప్రాయపడ్డారు. ఆనాటి రాత్రి చదరంగం ఆడుతూ గడపాలని రాజు నిర్ణయించాడు. చదరంగం ఆటలో దిట్టలైనవారిని పిలిపించాడు. తెల్లవార్లూ చదరంగం ఆడుతూ గడిపాడు. అయితే, తెలతెలవారుతూండగా మహారాజు చిన్న కునుకు తీశాడు.*


*ఆ చిన్నపాటి కునుకులో మహారాజుకు ఒక కల వచ్చింది. ఆయన ఒక అరణ్యంలో ఉన్నాడు. ఒక త్రాచుపాము రాజును చూసి బుసలు కొడుతూ పైకి ఉరికింది. ఆయనకు ఒళ్ళంతా చెమటలు పట్టాయి. అంతలో మెలకువ వచ్చింది. రెండో రోజు రాత్రి రాజు సంగీతం వింటూ మెలకువతో ఉండాలనుకున్నాడు. కాని మధురమైన సంగీతం వింటూ ఉండగా ఆయన కొద్ది క్షణాలు కళ్ళుమూసుకున్నాడు.*


*ఆకాశం నుంచి ఒక పెద్ద పిడుగు తనకేసి రావడం చూసి, దాని నుంచి తప్పించుకోవడానికి అటూ ఇటూ పరిగెత్తసాగాడు. అయినా, కలలో పిడుగు ఆయన్ను వెంటాడుతూనే ఉన్నది. అంతలో రాజుకు మెలకువ వచ్చింది. మూడో రోజు రాత్రి ధార్మిక, ఆధ్యాత్మిక విషయాలు చర్చిస్తూండగా మరలా కునుకు పట్టింది. ఈసారి స్వప్నంలో భయంకరమైన సింహం ఒకటి రాజు మీదికి ఉరికింది. ఆయన ఒక మడుగులో దూకాడు. మడుగులో నీరు రుధిరవర్ణంలో ఉంది.*


*అంతలో యువరాణి మణిమేఖల అక్కడ కనిపించి, తండ్రిని నెత్తురు మడుగు నుంచి పైకిలాగింది. అంతలో రాజుకు మెలకువ వచ్చింది. తెల్లవారగానే, రాజు మంత్రులను సమావేశపరచి తన కలల గురించి వివరించాడు. మంత్రులు వెనువెంటనే పాముకాటుకు మంత్రం వేసేవారిని పిలిపించారు. మహారాజుగారిని వేటకుగాని, బయటకు గాని వెళ్ళవద్దని సలహా ఇచ్చారు.*


*అంతఃపురంలో అందరినీ అప్రమత్తులు చేశారు. అయినా మహారాజు కలవరం తగ్గలేదు. ఆ సమయంలో శివుడనే యువకుడు మహారాజును దర్శించి, ‘‘రాజా! నేను చాలా తెలివిగలవాణ్ణి. కాని నా తెలివితేటలను ఎవరూ గుర్తించడంలేదు. మీరైనా నా తెలివితేటలను గుర్తించండి. లేకుంటే హిమాలయాలకు వెళ్ళిపోతాను,'' అన్నాడు.*


*ఆ మాటలు విన్న మహారాజుకు వాడు మతి చలించినవాడేమో నన్న అనుమానం కలిగింది. అయినా, ఎవరికి ఎలాంటి శక్తి ఉంటుందో ఏమోనని భావించి, జడధారి తనను స్వప్నాల గురించి హెచ్చరించడం; ఆయన చెప్పినట్టే తనకు వరసగా వచ్చిన మూడు కలల గురించి అతనికి వివరించాడు. అంతా విన్న శివుడు కొద్ది క్షణాలు ఆలోచించి, ‘‘మహారాజా, యోగులు, సన్యాసులు దైవాంశ సంభూతులు.*


*వారి నోటి మాట వృథా కాదు. మిమ్మల్ని కలవర పరుస్తూన్న మూడు కలలను విశ్లేషించి, ఫలితం చెప్పగలను. మొదటి రెండు కలల గురించి వివరిస్తాను. అందులో వాస్తవం ఉందని తెలిస్తే, మూడవ కలకు వివరణ ఇస్తాను,'' అన్నాడు. ‘‘అలాగే, చెప్పుమరి. ఆలస్యం దేనికి?'' అన్నాడు రాజు ఆదుర్దాగా. శివుడు కొంతసేపు మౌనంగా ఊరుకుని, ‘‘మహారాజా! మీకు మొదటి కలలో కనిపించిన అరణ్యం జనారణ్యం.*


*త్రాచు పాము పగకు సంకేతం. మీ మీద పగబట్టిన వ్యక్తి ఎవరో మీకు అపాయం తలపెట్టాడన్నదే ఆ కల అంతరార్థం! ఇక పిడుగు అనేది హఠాత్తుగా పడేది. అంటే, ఊహించని ఘటన ఏదో జరగబోతున్నది. పిడుగు మిమ్మల్ని వెంటాడిందంటే జరగబోయే దుర్ఘటన మీకు గురిపెట్టబడి వుందని అర్థం," అన్నాడు. రాజుకు శివుడి తెలివితేటల మీద నమ్మకం కుదిరింది. శివుడు ఉండడానికి విడిది ఏర్పాటు చేశాడు.*


*తీవ్రంగా ఆలోచించిన రాజుకు ఒక విషయం స్ఫురించింది. ఇటీవల రాజ్యంలో బందిపోట్ల బెడద ఎక్కువయితే, దానిని అరికట్టడానికి రాజు ప్రయత్నించాడు. బందిపోట్ల నాయకుడు భైరవుడు తనకు అపాయం తలపెట్టి ఉండవచ్చని భావించిన రాజు, సైనికులతో అష్టదిగ్బంధనం చేయించి, నాయకుడు భైరవుడితో సహా బందిపోట్లందరినీ బంధించాడు.*


*విచారణలో భైరవుడు విషనాగును రాజు శయనమందిరంలోకి పంపి రాజును చంపడానికి కుట్ర పన్నినట్టు ఒప్పుకున్నాడు. ఆ విధంగా తాను కన్న మొదటి కలకు శివుడి విశ్లేషణ సరైనదని గ్రహించి ఎంతగానో సంతోషించిన రాజు, రెండవ కల వివరణను పరీక్షించడానికి గూఢచారులను అన్ని దిశలకూ పంపాడు.*


*రెండు రోజుల తరవాత, ఒక గూఢచారి వచ్చి, ‘‘సింహపురి రాజు విక్రమసేనుడు మన రాజ్యం మీదికి దండెత్తడానికి ఆయత్తమవుతున్నాడు,'' అని చెప్పాడు. శివుడి తెలివితేటలకు అబ్బురపడిన రాజు, అతన్ని పిలిచి సంగతి చెప్పి, ‘‘అన్ని విధాలా నాకన్నా బలవంతుడైన విక్రమసేనుణ్ణి ఎదుర్కోవడం ఎలా?'' అన్నాడు విచారంతో.*


*‘‘దానికి మీరు కన్న మూడో కలలో పరిష్కారం సూచించబడింది, మహారాజా,'' అన్నాడు శివుడు. ‘‘ఎలా?'' అని అడిగాడు రాజు. ‘‘మహారాజా! మీ కలలో కనిపించిన సింహం, సింహపురిరాజు విక్రమసేనుడు. మీరు నెత్తురు మడుగులో పడడం యుద్ధంలో జరగనున్న రక్తపాతానికి సంకేతం.*


*మిమ్మల్ని మడుగులో నుంచి బయటకు లాగిన యువరాణి గారే మిమ్మల్ని ఈ ఆపదనుంచి గట్టెక్కించ గలరు,'' అన్నాడు శివుడు. ‘‘అదెలా?'' అని అడిగాడు రాజు. ‘‘సింహపురి రాజుకు యుక్తవయస్కుడైన కుమారుడు ఉన్నాడు కదా? ఆయనతో మన యువరాణి వివాహం జరిపిస్తే, యుద్ధ ప్రసక్తే ఉండదు!'' అన్నాడు శివుడు.*


*అందులోని వాస్తవాన్ని గ్రహించిన మణికర్ణుడు ఒక మంచి రోజు చూసి కుమార్తె చిత్రపటాన్ని విక్రమసేనుడికి పంపి, ‘‘మీకు సమ్మతమైతే నా కుమార్తెను మీ కోడలిగా స్వీకరించండి,'' అని పురోహితుడి ద్వారా కబురు పంపాడు. మణిమేఖల అద్భుత సౌందర్యానికి ముగ్థుడైన సింహపురి యువరాజు త్రివిక్రముడు ఆమెను వివాహ మాడడానికి సంతోషంగా సమ్మతించాడు.*


*దాంతో విక్రమసేనుడు గోకర్ణిక మీద యుద్ధ ప్రయత్నాలు విరమించి కుమారుడి పెళ్ళి ఏర్పాట్లకు శ్రీకారం చుట్టాడు. త్వరలో వారి వివాహం అత్యంత వైభవంగా జరిగిపోయింది. రాజు విక్రమసేనుడు, తనకు వచ్చిన మూడు కలలను చక్కగా విశ్లేషించి, తగిన సూచనలిచ్చి తన రాజ్యాన్ని పెను ప్రమాదాల నుంచి కాపాడిన శివుణ్ణి ఘనంగా సత్కరించి, తన ఆంతరంగిక సలహాదారుగా నియమించాడు.*

కామెంట్‌లు లేవు: