13, నవంబర్ 2020, శుక్రవారం

సుభాషితాలు

------   సుభాషితాలు --------------

 

అంభోజాకరమధ్య నూతన నలిన్యాలింగన క్రీడ నా

రంభుం డైన వెలుంగుఱేని చెలువారన్ వచ్చి, నీటన్ గుభుల్

గుంభద్ధ్వానముతోఁ గొలంకును కలంకం బొందఁగా జొచ్చి, దు

ష్టాంభోవర్తి వసించు చక్కటికి డాయంబోయి హృద్వేగమై.

 

                   భావము:- ఇలా పంపగానే, చక్రాయుధం సరోవరంలోని లేలేత పద్మాలని కౌగలించుకోడానికి వెళ్తున్న సూర్యబింబంలా వెళ్ళింది. గుభిల్లు గుభిల్లనే పెద్ద చప్పుడుతో మడుగు కలచిపోయేలా లోపలికి దూకింది. రివ్వున మనో వేగంతో ఆ చెడ్డదైన మొసలి ఉన్న చోటు సమీపించింది.

 

అంతా మిథ్య తలంచి చూచిన నరుండట్లౌ టెరింగిన్ సదా

కాంతల్‌ పుత్రులు నర్థముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ

భ్రాంతింజెంది చరించుగాని, పరమార్థంబైన నీయందుఁ దా

జింతాకంతయుఁ జింత నిల్పడు గదా, శ్రీ కాళహస్తీశ్వరా!  

   

ఆలోచించినచో ఈ జగత్తంతా మాయేకదా! మానవుడా సంగతి తెలిసీ కూడా, భార్య, పుత్రులు, ధనము, తన శరీరము అన్నీ శాశ్వతము అని భావించి మోహము పొందుచూ, జీవనమునకు పరమార్థభూతుడవైన నిన్ను మనసులో ఒక్క నిమిషమైననూ ధ్యానించడు కదా! ఎంత అజ్ఞానము.

 

తెలియని కార్యమెల్లఁగడతేర్చుట కొక్కవివేకి జేకొనన్

వలయునట్లైన దిద్దుకొనవచ్చుఁబ్రయోజనమాంద్యమేమియుం

గలుగదు ఫాలమందు దిలకం బిడునప్పుడు చేతనద్దమున్

గలిగిన జక్క జేసికొనుగాదె నరుం డది చూచి భాస్కరా!

 

తాత్పర్యం: భాస్కరా! మనుజుడు నుదుటి యందు బొట్టును పెట్టుకొనుచూ చేతి యందు అద్దముతో బొట్టును వంకర టింకర లేకుండా సరిచేసుకొనును. అలాగే నేర్పరి వద్దకెళ్ళి పనులను చక్కదిద్దుకొని సంతోషాతిశయమును తెలివిగలవాడు పొందునని భావం.

 

రంగదరాతిభంగ, ఖగ రాజతురంగ, విపత్పరంపరో

త్తుంగ తమఃపతంగ, పరి తోషితరంగ, దయాంతరంగ స

త్సంగ ధరాత్మజా హృదయ సారసభృంగ నిశాచరాబ్జమా

తంగ, శుభాంగ, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిథీ.

 

             భావం: శత్రువుల సంహరించినవాడవు, గరుత్మంతుడు వాహనముగ గలవాడవు, ఆపదల బోగొట్టువాడవు, రంగనాధునిచే సేవింపబడిన వాడవు, దయతో నొప్పు మనస్సుగలవాడవు, సత్సంగుడవు, సీతాహృదయమును పద్మమునకు తుమ్మెదవంటివాడవు, రాక్షసులకు బీభత్స కరుడవు, శుభాంగుడవునైన భద్రాచల రామా!

 

శ్రోత్రం శ్రుతి నైవ న కుండలేన 

దానేన పాణిర్నతు కంకణే న 

విభూతి కాయః ఖలు సజ్జనానాం 

పరోపకారేణ న చందనేన 

 

అర్థము:-- సజ్జనులు చెవులను కుండలములు ధరించుటకు గాక వేద శాస్త్రములు విని సార్థక మొనరించు కుందురు. చేతులను కంకణ ములను ధరించుటకు గాక దానము చేయుటకు ఉపయోగింతురు. శరీరమును చందనాదుల పూతలచే గాక పరోపకారము చేయుట చేతనే ప్రకాశిం ప జేసు కొందురు.

 

నాస్తి విద్యాసమం  చక్షు:

నాస్తి సత్యసమం తప:

నాస్తి రాగసమం దు:ఖం 

నాస్తి త్యాగసమం సుఖం.

అర్థం:విద్యనూ పోలిన కళ్ళు, సత్యమును పోలిన తపము, 

మాత్సర్యము వంటి దు:ఖ కరము ,త్యాగమును పోలిన సుఖమును లేవు.

 

     తనయుడు చెడుగై యుండిన

     జనకుని తప్పన్నమాట సతమెఱుగుదు గా

     వున నీ జననీ జనకుల

     కు నపఖ్యాతి యగురీతి గొనకు కుమారా!

    తా:--ఓ కుమారా! కొడుకు చెడ్డవాడైన తండ్రి తప్ప. ఇది అందరకు తెలిసినదే. గావున ఈ సత్యమును గుర్తెరింగి నీ తల్లిదండ్రులకు చెడ్డపేరు రాకుండునట్లు నడుచుకొనుము

 

 

భీతేభ్యః    శ్చా భయం  దేయం : వ్యాధి తేభ్య స్తు ఔషధం :

దేయా  విద్యార్థి  నాం  విద్యా : దేయ మన్నం  క్షుధార్థి నాం :

                    అర్థము: భయము చెందిన వారీకి  అభయ దానము, రోగ పీడితులకు 

 ఔషధ  దానము, విద్యార్ధు లకు  విద్యా దానము, ఆకలి గొన్న వారికి అన్నదానము  యిచ్చుట  పుణ్య ప్రదము.


చెరుకు రసంబునకన్ననును జేడెల కన్నను,తేనెకన్న,భా

సుర సుధకన్నదియ్యనైన చూత ఫలంబుల కన్న,ఖండ శ

ర్కర కన్న,ధాత్రి మధురమయి తోచు వివేకి యౌ మహా 

సరసుని తోడ ముచ్చటలు సారెకు సల్పుచున్న భైరవా!


                తా:--రుకురసము,ఆడవారిసాంగత్యము,తేనె,అమృతము,తియ్యనైన మామిడి పండ్లు,కలకండ వీటి అన్నిటికన్నా ప్రపంచములో వివేకి యైన సరసుని తో మాటి మాటికీ జరుపు గోష్టి చాలా తియ్యనైనది.

కామెంట్‌లు లేవు: