20, డిసెంబర్ 2020, ఆదివారం

మొగలిచెర్ల

 *గుణపాఠం..*


"నిన్న ఉదయం బస్ లో ఇక్కడికి వచ్చానండీ..స్నానం అయ్యాక స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాను..శనివారం నాడు సమాధిని చూడొచ్చు కానీ సమాధిని ముట్టుకొని నమస్కారం చేసుకునే అవకాశం లేదు అని పూజారిగారు చెప్పారండీ..అందువల్ల ఆ గర్భాలయపు తలుపు ఇవతలి నుంచి శ్రీ స్వామివారి సమాధిని చూసానండీ..అక్కడినుంచే నమస్కారం చేసుకున్నాను..పల్లకీసేవ సాయంత్రం జరుగుతుంది అని చెప్పారండీ..సమయం చాలానే వుంది కదా అని మాలకొండ క్షేత్రానికి వెళ్లి, ఆ మాల్యాద్రి లక్ష్మీనృసింహ స్వామివారిని..పై కొండమీద కొలువైవున్న అమ్మవారిని, ఈ మొగిలిచెర్ల దత్తాత్రేయ స్వామివారు తపస్సు చేసుకున్న శివాలయం, నివాసం ఉన్న పార్వతీదేవి మఠం అన్నీ దర్శించుకొని వచ్చానండీ..నిన్నరాత్రి పల్లకీసేవవలో కూడా పాల్గొన్నాను..ఈరోజు ఉదయం నుంచీ అర్చకుల ద్వారా నిర్వహించిన స్వామివారి సమాధి అభిషేకములు, ప్రత్యేక హారతులు చూసానండీ.." అంటూ ఒక్కక్షణం కూడా ఆగకుండా గబ గబా చెప్పుకుపోతున్న ఆ వ్యక్తిని ఆగండి అన్నట్టు సైగ చేసాను..తాను చెప్పడం ఆపి..నా వైపు చూసాడు..


"నిన్నటినుంచీ మీరు పాల్గొన్న అన్ని కార్యక్రమాలు చెప్పారు బాగానే ఉంది..ఇవన్నీ నాకెందుకు ఏకరువు పెడుతున్నారు..ఈ సమయం లో మీరు చూస్తున్నారు కదా..భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది..అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేసే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత నాది..మీరేమో ఆపకుండా చెప్పుకుంటూ పోతున్నారు.." అని ఒకింత అసహనంగా చెప్పాను..కొద్దిగా ముఖం చిన్నబుచ్చుకొని.."అదికాదండీ..అన్నివిధాల నాకు బాగుంది కానీ..శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి, ఒక్కసారి నమస్కారం చేసుకొని..స్వామివారి పాదుకులను ముట్టుకొని రావడానికి మీరు అనుమతి ఇస్తారేమోనని అడగడానికి వచ్చాను.." అన్నాడు..


"అంతేకదా..మీరు అర్చకస్వామి వద్దకు వెళ్ళండి..నేను వారికి చెపుతాను..వారు మిమ్మల్ని స్వామివారి సమాధి వద్దకు పంపుతారు.." అని చెప్పాను..నిజానికి అతనిని అతి త్వరగా వదిలించుకోవాలి అనే ధ్యాసలో వున్నాను నేను..ఆ సమయం లో భక్తులు ఎక్కువగా ఉండటం..అందరూ దర్శనానికి తొందరపడటం..వాళ్ళను సర్దుకునే క్రమం లో నేను, మా సిబ్బంది కొద్దిగా సతమతం అవుతున్నాము..అతను నాకు ధన్యవాదాలు చెప్పి, లోపలికి వెళ్లి, స్వామివారి సమాధిని దర్శించుకొని వెళ్ళిపోయాడు..


ఓ పదిరోజుల తరువాత,.."నా పేరు పార్ధసారధి అండీ..నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను..ఈ మధ్య మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకున్నాను..ఒక ఆదివారం ఉదయం మిమ్మల్ని స్వామివారి సమాధి దర్శనం కొఱకు నా మాటలతో విసిగించాను కదండీ..గుర్తుకు వచ్చానా అండీ.." అంటూ ఫోన్ చేసాడు.."మీరు గుర్తుకువచ్చారు..ఆరోజు మీరే చూసారు కదా..పని వత్తిడిలో వున్నాను.." అని కొద్దిగా సంజాయిషీ ఇచ్చే రీతిలో జవాబు చెప్పాను..


"అయ్యో అదేమీ లేదండీ..ఇప్పుడు నేనెందుకు మీకు ఫోన్ చేశానంటే..నేననుకున్న పని స్వామివారి దయవల్ల పూర్తయింది..అందుకు కృతజ్ఞత గా..మీరు సూచించిన శనివారం ఆదివారం రెండురోజులూ అన్నదానానికి అయ్యే ఖర్చును నేను భరిస్తాను..దాతల సహకారం తో అన్నదాన సత్రాన్ని బాగుచేయిస్తున్నారనీ..దానికి సుమారు ఐదారు లక్షల వరకూ ఖర్చు అవుతుందనీ మీ సిబ్బంది అనుకుంటుంటే విన్నాను..నేను కూడా నా వంతుగా కొద్ది మొత్తాన్ని విరాళంగా ఇస్తాను..కాదనకుండా స్వీకరించండి..అలాగే వచ్చే నెలలో మా కుటుంబం తో సహా వస్తాను..వచ్చేముందు మీకు ఫోన్ చేస్తాను..సమాధి దర్శనం ఇప్పించండి..అంతే చాలు..వుంటానండీ.." అన్నాడు..


ఇతన్ని త్వరగా వదిలించుకోవాలి అని నేను ఆరోజు అనుకున్నాను..కానీ అతని చేతనే శ్రీ స్వామివారు అన్నదానం చేయించుకుంటున్నారు..అదీకాక అన్నదాన సత్రం బాగుచేయడం లో అతనిని కూడా ఒక సాధనంగా ఏర్పాటు చేశారు..ఏ మనిషిని తక్కువగా అంచనా వేయకు అని స్వామివారు నాకు అతని ద్వారానే..నాకేమాత్రం మనసుకు కష్టం కలిగించని రీతిలో చెప్పించారు..


స్వామివారి సమాధి వద్దకు వెళ్లి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నాను..స్వామివారి వద్ద ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క అనుభవం పొందుతాడు..కానీ కొంతమంది భక్తుల ద్వారా స్వామివారు పాఠాలు చెపుతారు..అవే మాకు అనుభవాలు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: