1, డిసెంబర్ 2020, మంగళవారం

వాజివాహనం

 *వాజివాహనం* 🐴🦄🐅🐆


               

              ఏ దేవాలయములోనైనా మూల విరాట్టుకు ( దేవునికి) ఎదురుగా ధ్వజస్థంబము వుంటుంది.  అట్టి ధ్వజస్థంబము మొదట్లో కాని పైన గాని , ఆదేవునికి సంభందించిన వాహనము గాని బంటు ( సేవకుడు) గాని వుంటారు. ఉదాహరణకు: - విష్ణు ఆలయం గరత్మంతుడు, శివాలయంలో నంది, రామాలయంలో హనుమంతుడు వుంటారు. 


               అయ్యప్పస్వామి వారి ఆలయంలో ధ్వజస్థంబముపై స్వామివారి వాహనమైన అశ్వము వుంటుంది. శ్రీ అయ్యప్పస్వామి పులివాహనుడని కీర్తించ బడుతున్నాడు. కాని వారి వాహనము గుఱ్ఱము . వాడుక భాషలో పిలిచే గుఱ్ఱము నకు 1. అశ్వము, 2. హయము, 3. హరి, 4. వాజీ, 5. తురగము అనే పేర్లుకూడా వున్నాయి. 


                     మనిషి యొక్క మనస్సు చంచల స్వభావము కలది. అది విషయవాసనలు, కోరికల వెంట గుఱ్ఱము వలె పరుగులు తీస్తూవుంటుంది. దాని వేగమునకు అంతేలేదు. అది మనకు తెలియకుండానే మన స్వాధీనములో లేకుండా పరుగులు తీస్తూవుంటుంది. 


                      తన స్వాధీనములో లేని గుర్రమును స్వాధీన పరచుకొని, సరియైన మార్గమున , తనకు కావలసిన , తనకు నచ్చిన మార్గమున నడిపించ గలిగినవాడే అసలైన రౌతు. 


                     ఆప్రకారంగా మనస్సు అను గుర్రమునకు స్వామి ( భగన్నామము ) నామము అను కళ్ళెము వేసి , దాని వేగమును నిరోధించి , స్వాధీనపరచుకొని భక్తిమార్గమున నడిపించి స్వామివారిని చేరవలయున్నదే పరమార్ధము. 


                    స్వామివారికి జితేంద్రియుడు అను నామము కూడా వున్నది. జితేంద్రియుడనగా ఇంద్రియము ( పంచజ్ఞానేంద్రియములు +పంచకర్మేంద్రియములు , మనస్సు,బుద్ధి ) లను జయించిన లేక స్వాధీన పరచుకున్న వాడని అర్ధము. 


                   ఇంద్రియములను జయించినవారు ఎవరైనా ( దేవునితో ) స్వామితోసమానము. అనగా భక్తుడు భగవంతుడు ఒక్కటౌతున్నారు . జీవాత్మ పరమాత్మలో కలిసి పోతున్నాడు. కనుక భగవంతునితో , అయ్యప్పస్వామితో సమానంగా స్వామీ అని పిలిపించుకొనుటకు అర్హుడౌ తున్నాడు. 


                    కనుక మనముకూడా మన మనస్సు అను గుఱ్ఱమును స్వాధీన పరచుకొని , స్వామి అనుగ్రహము పొందుటకు, స్వామి సన్నిధిని చేరుకొనుటకు , స్వామీ అని పిలిపించుకొనుటకు సరియైన అర్హతను సంపాదించు కొనుటకు ప్రయత్నం చేద్దాం. స్వామి శరణం.

కామెంట్‌లు లేవు: