10, నవంబర్ 2020, మంగళవారం

నామ స్మరణం..ముక్తిమార్గం!*

 🚩🛕 *హిందూ ఆధ్యాత్మిక వేదిక*🚩🛕

=======================


*నామ స్మరణం..ముక్తిమార్గం!*


రాబోయే కాలంలో ఎలాంటి సంఘటనలు, ఉపద్రవాలు సంభవిస్తాయో బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పారు. మనకు తెలియని మరో సంగతి ఏంటంటే, ద్వాపర యుగం ముగిసిన తరువాత రాబోయే కలియుగంలో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో కృష్ణ భగవానుడు కూడా ముందే చెప్పాడు. కలి ప్రభావం వల్ల మనుషుల్లో ఎలాంటి మార్పులు వస్తాయో, పాపకర్మలు ఎలా పెరిగిపోతాయో ఆయన తన అవతార సమాప్తిలో చెప్పాడు. అంతేకాదు, కలి ప్రభావం నుంచి బయటపడి, పాపకర్మలను అధిగమించి, పుణ్యకార్యాలవైపు ఎలా వెళ్లాలో కూడా సూచించాడు.


*ద్వాపర యుగాంతం...*


శ్రీకృష్ణ పరమాత్మ అవతారం చాలించడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు ఉద్ధవుడిని పిలిచాడు. తన నిర్యాణం తరువాత కలి ప్రవేశం జరుగుతుందనీ, ఏడో రాత్రి లోపల ద్వారకానగరం అంతా సముద్రమయం అయిపోతుందనీ చెప్పాడు. కలి ప్రవేశించిన తరువాత మనుషుల ఆలోచనా ధోరణి, ప్రవర్తన అన్నీ మారిపోతాయి. అయినప్పటికీ భగవంతుణ్ణి చేరుకోవడం మాత్రం సులభసాధ్యమంటూ కలియుగం గురించి ఇలా వివరించాడు కృష్ణుడు. ఉద్ధవా! కలి ప్రవేశించగానే రెండు విషయాల పైన ఈ ప్రపంచం ఆధారపడుతుంది. ఒకటి కోపం. రెండవది విపరీతమైన కోర్కెలు. వీటివల్ల మనుషుల్లో ఆయుర్దాయం తగ్గుతుంది. విపరీతమైన కోర్కెలతో సంతృప్తి లేకుండా మనుషులుంటారు. తద్వారా ప్రశాంతత కరువై, తీవ్రమైన వ్యాధులు ప్రబలుతాయి. ఒక పక్క దైవభక్తి తగ్గుతుంది. మరోపక్క ఏ దేవతామూర్తి కోర్కె తీరుస్తుందంటే అటు పరుగులు పెడతారు. అంతేగాని దేవుడొక్కడే అంటే ఒప్పుకోరు. మతాల ఆధారంగా పరమాత్మ పట్ల భేదం చూపిస్తారు. సర్వాంతర్యామి అయిన భగవంతుడిలో రూపాన్ని బట్టి రకరకాల భేదాలు చూపి, కొట్టుకుంటారు. భక్తిలేని వాడు దేవుడి పనులను, గుడి నిర్మాణాలను చేపడ్తాడు. 


వేదాల్ని, యజ్ఞ యాగాదుల్ని ధిక్కరిస్తారు. అర్హత లేనివాళ్లు ఆయా పనుల్లో నిష్ణాతులమంటారు. యోగ్యత, పాండిత్యం వల్ల మనుషులు గౌరవింపబడరు. డబ్బు ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్లనే గౌరవిస్తారు. ఇంద్రియాలకు బానిసలవుతారు. తద్వారా అంతశ్శుద్ధి కోల్పోతారు. ఇంద్రియాలతో మనకు ఏదైతే సుఖాన్నిస్తుందో అది మన జన్మను పాడు చేస్తుందనే జ్ఞానాన్ని కోల్పోతారు. అయితే కలియుగంలో దైవనామం చెప్పినంత మాత్రాన వాళ్లకు పుణ్యం లభించి, పాపకర్మల నుంచి విముక్తులవుతారు. అందుకే బదరికాశ్రమం వెళ్లి, నా మూర్తిని ఆశ్రమంలో ఉంచు. ప్రతిరోజూ భగవన్నామం కొంతసేపైనా చెప్పు. కొన్ని పూలు ఆ మూర్తిపై వేయి. అప్పుడు ఆ మూర్తి అహంకారాన్ని తగ్గించి, పుణ్యం వైపు నడిపిస్తుంది. పాపకర్మల నుంచి విముక్తులవడానికి కలియుగాన ఉన్న సులభమార్గమిది. 


*పరమాత్మను చేరే మార్గం..*


పాపకర్మలన్నీ పెరిగిపోయినప్పటికీ కలి ప్రభావం నుంచి బయటపడి, భగవంతుని చేరుకోవడానికి మనం చేయాల్సిన కర్మల గురించి సూచనలు చేశాడు కృష్ణ భగవానుడు. 

దైవ నామస్మరణ, ఎక్కువసార్లు అనవసర విషయాలు మాట్లాడకుండా మౌనం పాటించడం, దైవపూజ, ఇంద్రియ నిగ్రహం, జపం.. వీటిని పాటిస్తే చాలు పాపాల నుంచి విముక్తులమై ఆయన అనుగ్రహం పొందవచ్చు. అంతేకాదు, కోర్కెలను తీర్చుకునే మార్గాలూ ఇవే. అయితే అమ్మో! ఇన్ని చేయాలా అని అన్పిస్తుంది మనకు. కానీ ప్రతిరోజూ దైవనామం స్మరించే సమయాన్ని పెంచుతూ పోవాలి. సాధారణంగా మనం ఏదో ఒక కోర్కె తీరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాం. కాని ఇది సరైన పద్ధతి కాదు. అంతశ్శుద్ధి, ఇంద్రియ నిగ్రహాన్ని ప్రసాదించాలని ప్రార్థించాలి. నామస్మరణతోనే కరుణించే స్వామి వాటిని మనకు ప్రసాదిస్తాడు. అంతశ్శుద్ధితో భక్తి దానికదే వస్తుంది. భక్తి చింతనతో మనకు కావాల్సింది కోరుకుంటే చాలు ఆయనే ఇస్తాడు. అయితే సర్వాంతర్యామి అయిన భగవంతుడికి నాకు కావాల్సిందేమిటో తెలియదా! ప్రత్యేకించి కోరుకోవడమెందుకు.. అని కూడా అన్పించొచ్చు. కాని మన తోటివారితో, స్నేహితులతో ఎందరితోనో మనకు ఫలానా సమస్య ఉందనీ, కష్టం ఉందనీ చెప్పుకుంటూ ఉంటాం. మానవమాత్రులెవరూ తీర్చలేని కష్టాన్ని కూడా ఆ భగవంతుడు తీరుస్తాడు. ఆయన జగద్రక్షకుడు. మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉండే రక్షకుడితో చెప్పుకుంటే బాధ తగ్గుతుందీ, కష్టమూ తీరుతుంది. ఆయా సమస్యల నుంచి విముక్తులమూ అవుతాం. 


*ఇంద్రియ నిగ్రహం.. ఇలా సాధ్యం!*


వివాహం అయిన స్త్రీ తల్లితో సమానమనే భావన కలియుగంలో తగ్గిపోతుంది. పరస్త్రీలు, పర పురుషులపై మోహం కలగడం కలియుగ లక్షణం. దీనికి వివాహంతో సంబంధం లేదు. కలి ప్రభావం వల్ల కలిగే ఈ మోహాల నుంచి బయటపడడానికి కూడా సులువైన మార్గం ఉంది. ఒక అందమైన స్త్రీని చూసినప్పుడు మోహం కలిగితే - ఇంత అందంగా ఉన్న ఈ అమ్మ కన్పించి కరుణించింది. పొద్దున్నే మా అమ్మ జగన్మాత కనిపించి ఆశీర్వదిస్తున్నది అని అనుకోవాలి. అదేవిధంగా పరపురుషుని పట్ల మోహం కలిగినప్పుడు స్త్రీలు - కృష్ణా! నీ జగన్మోహనాకార దర్శనం ఇచ్చావా తండ్రీ! అని అనుకోవాలి. ఇలాంటప్పుడు పాపచింతన కాస్తా పుణ్యం వైపు దారితీస్తుంది. పాపకర్మలను పుణ్యకర్మలుగా మార్చుకునే సాధనం ఇది. క్రమంగా మనసుకు ఇది అలవాటై పోతుంది. ఇక పాపకర్మల వైపు మనసు మళ్లదు. అలాంటి వాళ్ల మనసు నిర్మలంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటారు.

కామెంట్‌లు లేవు: