17, డిసెంబర్ 2020, గురువారం

దివ్యోపన్యాసం

 *"1962లో స్వామి తన దివ్యోపన్యాసంలో పలికిన అమృత వాక్కు"* 


*శరీర పోషణకు ఏ విధంగా ఆహారం ఇస్తారో, అదే విధంగా మనసు, చిత్తము, బుద్దికి కూడా చక్కని ఆహారం ఇవ్వండి. ఉదయం కాఫీ త్రాగకపోతే మీకు తలనొప్పి వస్తుంది. ఉదయం జపం కుదరకపోతే మీకు ఏమి వస్తుంది? ఏమి రావటం లేదంటే మీరు దానిని ఒక అలవాటుగా చేసుకోలేదన్నమాట. ఉదయం ఆకలి మిమ్మల్ని వంటింటిలోకి లాక్కొని వెళుతుంది. కానీ మిమ్మల్ని పూజ గదిలోకి లాక్కొని వెళ్లగలిగేది ఏమి లేదు కదా! మీ ఇంట్లో పూజ గది ప్రత్యేకంగా లేక పోవచ్చు. కానీ, ఇంట్లో ఒక మూల ధ్యానానికి, జపానికి, పూజకు కొంత జాగా ఏర్పాటు చేసుకోండీ. అక్కడ రోజుకు కనీసం రెండు సార్లు విశ్రాంతిగా కూర్చోండి. అది ఆత్మకు ఆహారం ఇచ్చే సమయం అవుతుంది. అలసిపోయిన మనస్సనే పక్షి తిరిగి శక్తిని పొందాలంటే, భగవంతుని వైభవం అనే చెట్టు మీద కూర్చొని, సర్వేశ్వర చింతన అనే విశ్రాంతిని తీసుకోవాలి. సత్సంగం కూడా ఒక బలవర్ధకమైన ఔషదం వలె పనికి వస్తుంది. మనసు, బుద్ధి, చిత్తములను ఆకలితో ఉంచకండి. వాటికి సరైన ఆహారం పెట్టక పోతే అవి హీనమైన ఆహారం వైపు వెళ్ళే ప్రమాదం ఉంది. వాటికి సరైన ఆహారం అందిస్తే, వాటి కర్తవ్యాలను అవి చక్కగా నిర్వర్తిస్తాయి. లోపల ఉన్న ఆత్మను ప్రకాశింప చేయటమే వాటి పని. సమస్తము ఆత్మయే అని మీరు గ్రహించటానికి అవి మీకు సహాయపడతాయి. నేను చెప్పిన విషయాలు మీరు ఆచరించి చూడండి. ఫలితాన్ని మీరు ఎంతో ఆనందిస్తారు.*

కామెంట్‌లు లేవు: