1, డిసెంబర్ 2020, మంగళవారం

పట్టించుకోవద్దు

 "ఇతరులు ఏమనుకుంటున్నారో, ఏమి చేస్తున్నారో, పట్టించుకోవద్దు. నీకున్న సమస్యలు చాలు. మొదట నీలో పరివర్తన తెచ్చుకో, తరువాత ప్రపంచం సంగతి చూడటానికి కావలసినంత సమయముంటుంది. నిన్ను నీవు ఉద్ధరించుకోలేకపొతే, లోకాన్నేం ఉద్ధరించగలవు ?" అనేవారు శ్రీ భగవాన్. శ్రీ రమణులను భక్తులు శ్రీ భగవాన్ అనో, మహర్షి అనో, మరే ఇతర అవతారమూర్తి అనో ఆరాధించినా, మిగిలిన వాళ్ళకి వారు అతి సామాన్యుల వలె కనబడేవారు. కొన్ని వేలమంది నడుమ ఉన్నాకూడా, వారు తమ ఆత్మనిష్ఠలో నిలకడగా ఉండేవారు. ఆ స్థితినుంచి ఏ మాత్రము చలించేవారు కారు. ఒక పోలెండు దేశ వనిత శ్రీ భగవాన్ దర్శనానికి వచ్చింది. ఆమె అనుభవం ఇది. ఆమె ఒంటరిగా స్కందాశ్రామానికి వెళ్లిందొకసారి. తిరిగి వస్తుండగా ఆమెకి దాహంవేసింది. ఆ దప్పికని తీర్చుకోవటానికి మార్గం తెలియక, ఆమె, "శ్రీ భగవాన్ సర్వవ్యాప్తమన్నమాటే నిజమైతే ఆయన ఈ క్షణాన, ఇక్కడ నాకు కనబడి నా దప్పికని తీర్చకూదడా? అనుకుంది. మరుక్షణం శ్రీ భగవాన్ అక్కడ తన కమండలంలో నీటితో ప్రత్యక్షమై ఆమె దాహాన్ని తీర్చారు. ఇది జరుగుతుండగా శ్రీ భగవాన్ ఆశ్రమంలో తమ స్థానంలోనే కూర్చునేఉన్నారు, గిరిపైన జరుగుతున్న జగన్నాటకం గురించి ఏమీ తెలియనట్టుగా. ఆ పోలెండ్ యువతికి గొప్ప భక్తీ, ప్రేమా ఉన్నాయి. క్రిస్టియన్ కూడా. ఏసుక్రీస్తు వలె మహిమలని ప్రదర్శించగలగినవారు క్రీస్తువంటి వారేనని ఆమె నమ్మకం. ఆమె భక్తికి మెచ్చిన భగవాన్ ఆమె విస్వాసాన్ననుసరించే ఆమెకు దర్శనమిచ్చి ఆమె కోర్కెను తీర్చారు. ఇటువంటి సంఘటనల వల్ల భక్తుల నమ్మకమూ, భక్తీ ఎక్కువ అవుతాయి కాని, అతీంద్రియశక్తులను ప్రదర్శించే ప్రయత్నాలు చేయవద్దని శ్రీ భగవాన్ చెప్పేవారు. అన్నివేళలా ఆత్మని గుర్తుంచుకొమ్మని భక్తులను హెచ్చరించే వారు. విదేశీయుడొకరు, రామణాశ్రమములోని , భోజనశాల బయటపడిఉన్న విస్తళ్ళను ఊడుస్తూండటం చూసి, శ్రీ భగవాన్ "వాడేసిన విస్తళ్ళను ఊడ్వటం ముక్తికి మార్గమా? ఈ తపస్సు చేయటానికేనా ఇంత దూరం వచ్చింది? లోపలికి వెళ్ళు, మనస్సుని పరిశుద్ధం చేసుకోవటమనే పనిలో నిమగ్నమవు. అదే అన్నింటికంటె గొప్పసేవ. అదే నీకు మోక్షమివ్వగలదు" అన్నారు.


శ్రీ భగవాన్ దర్శనానికి వచ్చిన వారు కొందరు సాష్టాంగ నమస్కారం చేస్తుండేవారు. అటువంటి ఒక భక్తునితో, "గురువుకి నమస్కారం చేయటంవల్ల అహంకారం నిర్మూలమవుతుంది, అదే ఫలితం. ఆత్మసాక్షాత్కారం ఒళ్ళు వంచటం వల్ల కలుగదు. అహంకారాన్ని వంచాలి" అన్నారు. "లోపల ఉన్న శుద్ధమైన ఎరుకే దయామయమైన గురువు పాదాలు. వాటితో సంపర్కమే మోక్షాన్నివ్వగలదు" అని చెప్పారు.


1924లో ఒక రాత్రివేళ కొందరు దొంగలు ఆశ్రమానికి వచ్చి లోపలికి చొరబడదామని కిటికీల రెక్కలను పగులకొడ్తున్నారు. శ్రీ భగవాన్ , "ఆశ్రమంలోకి రావటానికి అంత శ్రమపడతారెందుకు? తలుపు తెరుస్తాం. మీకు కావలసినది తీసుకువెళ్ళవచ్చు" అన్నారట. తలుపుని తీయించారు కూడా. అయినా దొంగలు శ్రీ భగవాన్ ని భౌతికంగా గాయపరిచారు. ఒక భక్తుడు దీనిని సహించలేక వాళ్ళని తిరిగి కొట్టడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు శ్రీ భగవాన్ అడ్డుకొని, "శాంతం! శాంతం! ఇదేంపని? వాళ్ళు దొంగలు, వాళ్ళ వృత్తే దొంగతనం చేయటం. అందుకోసం ఏదైనా చెయ్యటానికి వాళ్ళు సిద్ధమే. మనమా సాధువులం. వాళ్ళు చేసిన చెడు పనులనే మనం కూడా చేస్తే వాళ్ళకీ, మనకీ తేడా ఏమిటి?" అన్నారు. ఆ భక్తుడు శాంతించాడు. తరువాత శ్రీ భగవాన్ "ఎట్టి పరిస్థితుల లోనూ, తమ సన్యాస ధర్మాన్ని సాధువులు విడవకూడదు" అని చెప్పారు.


భగవాన్ అందరికీ, అన్నివేళలా అందుబాటులో ఉండేవారు. వారిని దర్శించటానికి ఎవ్వరి అనుమతీ అవసరమయ్యేది కాదు. ప్రారంభదశలో భక్తులు వారి చుట్టూ పడుకొనేవారు. ఆయన రాత్రివేళల లేచి బయటికి వెళ్ళవలసివస్తే ఆ భక్తుల మధ్య నుంచి ఎంతో జాగ్రత్తగా వెళ్లేవారు. ఒక భక్తుడు ఇచ్చిన టార్చిలైటును ఎంతో బలవంతం మీద భగవాన్ తీసుకున్నారు. కానీ, ఆ టార్చిలైటుని ఎవ్వరికీ ఇబ్బంది కలుగకుండా వాడేవారు. రాత్రిళ్లు బయటకు వెళ్ళవలసివస్తే, ఆ లైటును నేలమీద పడేట్టు వేస్తే అక్కడ పడుకున్న వారికి నిద్రాభంగం కలుగుతుందని, పొట్టమీద పడేట్టు చేసుకునేవారు! ఇతరులంటే అంత శ్రద్ధ వారికి.


స్కందాశ్రమంలో ఒక నెమలి శ్రీ భగవాన్ వెంటే తిరుగుతూఉండేది. ఒకనాడు ఒక పెద్ద నల్లత్రాచు ఆశ్రమంలోకి వచ్చింది. నెమలి దాన్ని తీవ్రంగా ఎదుర్కొంది. త్రాచు పడగవిప్పింది. ఇక ఆ సహజ శత్రువులు భీకరపోరాటానికి సంసిద్ధమవుతున్నాయి. శ్రీ భగవాన్ పాము దగ్గరకు వెళ్లి, "ఎందుకు వచ్చావిక్కడికి? నెమలి నిన్ను చంపేస్తుంది, ఇక్కడనుంచి వెళ్ళిపో " అన్నారు. వెంటనే పాము తలదించుకుని వెళ్ళిపోయింది.

మార్కండేయులవారు ఇలా అన్నారు. ద్రవిడ దేశమునందు (దక్షిణ భారతదేశంలో) 'అరుణాచలము' అనే దివ్య క్షేత్రం కలదు. ఈ క్షేత్రం పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన క్షేత్రం. ఈ క్షేత్రం యొక్క తేజస్సు దాని చుట్టూ ఉన్న మూడు యోజనాల వరకు వ్యాపించియుండును. ఇది హృదయక్షేత్రం. ఇచట శివుడు పర్వతాకారం దాల్చి ఉన్నాడు. లోకశ్రేయస్సు కొరకు అరుణగిరి యోగి అరుణాచల పర్వతంగా ఆవిర్భవించిన గొప్ప క్షేత్రమే అరుణాచలము. సిధ్ధులు , మహర్షులు , దేవతలు , యక్షులు , గంధర్వులు , అప్సరులు మరియు విద్యాధరులు కొలువుతీరిన గొప్ప క్షేత్రం అరుణాచలం. మేరు పర్వతం, కైలాస పర్వతం, మందరగిరి -- వీటన్నిటి కంటే అరుణగిరి మిక్కిలి గొప్పది. అరుణగిరి వద్దనున్నవారికి మోక్షం సులభంగా అనుగ్రహింపబడును. కావున దేవతలు కూడా అరుణాచలవాసాన్ని కోరుకుంటారు. ఇచట పెరిగే వృక్షాలకు పర్వతాకారంలో కొలువుతీరిన శివుని, తమ ఆకులతో, పండ్లతో , పుష్పాలతో పూజించుకునే పుణ్యోపేతమైన అవకాశం ఉన్నందువలన , అరుణాచలంలో పెరిగే వృక్షాలు స్వర్గంలో ఉన్న కల్పవృక్షాలకంటే కూడా ఎంతో గొప్ప వైశిష్ట్యం గలవని పురాణోక్తి.

కామెంట్‌లు లేవు: