17, డిసెంబర్ 2020, గురువారం

మొగిలిచెర్ల

 *వీడిపోయిన పీడ..*


"ఒక నెల రోజులపాటు ఇక్కడ ఉండాలని అనుకుంటున్నాము..మాకు ఉండటానికి ప్రత్యేకంగా ఏదైనా గదిని కేటాయించి ఇస్తారా?.." అని ఆ దంపతులు మా సిబ్బందిని అడుగుతున్నారు.."ప్రత్యేకంగా ఇవ్వడానికి గదులేవీ లేవు..అందరితోపాటు మీరు కూడా ఆ షెడ్ లోనే ఉండాలి..ఓ ప్రక్కగా వంట చేసుకోండి..రాత్రిపూట అందరూ స్వామివారి మందిర మంటపం లోనే పడుకుంటారు..మీరు కూడా అక్కడే పడుకోవచ్చు..శని ఆదివారాల్లో ఇక్కడ అన్నదానం చేస్తారు..ఆ రెండురోజులు మీరు భోజనం చెయ్యొచ్చు.." అని మా వాళ్ళు వాళ్లకు నచ్చచెపుతున్నారు..ఈ సంఘటన జరిగింది 2007 వ సంవత్సరం లో..ఆ సంవత్సరమే మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం వద్ద శని ఆదివారాల్లో అన్నదానం చేయడం మొదలుపెట్టింది..


ఆ వచ్చిన దంపతులకు అరవై ఏళ్ల పైబడిన వయసు ఉంటుంది..ఇద్దరు పిల్లలు కూడా..ఇద్దరూ ఆడపిల్లలే..పెళ్ళిళ్ళు చేసి పంపించేశారు..భార్యా భర్తా ఇద్దరూ తమ పొలాన్ని చూసుకుంటూ..జీవితాన్ని లాక్కోస్తున్నారు..కానీ గత రెండు మూడు నెలల నుంచీ భార్య ప్రవర్తన లో మార్పు వచ్చింది..ఒక్కొక్కసారి పెద్ద పెద్ద కేకలు పెడుతుంది..చేతిలో ఉన్న వస్తువులను విసిరి కొట్టడం..క్రిందపడి దొర్లడం చేస్తోంది..పాపం ఆ భర్తకేమీ పాలుపోవడం లేదు..కూతుళ్ల ను రమ్మని చెప్పిపంపాడు..వాళ్ళూ వచ్చారు..రోజులో ఒకటి రెండు సార్లు ఈ విధంగా ప్రవర్తిస్తోంది..ఒంగోలు , గుంటూరు విజయవాడ తదితర పట్టణాల్లోని మానసిక వైద్యులకు చూపారు..ఏవో మందులు ఇచ్చారు కానీ..గుణం కనబడలేదు..


"నాన్నా..మొగలిచెర్ల గ్రామం లోని శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం దగ్గర కొన్నాళ్ళు పాటు నిద్ర చేస్తే..లోపలేవన్నా గాలి చేష్టలు ఉంటే వెంటనే వదిలిపోతాయని చెప్పుకుంటున్నారు..అమ్మను అక్కడికి తీసుకెళదాము.."అని చిన్నకూతురు సలహా ఇచ్చింది..ఆ తండ్రి కి ఈ మాట మీద గురి కుదిరింది.."అమ్మను తీసుకొని నువ్వు దత్తాత్రేయ స్వామి వద్దకు వెళ్ళు..మేము మా ఇళ్లకు వెళ్లి, అన్నీ సర్దుకొని..రెండు మూడు రోజుల్లో అక్కడికి వచ్చి నీకు చేదోడుగా ఉంటాము .." అని కూతుళ్ళిద్దరూ చెప్పారు..ఆ విధంగా ఆ దంపతులు మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు..


ప్రతిరోజూ ఉదయాన్నే తలారా స్నానం చేసి..ఆ దంపతులు శ్రీ స్వామివారి మందిరం లో 108 ప్రదక్షిణాలు చేయసాగారు..మొదటి మూడురోజుల్లో ఆమెలో పెద్దగా మార్పు రాలేదు..నాలుగోరోజు మధ్యాహ్నం.."దత్తాత్రేయా..నన్ను పంపడం నీ తరం కాదు..ఈ మనిషిని వదిలిపెట్టి పోనూ.." అంటూ ఆమె కేకలు వేస్తూ మంటపం లో క్రిందపడి పొర్లుతూ కేకలు వేయసాగింది..ఈ రకంగా సుమారు ఒక గంటపాటు అరచి..ఆమె అలాగే పడుకొని నిద్ర పోయింది..


సాయంత్రం నాలుగు గంటల వేళ, ఆమె లేచి మెల్లిగా బావి వద్దకు వెళ్లి, స్నానం చేసి..ఆ తడిబట్టల తోనే మందిరం లోకి వచ్చి, బోర్లా పడుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది..పాపం ఆమె భర్తకు ఏమీ పాలుపోవడం లేదు..రోజూ కన్నా ఈరోజు ఆమె ప్రవర్తన విపరీతంగా ఉంది..రెండు చేతులెత్తి స్వామికి నమస్కారం చేసుకుంటున్నాడు..ఇంతలో వాళ్ళ కూతుళ్లు కూడా సాయంత్రం బస్ కు వచ్చారు..


మరో రెండు గంటలు గడిచింది.."దత్తాత్రేయా నాకు సెలవిప్పించు తండ్రీ..నేను వెళ్లిపోతాను..ఈ బాధ పడలేను..ఈ మనిషిని వదిలి పోతాను నాయనా.." అంటూ ఏడుస్తూ చెప్పసాగింది..అలా ఒక అరగంట ఏడ్చి, ఏడ్చి..సొమ్మసిల్లి పడి నిద్రపోయింది..ఆరాత్రి ఆమె ఎటువంటి గలభా చేయలేదు..


తెల్లవారుజామున నిద్రలేచి..ఆమెనే కనిపెట్టుకొని ఉన్న భర్త, పిల్లల వద్దకు వచ్చి..తన తలమీద పెద్ద బరువు దిగిపోయినట్లుగా ఉన్నదనీ..రాత్రంతా బాగా నిద్రపోయాననీ చెప్పుకున్నది..ఆతరువాత ఆమె లో ఆ విపరీతపు ధోరణి కనబడలేదు..రెండురోజుల పాటు ఆమెను జాగ్రత్తగా గమనించిన భర్తా పిల్లలకు తమ ఇంటి మనిషి పూర్తిగా కోలుకున్నదని అర్థమై పోయింది..


"నాన్నా..ఈ దత్తాత్రేయ స్వామి దయవల్ల అమ్మ మామూలుగా మారిపోయింది..మనం త్వరగా ఇక్కడికి వచ్చి మంచి పని చేసాము..ఆ స్వామి దయవల్ల బాగుపడ్డాము..మనం కూడా ఈ ఆదివారం ఇక్కడ అన్నదానము చేద్దాము.." అని చిన్నకూతురు చెప్పింది..అందరూ సరే అన్నారు..తాము వచ్చే ఆదివారం నాడు అన్నదానం చేసి, తమ ఊరికి వెళతామని మాతో రెండురోజుల ముందు చెప్పారు..ఈ వారం రోజులూ ఆ సంసారాన్ని దగ్గరుండి చూస్తున్న మాకు..ఇది  శ్రీ స్వామివారు చూపిన మరో లీల అని అనుకున్నాము..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: