20, డిసెంబర్ 2020, ఆదివారం

అజాతశత్రువు

 .. *అజాతశత్రువు* 

🕉️🌞🌎🏵️🌼🚩


మనిషికి తోటి మనిషే శత్రువు కావడం ఆశ్చర్యమనిపిస్తుంది. సాధారణంగా పశుపక్ష్యాదుల్లో ఒకే జాతికి చెందిన జీవుల మధ్య వైరం ఉండదు. మనిషి తీరే వేరు. ఇద్దరు వ్యక్తుల మధ్య శత్రుత్వానికి ఆర్థిక వ్యవహారాలు, అన్య స్త్రీ సంపర్కం, భూ తగాదాలు, కులాలు, మతాలు వంటి అనేక విషయాలు కారణమవుతాయి. వ్యక్తుల మధ్య శత్రుత్వమే కొన్ని సందర్భాల్లో వర్గ సమస్యగా పరిణమిస్తుంది. వర్గాలుగా చీలిన ప్రజలతో ఊరికి ఊరే శత్రుశిబిరమవుతుంది. పగలు పెరిగి కొట్లాటలు ముదిరి ప్రజల ప్రాణాలకు ముప్పు ముంచుకొస్తుంది. చిన్న సమస్య ఒక్కొక్కసారి ఊహించని ఉత్పాతమవుతుంది.


పుట్టుకతో అందరూ సమానులే. బాల్యంలో విరోధులుండరు. చిన్నపిల్లల మనసులు ద్వేషరహితం. ఎటువంటి కల్మషం ఉండదు. మనిషి ఎదుగుతూ తనతోపాటే కామ, క్రోధ, లోభ, మోద, మద,  మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను పెంచి పోషిస్తాడు. ఈ అంతశ్శత్రువుల ప్రభావమే శత్రుత్వాన్ని పెంచుతుంది. కొందరి మధ్య శత్రుత్వం వారితో అనుబంధమున్న వారినీ బలి తీసుకుంటుంది.

సీతాదేవిని అపహరించిన రావణుడికి శ్రీరాముడు శత్రువ య్యాడు. మంచి మాటలు తలకెక్కించుకోని రావణుడు రాము డితో యుద్ధానికి తలపడ్డాడు. ఆ యుద్ధంలో రావణుడితోపాటు అతడి సోదరుడు కుంభకర్ణుడు, కుమారుడు ఇంద్రజిత్తు ప్రాణాలు కోల్పోయారు. రావణుడి అకృత్యాలకు మద్దతు తెలిపినవారూ నిహతులయ్యారు.

దాయాదులపై శత్రుత్వం పెంచుకుని వారికి సూదిమొన మోపినంత స్థలం కూడా ఇవ్వనన్న దుర్యోధనుడి అహంకారం కౌరవ వంశ నాశనానికి కారణమైంది.

హిరణ్యకశిపుడు శ్రీహరితో శత్రుత్వం పూనాడు. శత్రుత్వం వల్ల అతడి మనసులో రోషం చెలరేగి తామసగుణం విజృంభించింది. తన ఎదుట విష్ణువును స్తుతించిన కుమారుడినే చంపాలని ప్రయత్నిస్తాడు. చివరికి విష్ణుమూర్తి నరసింహ దేవుడిగా ఆవిర్భవించి హిరణ్యకశిపుడి గుండెలు చీలుస్తాడు. హిరణ్యకశిపుడి మూర్ఖత్వమే అతడి పతనానికి దారి తీసింది.

అనుబంధాలు ధనబంధాలుగా మారిన ఆధునిక కాలంలో ఆస్తి తగాదాలు ఒకే తండ్రికి పుట్టిన బిడ్డల మధ్యా శత్రుత్వానికి కారణమవుతున్నాయి. అనుమానం పెనుభూతమై కుటుంబాలను విడదీస్తోంది. అసూయాద్వేషాలు బంధువుల మధ్య చిచ్చు పెడుతున్నాయి. పదవీ లాలస, అధికార దాహం ఎవరినీ దరికి రానీయవు. అహంకారం, కోపంతో రగిలేవారికి అందరూ శత్రువులుగానే కనిపిస్తారు.

శత్రువులోని మంచి గుణాలను గుర్తించగలగడం మంచివారి లక్షణం. కాస్త సంయమనం, ఇచ్చిపుచ్చుకొనే ధోరణి... శత్రువులను మిత్రులుగా మారుస్తాయి. విభేదించినవారిని మంచిమాటలతో ఒప్పించగలగడం విజ్ఞుల లక్షణం. కోపాన్ని శాంతంతో జయించి మనసును భగవంతుడి వైపు మళ్ళించగలిగినవారికి శత్రువులుండరు. ధ్యానంతో అహంకారం పటాపంచలవుతుంది.

మానసిక ప్రశాంతత, శాంత స్వభావం, భగవత్‌ చింతన, మనో నిగ్రహం, అంతఃకరణ శుద్ధి- ఇవి  మానసిక తపస్సులని భగవద్గీత బోధిస్తోంది. అంతఃకరణలో ఈర్ష్యాద్వేషాలు, కామక్రోధాలు, లోభమోహాలు, మదమాత్సర్యాలు, హింస ప్రతిహింసలు వంటి దుర్భావనలను తొలగించుకుని- ప్రేమ, దయ, క్షమ, ఓర్పు, దానగుణాలతో వికసితం చేసుకున్న ఉత్తములు అజాతశత్రువులై మనశ్శాంతితో మనగలుగుతారు. భగవంతుడి దయకు పాత్రులు కాగలుగుతారు!


ఇంద్రగంటి నరసింహమూర్తి


🕉️🌞🌎🏵️🌼🚩

కామెంట్‌లు లేవు: