16, ఏప్రిల్ 2021, శుక్రవారం

మొగిలిచెర్ల

 *మంచి పాఠం..*


2011వ సంవత్సరం లో ఒక శుక్రవారం సాయంత్రం పూట..మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం లో ఒక ప్రక్కగా కూర్చుని నేనూ మా సిబ్బందీ మందిరం తాలూకు వ్యవహారాలగురించి మాట్లాడుకుంటూ వున్నాము.."అయ్యా..రేపు శనివారం..ఎల్లుండి ఆదివారం..ఈరెండురోజులూ మనం అన్నదానం చేయాలి కదా..మీరు దాతల పేర్లు చెప్పలేదు..దాతల పేర్లు మీరు వ్రాసి ఇస్తే..రేపు ఉదయం బోర్డ్ మీద వ్రాస్తాము.." అన్నారు..అప్పటికి ఆ రెండురోజుల అన్నదానం కొరకు దాతలెవరూ ముందుకు రాలేదు..ఆ మాటే మా సిబ్బందితో చెప్పి.."మనం మందిరం తాలూకు డబ్బు నుంచి వాడుకుందాము..సరుకులు తెప్పించండి"..అన్నాను..సరే అన్నారు.."ఈ రెండు రోజుల అన్నదానానికి ఎంత ఖర్చు అవుతుంది?.." అని వాళ్ళను అడిగాను..కొద్దిసేపు లెక్కలు వేసి.."మొత్తంగా పదకొండు వేల ఐదు వందల దాకా ఖర్చు అవుతుంది..అన్నీ కలుపుకొని.." అన్నారు..(ఆరోజుల్లో లెక్క అది..ప్రస్తుతం మామూలు రోజుల్లో ఒక పూటకు అంతకంటే ఎక్కువగా ఖర్చు అవుతోంది).."సరే లెక్క వ్రాసి పెట్టండి..మన స్వామివారి వద్ద అన్నదానం గురించి మనం చింత పడనక్ఖర లేదు..అన్నీ ఆయన చూసుకుంటాడు..మనకు అప్పచెప్పిన పని మనం చేసుకుందాము.." అన్నాను..అంతటితో ఆ సంభాషణ ముగించి..ఎవరి పనుల్లో వాళ్ళం ఉండిపోయాము..


ఆ ప్రక్కరోజు శనివారం ఉదయం తొమ్మిది గంటల వేళ..ఒక చిన్న బిడ్డను ఎత్తుకొని ఇద్దరు భార్యా భర్త మందిరానికి వచ్చారు..వాళ్ళను చూడగానే బీదవాళ్ళు  అనిపించేటట్లుగా వున్నారు..వాళ్ళు కూడా స్వామివారి మందిరం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి..సర్వదర్శనం లైన్ లో వచ్చి..స్వామివారి సమాధికి నమస్కారం చేసుకొని..మంటపం లో ఓ మూలకు పోయి కూర్చున్నారు..వాళ్ళల్లో వాళ్లే ఏదో మాట్లాడుకుంటూ..మధ్య మధ్యలో మా సిబ్బంది వైపు చూస్తూ..మొత్తం మీద ఏదో తర్జన భర్జన పడుతున్నారు..మరో పది నిమిషాల తరువాత..ఇద్దరూ లేచి..మా సిబ్బంది కూర్చుని ఉన్న చోటుకు వెళ్లారు..ఇంకొక పదినిమిషాల తరువాత వాళ్ళిద్దరినీ వెంటబెట్టుకొని మావాళ్ళు నా వద్దకు వచ్చారు.."ఏమిటి విషయం..?" అని అడిగాను..

"అయ్యా..వీళ్ళది కట్టకిందపల్లె..యానాది కులం వాళ్ళు..నాలుగేళ్ళ క్రిందట మన గుళ్ళోనే పెళ్లి చేసుకున్నారట..పెళ్ళైన రెండు నెలలకు మళ్లీ ఇక్కడికి వచ్చి మొక్కుకున్నారట..తమకు ఎక్కడన్నా పని దొరికితే..స్వామికి ముడుపు కట్టుకుంటాము.." అనుకున్నారు..పక్క నెలలోనే నెల్లూరు దగ్గర ఒక ఆసామి తన పొలం చూసుకోవడానికి పనివాళ్లకోసం వెతుకుతుంటే..వీళ్లకు ఆయన పరిచయం కావడం..ఆయన పొలం లో కాపలా కు చేరిపోడం జరిగాయి..ఆరోజునుంచీ తమ కూలీ డబ్బుల్లో కొద్దీ కొద్దిగా స్వామివారి కోసం ఒక మట్టి ముంతలో దాచుకున్నారట..అది తీసుకొని వచ్చారు..దానిని ఎలా ఇవ్వాలో తెలీక..మథన పడుతున్నారు..మా దగ్గరకు వచ్చి వివరం అడిగారు.." అన్నారు..


"ఆ ముంతలో ఉన్న డబ్బు దేనికి ఖర్చుపెట్టాలని అనుకున్నారు?.." అని ఆ దంపతులను అడిగాను..నిజానికి నాకు అంత ఆసక్తి లేదు..ఎందుకంటే..వాళ్లిద్దరూ పేద వాళ్ళు..ఎంత కూడబెట్టుకుంటారు?..మహా అయితే ఓ ఐదారు వందల రూపాయలు వుంటుంది..అనే భావనతో అడిగాను.."నలుగురికి అన్నం పెట్టు స్వామీ..మేము పేద వాళ్ళం..అందులో ఎంత ఉంటే..అంతా తీసుకొని..అన్నం పెట్టు స్వామీ.." అన్నాడు.."అలాగేలే.." అని మా వాళ్ళ తో ఆ ముంత లో ఉన్నది లెక్కగట్టి..వాళ్ళ పేరుతో రసీదు ఇవ్వండి.." అన్నాను..సరే అని చెప్పి వాళ్ళిద్దరినీ వెంటబెట్టుకొని మంటపం లోకి వెళ్లారు..అక్కడ ఒక చాప పరచి..ఆ చాప మీద ఆ ముంత లో ఉన్న చిల్లర పోశారు..మా సిబ్బందిలో ముగ్గురు కూర్చుని..ఓ అరగంట పాటు లెక్కబెట్టి..మళ్లీ వాళ్ళిద్దరినీ తీసుకొని నా వద్దకు వచ్చారు..ఆ ముంతలో వచ్చిన డబ్బు ఒక చేతిలో పట్టుకొని వున్నారు.."సార్..మొత్తం పదకొండు వేల ఆరువందల పదహారు రూపాయలు..ఉంది.." అన్నారు..ఒక్కక్షణం నాకు అర్ధం కాలేదు.."ఎంత వున్నది..?" అన్నాను.."పదకొండు వేల ఆరువందల పదహారు రూపాయలు.." మళ్లీ చెప్పాడు..శని ఆదివారాలు రెండురోజులు వచ్చే భక్తుల అన్నదానం కోసం అంతకు ముందురోజు మేము లెక్కగట్టిన మొత్తం పదకొండు వేల ఐదువందల రూపాయలు..దానిపై మరో నూట పదహారు రూపాయలు ఉన్నాయి..ఎంత చులకన గా అనుకున్నాను?..నాలో ఉన్న ఆ చులకన భావాన్ని స్వామివారు ఎంత సున్నితంగా ఎత్తి చూపారో అర్ధం అయింది..


"మీరు కూడబెట్టిన డబ్బు ఇంత ఉంది..ఈ మొత్తాన్ని ఏమి చేయమంటారు?.." అని మళ్లీ వాళ్ళను అడిగాను.."స్వామీ..ఆ డబ్బు మాదికాదు..అంతా ఆ స్వామిదే..దాంతో అన్నం పెట్టు.." అన్నారు భక్తిగా..వాళ్లిద్దరూ భక్తి గానే వున్నారు..కానీ..అప్పటిదాకా ఆ భక్తిని గుర్తించలేని స్థితిలో నేను వున్నాను..స్వామివారి సమాధి గది ముందు నిలబడి మనసులోనే క్షమాపణ చెప్పుకున్నాను..ఆ దంపతులు మాత్రం తమకేమీ సంబంధం లేదన్నట్టు వున్నారు..ఆరోజు రాత్రికి నిద్రచేసి..ప్రక్కరోజు స్వామివారి సమాధి దర్శించుకొని వెళ్లిపోయారు..ఎవ్వరినీ చులకనగా చూడకూడదు అని మాకు ఒక మంచి పాఠాన్ని  స్వామివారు సమాధి లో కూర్చుని నేర్పారు..


సర్వం..

శ్రీ దత్తకృప


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..వయా కందుకూరు..ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్ : 94402 66380 మరియు 9908973699)

కామెంట్‌లు లేవు: