20, డిసెంబర్ 2020, ఆదివారం

ఆణిముత్యం

 *💎నేటి ఆణిముత్యం💎*



ఆపగాలి వెంట అడవుల వెంటను

కొండరాళ్ల వెంట గొడవ నేల

ఉల్లమందె శివుడటుండుట తెలియరు

విశ్వదాభిరామ వినురవేమ


*భావం :*


పుణ్య తీర్థాలంటూ క్షేత్రాలంటూ నదీ తీరాలకు తరలి వెళ్లడమెందుకు? అరణ్యాల్లో సంచరించడమెందుకు? కొండల్లో ఆయాస పడడమెందుకు? శివుడు నీ శరీరం లేదా హృదయంలోనే ఉన్నాడు కదా! బయట వెతికి గందరగోళానికి గురి కావటమెందుకు అని ప్రశ్నిస్తున్నాడు వేమన. ఒక తాత్త్విక స్థాయిలో తీర్థ యాత్రలను నిరుత్సాహపరుస్తూ వేమన అనేక పద్యాలు చెప్పాడు. వాటిలో ఇది మరొక మంచి రత్నం.


ఆపగాలి అంటే (ఆపగ+ఆలి) నదుల సమూహం అంటే వేణీ సంగమం. ఆలి (ఆళి) అంటే వరుస లేదా సమూహం. ఆపగ అంటే నది కావొచ్చు, యేరు కావొచ్చు. అప్ అంటే నీరు. ఆపగ అంటే నీటితో గమించేది, అంటే వెళ్లేది అని అర్థం, ప్రవాహమన్న మాట! ఆపగాలి అనే సమాసం నాకు తెలిసినంతవరకు ఎవరూ వాడినట్టు లేదు.


కొత్త సమాసాలు కూర్చటం మహాకవుల లక్షణం. uninvolved constructions అంటారు ఇట్లాంటి వాటిని. ‘గొడవనేల’ అంటున్నాడు వేమన. గొడవ అంటే మనకు తెలిసిందే. ఇబ్బంది, అలజడి అంటూ ఇంకా సందర్భాన్ని బట్టి ఎన్నో ఛాయలు. కన్నడంలో ‘గొడవె’ అంటే గందరగోళం.0

‘నీవు చదివింతు వనుచు నన్నియును విడిచి

బిచ్చమెత్తంగ రాదుగా బేల తపసి

కడవ నాడకు చాలు నీ గొడవయేల

వెజ్జుదనమేల యని మది లజ్జవొడమి’ అనేది ప్రయోగం.

ఉల్లమంటే హృదయం.


తీర్థాలు సాధారణంగా నదుల, యేరుల దగ్గర వెలసి ఉంటాయి. త్రివేణీ సంగమం, ఏడు పాయల దుర్గ ఇట్లాంటివి. కొండలపైన అరణ్యాల్లో వెలసిన శ్రీశైలం, తిరుమల, సింహాచలం, అహోబిలం లాంటివి క్షేత్రాలు. లోపల భక్తి లేనప్పుడు వీటి సందర్శనం వల్ల అంత ప్రయోజనం లేదంటున్నాడు వేమన. ‘చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా!’ అన్నాడు గతంలో. ఈ పద్యంలో శివుడంటే శివుడే కానక్కరలేదు. దేవుడు, పరమేశ్వరుడన్నమాట! అంతా నీలోనే ఉంది, బయట దొరికేది స్వల్పం. అంతా తిరిగి మళ్లీ నువ్వు నీలోకి రాక తప్పదు అని సారాంశం.



*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

కామెంట్‌లు లేవు: