17, డిసెంబర్ 2020, గురువారం

ధార్మికగీత - 112*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                          *ధార్మికగీత - 112*

                                     *****

          *శ్లో:- సత్సంగత్వే నిస్సంగత్వం ౹*

                 *నిస్సంగత్వే  నిర్మోహత్వం ౹*

                 *నిర్మోహత్వే  నిశ్చలతత్త్వం ౹*

                 *నిశ్చలతత్త్వే   జీవన్ముక్తిః ౹౹*

                                     *****

*భా:- మానవ జీవిత లక్ష్యం మోక్షసాధనయే. సత్పురుష సమాశ్రయమే దానికి సులభోపాయము. 1."సత్సంగత్వము":-  సజ్జన సంగతి వలన ప్రాపంచిక విషయ వాసనలు, మనో వాక్కాయ మాలిన్యము క్రమంగా వైదొలగి, సద్భావాలు, సద్భాషణ, సదాచరణ అలవడతాయి.ఇదే నిస్సంగత్వము. 2."నిస్సంగత్వము":- ప్రాపంచిక విషయ వాసనా నిర్మూలన వలన కామాదులు, మదాదులు,తాపాలు,ఈషణలు ఇత్యాదులపై దట్టంగా పేరుకు పోయిన బలీయమైన వ్యామోహము అణగారి పోతుంది. ఇదే నిర్మోహత్వము.3."నిర్మోహత్వము":- మోహ క్షయము వలన  మన మనస్సు నందు తిష్ట వేసుకున్న చాంచల్యము,అస్థిరత ,వ్యాకులత పూర్తిగా సమసిపోతాయి. తద్వారా ప్రశాంతత,నిశ్చలత, నిర్భరత యేర్పడి, బుద్ధి నిర్మల మౌతుంది. ఇదే నిశ్చల తత్త్వము.   4. "నిశ్చలతత్త్వము":-  నిర్మలమైన  బుద్ధి వలన ఏకాగ్రత, నైష్ఠికత, నిమగ్నతలతో పూతాత్ముడై, భగవద్రతిలో పునీతుడై, ఆత్మ సాక్షాత్కారమును పొంది, సంసార బంధములనుండి విముక్తుడు అవుతాడు. ఇదే జీవన్ముక్తి. సత్పురుషుని యొక్క  దర్శన, స్పర్శన, భాషణ, భావనల మహత్తర ప్రభావమే మానవుని మోక్ష సాధనకు ప్రధానమైన ఆలంబనమని సారాంశము. "త్రిజగతి సజ్జన సంగతి రేకా - భవతి భవార్ణవ తరణే నౌకా" అన్నారు శంకరాచార్యులు." సాధు సంగంబు సకలార్థ సాధనంబు"అని; "పాపం,తాపం చ, దైన్యం చ - హన్తి సజ్జన దర్శనమ్" అని నీతిజ్ఞులు సజ్జన సాంగత్యము వలన కలిగే  అర్థమును ,పరమార్థమును తేటతెల్లము చేశారు.*

                                 *****

                 *సమర్పణ   :   పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: