10, నవంబర్ 2020, మంగళవారం

శ్రీ సత్యనారాయణస్వామి వ్రతమహాత్మ్యము

 శ్రీ సత్యనారాయణస్వామి వ్రతమహాత్మ్యము 


            మొదటి అధ్యాయము 


తే  1

శ్రీకరంబైన నైమిశక్షేత్రమందు 

శౌనకాదిగ  వరలెడి సకలమునులు 

వివిధకథలను సూతుచే వినుచునుండి 

వినయమొప్పగ నడిగిరి వేడు కొనుచు 

               

తే   2

"ఎట్టి వ్రతమును జనములు నిలను సేయ 

కామితార్థంబు కల్గును కలియుగమున 

వినగ కోరిక జనియించె  విబుధవర్య ! 

తెలియపరచుడు వినెదము తీరు గాను      

 

కం   3

మునిసంఘము లీరీతిగ 

ఘను సూతును నడిగినంత కడుయుత్చుకతన్ 

విని సూతుడు చిఱునగవుతొ  

ననెమునులతొ నంతటిటుల యానందముతోన్ ;


ఆ   4

నారదుండు దొల్లి  నారాయణుని జూచి 

యివ్విధంబు నడుగ నెరుగ దలచి

మునిని గాంచి యపుడు ముదమంది శ్రీహరి 

నుడివినట్టి  నుడులు నుడివె దిపుడు      

                     

కం.    5

సురముని నారదు డొకపరి 

హరినామము బాడుకొనుచు నవనకి జనియున్   

నరు లచ్చట పలువెతలతొ 

కరమరుదుగబ్రతుకుచుండ  గాంచెను వ్యధతోన్ 


సీ.   6

ఈతి బాధలతోడ నిక్కట్లు పడుచును

                 నకనకలాడెడి నరుల గాంచె 

తనురుగ్మతలతోడ తల్లడిల్లుచు మిగుల 

                 నడయాడుచుండెటి నరుల గాంచె 

ఆత్మశాంతియులేక  నలమట నొందుచు 

                 నలుగుచుండెడి పెక్కు నరుల గాంచె 

ఋణ విత్త బాధల కృశియించి బ్రతుకున

                 నానా వెతలనున్న నరుల గాంచె 

    తే

    నరులు పడియెడి బాధలు నారదుండు 

    కన్నులారంగ జూచియు కడు వ్యదొంది 

    మానవుల బాధ పోగొట్ట మదిని దలచి 

    కదలె వైకుంఠపురముకు గాంచ హరిని 


కం.   7

నారదు డట జని కాంచెను 

నారాయణు శేషతల్పు నవ్యామ్బరునిన్ 

నీరద తను సంకాసుని 

శ్రీరమ సంసేవ్య పాదు శ్రీత మందారున్ 


కం.   8

నారద సంయమి యంతట 

నారాయణు నెదుట నిలిచి నతమస్తకుడై 

ధారాళ మైన నుడులతొ 

యీ రీతిగ ప్రస్తుతించె యీప్సిత మదితోన్ 


మ ద్వి.  9

"శ్రీకరా !శుభకరా !శ్రీచిద్విలాస!

శ్రీ లక్ష్మి సంసీవ్య ! శ్రీ వత్స చిహ్న ! 

కామితార్థ ప్రదాత ! కౌస్తుభ భూష !

వాసుదేవా ! హరీ ! వైకుంఠ వాస  !

శంఖ గదా చక్ర శార్ఙ్గ సంకాశ !

యభయ వరద హస్త యాస్రితపోష !

దేవదేవ ! వరద ! దివ్య ! జీవాత్మ !

దేవవంద్య ! వినుత ! తేజితదేహ !

పరమపురుష ! విష్ణు ! పావననామ !

జయము నారాయణా ! జగదీశ ! విష్ణు !

మాధవా ! కేశవా ! మధుకైటబారి !

శ్రీధరా !గోవింద! శ్రీహృషీకేశ !

వాసుదేవా ! హరే ! వామన ! విష్ణు ! 

యనిరుద్ధ ! ప్రద్యుమ్న ! యచ్యుతా ! దేవ !

నారాయణా ! విష్ణు ! నళినాయ తాక్ష !

పురుషోత్తమా ! దివ్య ! పుండరీకాక్ష !

పాహిమాం పాహిమాం పరమాత్మ! దేవ !

గో విప్ర రక్షకా ! గురుమీన రూప !

కౌస్తుభ మణిహార ! కచ్ఛప రూప !

గోపాల పాలకా ! క్రోడంబ రూప !

నారాయణా ! హరీ ! నరహరి రూప !

వందిత విక్రమా ! వామన రూప !

పృధివీశబలహరా  ! భృగురామ రూప !

రాజీవలోచనా ! రఘురామ రూప !

పాలితయాదవా !బలరామ రూప !

శ్రీచిద్విలాస యో శ్రీకృష్ణ రూప !

వినుతింతు మనసార విష్ణు స్వరూప !

కామితార్థప్రదాత !కరుణించు మమ్ము 

జయము నారాయణా ! జయము యో దేవ !"


కం.   10

సురముని నారదు స్తుతులను 

సిరినాథుడు విష్ణు వినియు స్థిఱ నగవులతోన్ 

పరికించుచు యాతని గని 

కరుణతొ యిట్లనియె నపుడు కడు శాంతమునన్ 


తే.   11

"విమలమానస నారదా ! యేల యిపుడు *

కూర్మితోడను నీవిట కొచ్చినావు ? 

తెల్పు నీకోర్కె యేదైన దీర్తు నిపుడె 

తేటతెల్లంబుగా నీవు దెల్పవయ్య "


కం.   12

నారాయణు డా విధముగ 

కారుణ్యము తోడ బలుక, కడు పులకితు డై 

నారదు డన్తట  భక్తితొ 

యీ రీతిగ బలికె మిగుల వినయము తోడన్ 


సీ  13

"సర్వజ్ఞు డవునీవు సర్వేశ !పరమేశ !

              నీ వెఱుంగని దేది నీరజాక్ష !

మర్త్య లోకమునందు మనుజులుపెక్కురు 

              పలుయోనులందున ప్రభవమొంది 

వివిధ యిడుములందు విధిదప్పి పడుచుండి 

               యనుభవించుచునుండె యమితవగపు 

పాపకర్మలతోడ పలురోగములతోడ 

               పీడింప బడుచుండె పెక్కురీతి 

యమిత బాధల క్లేశాల యనుభవమున 

మహిని జీవించుచున్నట్టి మానవులకు 

బాధలను బాప నేదైన పరమపథము 

బోధజేయగ గోరుదు పురుషశ్రేష్ఠ !"


కం 14

ముని నారదు డావిధముగ 

వినయంబున ప్రభునిగాంచి వేదన తోడన్ 

జనముల బాధలు దెలుపగ 

విని మనమున మెచ్చుకొనియు విష్ణుండనియెన్ 


కం  15

"మునివర ! నీ యభిమతమును 

విని సంతస మొందినాను వేడుక యయ్యన్ 

జగముల క్లేశము బాపగ 

మనమందున దలచు నిన్ను మది శ్లాఘింతున్ 


తే గీ 16

లోక కల్యాణమును గోరి తేకువగను 

యమిత యావేదనంబున యడుగ జూచి 

సంతసంబయ్యె నాకెంతొ సంయమీంద్ర ! 

వినుము దెల్పెద నీకొక్క విమల పథము 


కం 17

వినుమో నారద ! తెల్పెద 

మనమందున కలతమాని మదిస్థిమితమునన్ 

జనులందఱు సుఖ శాంతుల 

మనగల రీ పుణ్య వ్రతము మఱి చేయంగన్ 


తే గీ  18

కామితార్ధ ప్రదాయిని కల్పతరువు 

"సత్యనారాయణస్వామి సద్వ్రతంబు"

యిహమునందున సుఖశాంతు లిచ్చితుదకు 

పరమునందున మోక్షపుప్రాప్త మిచ్చు

కామెంట్‌లు లేవు: