10, నవంబర్ 2020, మంగళవారం

విద్యాగంధం

 శ్లో!రూప యవ్వన సౌందర్యం గుణ శీల సమన్వితం 

                         విద్యాహీనం నశోభంతే పాలాశ కుసుమం వృధా 


ఒకరోజు ఈ   శ్లోకాన్ని చదివారు. మా నాన్నగారు.  అర్థమడిగాను. "ఎన్ని మంచి లక్షణాలు వున్నా విద్యాగంధం లేకుంటే, మోదుగ పూల లాగా వృథా, అని అంటూ, ఈ మోదుగ పూలు అడవిలో ఎక్కవగా పూయడం వల్ల వాటిని ఎవరూ ఆదరించరు, అలాగే, మంచి చదువు లేకున్నా మనిషి పరిస్థితి అంతే" అని ఒక సంబంధిత కథ చెప్పుకొచ్చారు.


పూర్వం ఒక గ్రామంలో సకల విద్యాపారంగతులైన ఒక బ్రాహ్మణ కుటుంబంలో నలుగురు కొడుకులు, ఒక కూతురు వుండేవారు. పదేళ్లు దాటిన తన కూతురికి వివాహం కాలేదని వాపోయేవాడు తండ్రి. చివరకు ఆయన స్నేహితుడి ద్వారా, ఒక సంపన్న కుటుంబంలోని పదహారేళ్ల యువకుడిని అల్లుడిగా చేసుకున్నాడు. అల్లుడు పెద్దగా చదువుకోలేదు. అయితే, ఏం? గొప్ప ఆస్తిపరులు. చిన్నపిల్ల కారణంగా కూతురిని ఇంకా కాపురానికి పంపలేదు.


ఐదేళ్లు గడిచిన తర్వాత, మామగారే వెళ్లి, అల్లుడిని  పండగ సాకుతో తమ ఊరికి   పిలుచుకొని వచ్చాడు. దాదాపు తన వయసు వారే అయిన బావమరదులు, బావగారిని సాదరంగా ఆహ్వానించారు. అందరికీ పాండిత్య ప్రకర్ష వుంది కనుక, శాస్త్ర చర్చలలో తమ పాండిత్యానికి పదును పెడుతూ కూర్చున్నారు.

బావగారు, 'కిం కర్తవ్యం' అన్నట్టు కూర్చున్నాడు. భర్త విద్యాగంధం లేనివాడని గ్రహించిన భార్య, 'పాలాశ కుసుమం వృథా' అని సరదాగా ఆట పట్టించింది. తనను, తన భార్యనే అందరి ముందు అవమానించిందనే ఆవేశంతో, అపార్థం చేసుకొని, అప్పటికి ఏమీ అనకపోయినా, ఎలాగైనా తాను కూడా సంస్కృత విద్యలో ఆరి తేరాలని, ఆ రాత్రికి రాత్రే అత్తగారిల్లు విడిచి వెళ్లిపోయాడు.


కథ కంచికి వెళ్లినట్టు, ఇతడు కూడా విద్యార్జన కోసం కాశీకి బయలు దేరాడు. అక్కడ సర్వ శాస్త్రములు తెలిసిన ఒక గురువు గారి అభయం కోరి,  కాళ్లుపట్టుకొని వదలలేదు. శిష్యుడి ఉద్దేశం గమనించిన గురువుగారు, అతడిని పైకిలేపి, "శుభం నాయనా, నూతి దగ్గరకు వెళ్లి స్నానం చేసిరా, భోజనం చేద్దువుగానీ" అన్నారు. 

పెరటి గుమ్మం పొట్టిగా వున్న కారణంగా, వస్తూ వెళుతూ గుమ్మాన్ని తలకు తగిలించుకునేవాడు. బాగా నొప్పి కలిగేది. అమ్మా! అబ్బా! అని అంటూవుండేవాడు కానీ, చదువు ధ్యాసలో ఇవన్నీ పట్టించుకునేవాడు కాదు. అయితే, గురువుగారు ఇదంతా గమనిస్తూ వుండేవారు.


అతనికి వంటల్లో ఆముదం వేసి పెట్టమని భార్యకు చెప్పాడు గురువుగారు. చదువు ధ్యాస ముందు ఏమీ తెలిసేది కాదు. అలా, ఎంతో నిష్ఠతో రోజులో పదహైదు గంటలు చదువుకు వెచ్చించి, గీర్వాణాంధ్ర భాషలు, తర్క, వ్యాకరణ, న్యాయ, మీమాంసాది షట్ శాస్త్రాలు క్షుణ్ణంగా ఐదేళ్లలో పూర్తి చేసేశాడు. 


ఒకరోజు యథాప్రకారం పెరట్లోకి వెళుతుంటే గుమ్మం తగిలింది. వెంటనే వెనుతిరిగి, "గురువుగారూ, ద్వార బంధం చిన్నగా వుండి, కొట్టుకుంటుంది, మార్పించండి" అన్నాడు. స్నానం చేసి, వచ్చి భోజనం చేస్తూ, "వంటల్లో కొంచెం ఆముదం వాసన వేస్తుంది" అన్నాడు. దీంతో, ఆ దంపతులు నవ్వుకున్నారు. "నాయనా, నీ చదువు అయిపోయింది. ఇక నువ్వు ఇంటికి పోవచ్చు" అన్నారు గురువుగారు.


గురువు దగ్గర సెలవు తీసుకొని చక్కగా, భార్య వున్న గ్రామానికే వచ్చి, అక్కడే ఒక అతిథి గృహంలో బస చేశాడు. గ్రామానికి ఎవరో పండితుడు వచ్చాడని, కర్ణాకర్ణిగా విన్న బావమరదులు  చూడడానికి వచ్చారు. విద్యతో వెలిగిపోతున్న అతడి వర్ఛస్సు, వాళ్లని కదలనివ్వలేదు. అతడి వినయం, గుణ సంపద కట్టిపడేసింది.

 

ఇంత చిన్న వయసులో, ఇంతటి పాండిత్యమా! అని ఆశ్చర్యపోయిన వాళ్లు, అతిథిని తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. అయితే,  ఐదేళ్ల నుండి చూడని కారణంగా, తమ బావగారిని గుర్తించలేదు. పైగా, దీక్షా కేశపాశాలు అడ్డమయ్యాయి. కానీ, ఇతడు వాళ్లను గుర్తు పట్టి, ఆతిథ్యానికి ఒప్పుకున్నాడు.


మరుసటి రోజు ఆతిథ్యానికి బయలుదేరాడు. ఇంత కాలం రాని అల్లుడు, తప్పక ఆత్మహత్య చేసుకొని వుంటాడని నమ్మిన గ్రామస్థులు, వాళ్లను బలవంతంగా ఒప్పించి, అతడికి ఉత్తర  క్రియలు చేయించి, భార్యకు శిరోముండనం కూడా చేయించారు. ఆమే వంటచేసి, అందరికీ వడ్డించింది. ఆ స్థితిలో వున్న భార్యను చూసి, చలించిపోయాడు. నిజంగా మనసులో బాధ పడ్డాడు.


భోజనం చేస్తున్నాడు. కానీ మనసు, మనసులో లేదు. జీలకర్ర, మంచి ఇంగువ వేసిన చారు వాసన అమోఘంగా వుంది. కానీ, ఉప్పు లేదు, రుచి అనిపించలేదు. ఐదేళ్ల క్రితం భార్య అన్న మాట గుర్తుకొచ్చి, అప్పుడు ఎగతాళి చేసిందనుకున్నాడు. కానీ,  వున్నమాటే అనిందని, తానెవరో భార్యకు తెలియజెప్పాలని, ఒక శ్లోకాన్ని వదిలాడు. 


                   శ్లో!చారు చారుసమాయుక్తం, హింగు జీలక మిశ్రితం 

                       కించిల్లవణ శూన్యంచ, పాలాశ కుసుమం వృథా!


అంటూ, గుర్తుపట్టిందా! లేదా అని భార్యవైపు చూశాడు. ఆమె ఆతడిని బాగా గమనించి, గుర్తించింది. ఒరేయ్, మీ బావగారురా! అని తెగ సిగ్గుపడిపోయి, తలపైన కొంగు సర్దుకుంటూ వంటిట్లోకి పరుగెత్తుకెళ్లింది. ఆశ్చర్యపోయిన సోదరులు కూడా అతడిని తేరిపారా చూసి, గుర్తించి, తెగ సంబరపడిపోయారు. 


మరుసటి రోజు అంబష్టుడిని పిలిపించి, క్షవరం చేయించి, నూతన వస్త్రాలతో సత్కరించి, అలంకృతుడిని చేసి, శాస్త్ర ప్రకారం ప్రాయశ్చిత్త, ఆయుష్షు హోమాది వైదిక కర్మలు, దానాదులు చేయించి, చెల్లెలిని సుమంగళిగా అలంకరించారు. గర్భాదాన ప్రక్రియ కూడా పూర్తి చేశారని, కథను ముగించారు మా నాన్నగారు.  

 

ఈ కథ ద్వారా చదువు యొక్క ఆవశ్యకత, విశిష్టత చెప్పడమే మా నాన్న గారి ఉద్దేశమై వుంటుంది. నిజంగా,ఆ తెల్లవారుజామున ఆయన కథ చెప్పిన తీరు, విధానం, నాకు చదువు పట్ల ఎంతో ఆసక్తిని కలిగించాయి.

 

ఈ నాటి యువత కూడా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని అవరోధాలు కలిగినా కృంగిపోకుండా చదువు మీదనే దృష్టిపెట్టి, జ్ఙానాన్ని సంపాదించుకుంటారని మనసారా ఆకాంక్షిస్తున్నాను.

చదివినందులకు ధన్యవాదములు 🙏

అంబాళం పార్థసారథి,

08-09-2016.

----------------------   శుభసాయింత్రం   -----------------------------

కామెంట్‌లు లేవు: