1, డిసెంబర్ 2020, మంగళవారం

మొగలిచెర్ల అవధూత

 *శ్రీ మెంటా మస్తాన్ రావు గారు..*


మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు, మా తల్లిదండ్రులకు (శ్రీ పవని శ్రీధర రావు, నిర్మల ప్రభావతి దంపతులు) పరిచయమయ్యే నాటికే, విజయవాడ వాస్తవ్యులు శ్రీ చక్కగా కేశవులు గారు స్వామి వారిని పరిపూర్ణంగా నమ్మి, భక్తి తో సేవిస్తున్నారు..స్వామి వారు మాలకొండలో తపస్సు చేసుకునే పార్వతీ అమ్మవారి మఠం లో ఓ స్టీలు మంచం ఏర్పాటు చేశారు..తరువాతి కాలంలో శ్రీ కేశవులు గారు, మా అమ్మా నాన్న గార్లకు పరిచయం కావడం , ఆ అనుబంధం చివరి వరకూ కొనసాగడం, ఇప్పుడుకూడా శ్రీకేశవులు గారి అబ్బాయి కృష్ణ , మేమూ సత్సంబంధాలు కలిగి వుండటం ఆ దత్తుడి కృపే..


ఆ కేశవులు గారి తోడల్లుడు శ్రీ మెంటా మస్తాన్ రావు గారికి కూడా 1973 ప్రాంతంలో శ్రీ స్వామి వారు కేశవులు గారి ద్వారానే పరిచయం అయ్యారు..వారూ స్వామి వారికి పరమ భక్తులుగా మారిపోయారు..శ్రీ కేశవులు గారు, తమ కూతురు వివాహానికి రమ్మని స్వామి వారిని మరీ మరీ కోరి, మొత్తానికి స్వామి వారు విజయవాడ వచ్చేటట్లు ఒప్పించగలిగారు..


శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఉండాటానికి శ్రీ మెంటా మస్తాన్ రావు గారి ఇంట్లో బస ఏర్పాటు చేశారు..ఇది మస్తాన్ రావుగారికి ఊహించని వరం..ఆ దంపతులిద్దరూ పొంగిపోయారు..స్వామి వారు మాత్రం ఎక్కడఉన్నా ఒకేవిధంగా ఉండగలిగే వారు..వారి తపోసాధన కానీ.. ఆహారపుటలవాట్లు కానీ.. ఎటువంటి మార్పు లేకుండా ఉండేవి..శ్రీ మస్తాన్ రావు గారికి ఆధ్యాత్మిక చింతన కాస్త ఎక్కువ..శ్రీ స్వామివారి సాహచర్యంతో అది మరికొంచెం ఎక్కువ అయింది..సాక్షాత్తూ ఆ దత్తాత్రేయుడు తన ఇంటికొచ్చి తనకు ఉపదేశం ఇచ్చినట్లు గా భావించేవారు..శ్రీ మస్తాన్ రావు గారు మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరానికి వచ్చినప్పుడల్లా..శ్రీ స్వామివారు తమతో గడిపిన కాలం తాలూకు జ్ఞాపకాలను పదే పదే మాతో చెప్పుకొని తన్మయత్వం చెందేవారు..


"ఇప్పటికీ శ్రీ స్వామివారు మా ఇంట్లో తిరుగుతున్న అనుభూతి కలుగుతుందయ్యా.. మహానుభావుడు..దాదాపు పది రోజులపాటు వున్నాడు..ఎంతో బోధ చేసాడు..మా జన్మ తరించింది!.." అని మా దంపతులతో చెప్పేవారు..


శ్రీ మస్తాన్ రావు గారికి వాస్తు శాస్త్రం మీద అవగాహన ఉంది..తన సందేహాలను స్వామి వారిని అడిగారు..స్వామి వారు తమ ధ్యానం అయిపోయిన తరువాత వారి సందేహాలను నివృత్తి చేసేవారు..శ్రీ స్వామివారి మందిరం లో ఏవైనా మార్పులు చేర్పులు చేసే ముందు మేము కూడా శ్రీ మస్తాన్ రావు గారిని సంప్రదించడం ఒక ఆనవాయితీ..

ఈరోజు మేము మందిరం లో ఉంచిన స్వామి వారి ఫోటో...శ్రీ మస్తాన్ రావు గారి ఇంటిలో తీసినదే..స్వామి వారి అసలు రూపం లో లభ్యమవుతున్న ఒకేఒక్క ఫోటో అదే..


ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు..అదేవిధంగా శ్రీ స్వామివారి ఆరాధానోత్సవానికి శ్రీ మెంటా మస్తాన్ రావు గారి దంపతులు మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం దర్శిస్తూ ఉన్నారు..మొగలిచెర్ల స్వామి వారిని దర్శించే ఆర్యవైస్యుల సౌకర్యార్థం ఓ అన్నదాన సత్రాన్ని, వసతి గృహాన్ని ఏర్పరచే పధకం లో..స్వామి వారి ఆశ్రమ నిర్మాణ దాత శ్రీ మీరాశెట్టి, చెక్కా కేశవులు గారితో కలిసి చురుకుగా పాల్గొని దానిని పూర్తి చేశారు...


ఎనభై ఏళ్ళు పైబడినా.. ఓపిక చేసుకుని శ్రీ స్వామి వారి మందిరం దర్శించడానికి మళ్లీ ఈమధ్య మొగలిచెర్ల కు వచ్చారు..స్వామి వారి సమాధిని దర్శించుకుని, ఆనాటి అనుభవాలు గుర్తు చేసుకొని, మా దంపతులను ఆశీర్వదించి వెళ్లారు..తమకు ఓపిక ఉన్నంతవరకూ దర్శనానికి వస్తుంటామనీ..ఆ శక్తి శ్రీ స్వామివారు తమకు ఇస్తాడనీ నమ్మకంగా చెప్పి మరీ వెళ్లారు..


శ్రీ స్వామివారి కృపను పరిపూర్ణంగా పొందిన శ్రీ మస్తాన్ రావు గారు గత సంవత్సరం విజయవాడ లోని వారి స్వగృహం లో పరమపదించారు..మాకందరికీ పెద్ద దిక్కుగా ఉన్న శ్రీ మస్తాన్ రావు గారి మరణం మాకు తీరని లోటు..కానీ దైవ నిర్ణయాలను ధిక్కరించలేము కదా..


ఈమధ్యనే శ్రీ మస్తాన్ రావు గారి కుటుంబసభ్యులు శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి, ఆ శనివారం సాయంత్రం జరిగిన పల్లకీసేవ లోనూ..ఆ ప్రక్కరోజు ఆదివారం ప్రభాత సేవ లోనూ పాల్గొన్నారు.."మాకు వీలున్నప్పుడల్లా ఈ మహానుభావుడి సమాధి దర్శనం చేసుకుంటామండీ.." అని మస్తాన్ రావు గారి సతీమణి చెప్పారు..వారి కుటుంబానికి ఆ దత్తాత్రేయుడి ఆశీస్సులే రక్ష..!!


సర్వం..

శ్రీ దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: