9, నవంబర్ 2020, సోమవారం

లడ్డూలు__చీమలు

 *లడ్డూలు__చీమలు*


శ్రీ రామకృష్ణ పరమహంస గారు చెప్పిన ఒక చిన్న సంఘటన...

      

కాళీమాత ఆలయంలో ఓరోజు ప్రసాదంగా ఇవ్వడానికి లడ్డూలు తయారు చేస్తున్నారు. అయితే ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు..

లడ్డూలకి చీమలు పట్టడం మొదలైంది. 

      

లడ్డూ తయారు చేస్తున్న వారికి ఏం చేయాలో తెలీలేదు. చీమలను చంపకుండా ఎలా?" అని ఆలోచనలో పడ్డారు... వాటిని చంపకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్పమని రామకృష్ణ పరమహంస ను సలహా అడిగారు..


అప్పుడాయన చీమలు వస్తున్న దారిలో చక్కెర పొడి చల్లండి.. వాటిని తీసుకుని చీమలు వెళ్ళిపోతాయి.., ఇక ఇటు రావు అని సూచించారు.. పరమహంస చెప్పినట్లే చీమలొచ్చే దారిలో చక్కెర పొడి చల్లారు.. 

ఆ పొడిని చూడటంతోనే వాటిని నోట కరుచుకుని చీమలు కాసేపటి కల్లా అక్కడి నుంచి వెళ్ళిపోవడం మొదలుపెట్టాయి..

సమస్య కొలిక్కి వచ్చింది....    

                     

ఈ దృశ్యాన్ని చూసిన పరమహంస గారు ఇలా అన్నారు...."మనుషులూ ఈ చీమల్లాంటి వారే.. తాము కోరుకున్న వాటిని పొందాలను కుంటూనే తమకు తెలియకుండానే దానిని మధ్యలోనే విడిచిపెట్టి మరొకటేదైనా దారిలో కనిపిస్తే దానితో సరిపెట్టుకుంటారు తప్ప.., ముందనుకున్న లక్ష్యాన్ని విడిచిపెడతారు అని చెప్పారు. 

   

తమకు కావలసింది చక్కెర కాదు, లడ్డూ పొడేనని ఒక్క చీమా ముందుకు రాలేదు.

మనం కూడా అలానే ‘భగవంతుడు సర్వస్వము’ అనుకొనే ధ్యాన సాధన మొదలు పెడతాము.., మధ్యలో ఎవరో ఎదో చెపితే దాని వద్దకు వెళ్లి మన సాధన అంతా వృధా చేసుకొంటాము..

            

తీయగా ఉందన్న చక్కెరతో సరిపెట్టుకుని వెళ్ళిపోయాయి చీమలు. రవ్వంత చక్కెర సంతోషం చాలనుకున్నాయవి. లడ్డూ అంత పరిపూర్ణమైన సంతోషం పొందాలనుకునే వారు చాలా తక్కువ మందే అని పరమహంస చెప్పారు.

కామెంట్‌లు లేవు: