16, ఏప్రిల్ 2021, శుక్రవారం

అమ్మమ్మ-ఆవకాయ


అమ్మమ్మ-ఆవకాయ, నిజంగా జరిగిందే....


నేను ఎదో కొద్దిగా రాసి విసుగు పుట్టించను అని నమ్మిన తరువాత రాస్తున్నా...


మా అమ్మమ్మ గారు గంగా బాగీరధి సమానురాలైన కఫ్తూరి అనంతమ్మ గారు తెనాలి నాజరుపేటలోని మహలక్షమ్మ చెట్టు ఎంత ప్రసిద్దో ఆవిడా అంత ప్రసిద్ది..


తెనాల్లో ఏ రైల్వో స్టేషను,బస్ స్టాండు,సినిమా హాలు  దగ్గరో  రిక్షా మాట్లాడుకుని ఆవిడ పేరు చెబుతే చాలు తీరా తీసుకొచ్చి ఇంటి ముదరే దింపుతారు,మారు బేరం లేకుండా..


ఎంటా ప్రసిద్దంటారా..


ఆవడ ఆ పేటకే తల్లో నాలుక..ఆవిడ ఒకటేమిటి ఆవులకి,దూడలకి, పాలిచ్చే గేదలకి దిష్టి తగిలితే ఉప్పుతో మంత్రిచ్చి ఇచ్చేది..నోట్లో సర్పి,వళ్భంతా కురుపులు,గవద బిళ్లలు,మెడ పట్టటం,కాలు బెణకటం ఇలాంటి సమస్త నెప్పులకి చిటికలో మంత్రం వేసీది గరిక,ఆట్లకాడ లాంటి వస్తువులతో...ఆవిడ మంత్రం వేస్తుంటే అక్కడ వున్న వాళ్ళందరికి విపరీతమైన ఆవలింతలొచ్చేవి...ఇవన్ని మంత్రాలు పని చేసాయనటానికి ఉదాహరణ,ఆవిడ ఇల్లు ఎప్పుడు జనాలతో  కోలాహలంగానే వుండేది..


మా దొడ్డి కొనుక్కుని బంగ్లా కట్టుకున్న ప్రసిద్ధ డాక్టరు  శ్రీ కొడాలి వీరయ్య చౌదరి గారి భార్య భారి కాయంతో ఆడవారికి సంబంధించిన బాధలతో ఇబ్బుంది పడుతుంటే మామ్మ గార్ని చిట్కా అడుగు అనేవారట అంత డాక్టరైనా!!


ఇది గొప్పేమి కాదు కాని,  స్వర్గీయ ఆలపాటి వెంకట్రామయ్య గారు ఈవిడతో అరగంట మీటింగు పెడితే ఆ వార్డు మెంబరు బంపరు మెజార్టీతో గెలిచే వాడట..ఇదిట్లా వుంటే ఆయనే ఈవిడకు వార్డు మెంబరు ఇవ్వపోతే,నాకెందుకు నాయన మా తమ్ముడు డా.చంద్రమౌళి సత్యన్నారయణ ఇంటరెస్టు గా వున్నాడంటూ ఏకంగా మున్సిపల్  వైసు చైర్మను చేసిన ఘనత ఈవిడది..


ఇది ఆవిడ పరిచయం నాకు తెల్సి ఆరవై ఏళ్ళ క్రితం మాట..ఇప్పుడు అసలు కధకు వద్దాం..


మా అమ్మమ్మ ఇంటి ఎదురగా సమకాలీకురాలైన గంగా భాగీరథి సమానురాలైన వల్లూరి సుబ్బమ్మగారు మా అమ్మమ్మ గారంత కాదు కాని ఎదో కొంత ప్రసిద్ధే..

వీరా చుట్టు పక్కలవారు అంతా ఏమన్నా.. వీరు మాత్రం ఒకరు ఏ మాటన్నా ఇంకోరు తలాడిస్తూ మరే,మరే అనేవారు సమర్ధిస్తూ...


ఎంత ప్రాణ స్నేహితులంటే భానుమతి గారి సినిమా కొత్తది గాని,పాతది గాని వస్తే మూడోకంటి వాడికి తెలియకుండా రహస్యంగా రిక్షా మాట్లాడుకుని సెకండు షో సినిమాకి వెళ్ళేవారు..రెండింటికి తిరిగొచ్చి నాలుగ్గంటలకే లేచి ఏం తెలియనట్లు పనిలో పడి పోయేవారు ఆ బానుమతి గారికన్నా ఎక్కువ నటించేవారు....వీరి ఖర్మ కొద్ది చించిన టికెట్లో లేక సిగిరెట్టు వాసన కొట్టే విడిచిన చీరె వల్లో గుట్టురట్టైది..


వీరింతటి దోస్తులైనా ఆవకాయ పెట్టే విషయంలో మాత్రం బధ్ధ శత్రువులైపోయేవారు..కొత్త ఆవకాయ పెట్టే రోజుల్ల అస్సలు మాటలుండేవి కాదు..అసలు ఒకరి వంక ఇంకోరు చూసుకునే వారే కాదు..సుబ్బమ్మ గారు గోడ దగ్గర నిలబడి ఎవరితోనో మాట్లాడుతూ ఉందనుకోండి.. మా అమ్మమ్మ బయటకు వస్తుందని తెల్సి గబ,గబా లోపలకి వెళ్ళి తలుపేసుకునేది..మా అమ్మమ్మ అయితే ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాల నిచ్చేది కాదు..విషయాలు మాత్రం ఒకరింటి విషయాలు వేరే వారికి ఈసీగా తెల్సి పోయేవి పాలవాడు,కూరలమ్మి,పనిమనిషి..ఇద్దరికి ఒకరే అయిన బాడుగ రిక్షావాడు చేత గుఢాచారం చేయించి విషయం రాబట్టే వారు..


ఉదారణకి, సుబ్బమ్మ గారు అంగలకుదురు తోట నుంచి తెప్పించిన వంద  మామిడి కాయలు ఆవకాయ,ఎభైకాయలు మాగాయ కోసం  పెడుతుందని తెల్సిందనుకోండి..మా అమ్మమ్మ ఇంకో పది ఎక్కువగా మానాన్నని పురమాయించి మంతెన వెంకట్రాజు గారి కాలవ గట్టు మీద చెట్లనుండి మామిడికాయలు కొట్టించేది...


మా అమ్మమ్మ నాజరు పేట నరసింహ స్వామి ఆలయం పక్కనుప్న గానగ నుంచి పట్టించి మంచి నువ్వుల నూనె వాడితే..సుబ్బమ్మ గారు ఆవిడ పెద్ద కూతురు చేత రాజమండ్రి నుంచి పరమాయించి మరి పప్పు నూనె డబ్బా తెప్పించేది...


మా అమ్మమ్మ తెనాలి మారీసు పేట అద్దంకి సుబ్బారావు కొట్లో ఆవకాయ,మాగాయకి కావల్సిన బళ్ళారి మిరపకాయలు, ఆవాలు, శెనగలు మాగాయ తిరగమోతకి కావాల్సిన సరంజామా కొంటే.

సుబ్బమ్మగారు ఈ సుబ్బారావుకి వ్యాపారంలో బద్ధ శత్రవైన కొత్తమాసు రామకోటయ్య కొట్లో కొనేది..ప్రత్యేకించి బద్రాచలం మిరపకాయలు పురమాయించి మరీ కొనేది..వీరిద్దరు గుఢాచారం చేసి మరీ ఒకరి వివరాలు ఇంకోరు తెలుసుకోవాలనుకున్నా

వాళ్ళు వ్యపార లౌక్యం , ఇంకా తప్పించుకునే గుణం పుష్కలంగా వుండి ఆ వ్యాపారులు నోరు జారే వారు కాదు...కాని వీళ్ళు, గుమాస్తాల దగ్గర నుంచి, పని వాళ్ళ దగ్గరి నుంచి సమాచారం సేకరించేవారు...


అంతా బాగుండి ఈ ఆవకాయ పెట్టే విషయంలో ఎందుకు ఇంత గొడవలంటారా...చెబుతా..


ఆ రోజుల్లో గిన్నెల్లో పెట్టి,  కొత్త ఆవకాయ అందరికి ఉద్దారంగా పంచే వారు..ఎవరి ఆవకాయకి ఎంత రేటింగు వచ్చిందా అని ప్రసంసల రూపంలో తెల్సి పోయేది...ఈ ఇద్దరు మాలోకాలకు తెల్సేది కాదు..ఊరికే అబ్బడంగా తీసుకుని తిని, ఒకళ్ళుకి తెలియకుండా ఇంకోళ్ళని విపరీతంగా పొగుడుతారని తెలియదు...


ఉదాహరణకి మా అమ్మమ్మ దగ్గర ఆ సుబ్బమ్మ గారి ఆవకాయ గురించి బద్రాచలం కాయంటమ్మా.. మీ ఆవకాయ కన్నా రంగు తక్కువమ్మా..,నోటికి కూడ ఒర్రగా లేదు వెల,వెల పోతుందంటారు...సుబ్బమ్మ గారి దగ్గర మా అమ్మమ్మ ఆవకాయ గురించి.. ఏంచెప్పమంటారమ్మా...ముక్కలో పీచు తక్కువమ్మా..

నోట్లో పెట్టుకుంటే మీ ఆవకాయ రుచి అస్సలు లేదమ్మా అని షరా మామూలుగా పొగిడి మరి ఇంకింత తీసుకెళ్ళేవారు...


ఇలా అని ఆ కొత్త ఆవకాయ పాత పడే దాకానే వీరి వైరం...


మా ఇంట్లో మా అమ్మ అర్ధరాత్రి పురిటి నెప్పులు పడుతుందని హడావిడితో కనిపెట్టి పరుగునొచ్చి..నువ్వింట్లోనే పిల్ల గాబరా పడకుండా చూస్తుండు అని మా అమ్మమ్మ కి చెప్పి అర్ధరాత్రి ఒంటరిగా మంత్రసానిని పిలుచుకు రావటానికి పరుగు లాంటి నడకతో వెళ్ళి పిల్చుకురావటం, నేనెట్ల మర్చేపోతాను...


ఆవకాయ కలుపుని నోట్లో పెట్టుకుంటుంటే ఇప్పుడే గుర్తుకొచ్చారు..వాళ్ళకి కంటి నీటితోనే శ్రద్దాంజిలి చెబుతుంటే..మా ఆవిడ ఆవకాయ ఘాటుగా ఉందా అని అడుగుతోంది...

కామెంట్‌లు లేవు: