7, అక్టోబర్ 2021, గురువారం

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*440వ నామ మంత్రము* 7.10.2021


*ఓం కులకుండాలయాయై నమః*


సుషుమ్నానాడికి మూలము మూలాధారము. అట్టి మూలాధారమునే తన ఆలయంగాజేసుకొని కొలువై ఉండు శ్రీమాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కులకుండాలయా* యను ఆరక్షరముల (షడక్షరీ) నామ మంత్రమును *ఓం కులకుండాలయాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఆరాధించు సాధకుడు నిశ్చయంగా ఆత్మానందానుభూతితో తరించును.


ములాధారమునందు కర్ణిక గలదు. ఆ కర్ణిక మధ్యలో గల బిందువునకు కులకుండమని అందురు. తామరదుంపవలె ఉండు ఆ కులకుండమే తన నివాసస్థానమై, కుండలినీ శక్తిరూపంలో నిద్రిస్తూ ఉంటుంది పరమేశ్వరి. అనగా కులకుండమే తన ఆలయముగా చేసికున్నది గనుక అమ్మవారు *కులకుండాలయా* యని అనబడినది. ఈ విషయంలో శంకరభగవత్పాదులవారు సౌందర్యలహరిలోని పదియవ శ్లోకంలో ఇలా చెబుతున్నారు:-


*సుధాధారాసారై-శ్చరణయుగలాంతర్విగలితైః*


*ప్రపంచం సించన్తీ - పునరపి రసామ్నాయమహసః|*


*అవాప్య స్వాం భూమిం - భుజగనిభ మధ్యుష్ట వలయం*


*స్వమాత్మానం కృత్వా - స్వపిషి కులకుండే కుహరిణి || 10 ||*


ఈ శ్లోకం కుండలినీ యోగం (అవరోహణ) గురించి తెలిపే శ్లోకం - శరీరంలో నాడీ ప్రపంచం గురించి, అమృత ధారా స్రావ మార్గంగురించి వివరణ

 

అమ్మా...భగవతీ ( బ్రహ్మరంధ్ర స్థానములో ఉన్న సహస్రార చక్రమందు అయ్యవారితో విహరించు అమ్మ.) నీ పాదద్వయం మధ్యబాగము నుండి స్రవించిన అమృతధారా వర్షములచేత (మనలోని అంతః ప్రపంచమైన) వేల నాడుల ప్రపంచమును తడుపుతున్నదానివై,అమృతాతియ కాంతిగల చంద్రుని స్థానమును (బ్రహ్మరంధ్రమును) వీడి, మరలా స్వస్థానమైన మూలాధారమును చేరి, నీ రూపాన్ని నీవే పామువలె చుట్టలు చుట్టుకుని, పృధివీతత్వమగు మూలాధారమందు, తామరదుద్దు మధ్యలోని సన్నని రంధ్రములో సూక్ష్మముగానున్నదానియందు కుండలినీశక్తిగా నిద్రిస్తూ ఉంటావు.


 మూలాధారమునందు నిద్రాణములో నున్న కుండలినీ శక్తిని జాగృతంచేసి, సుషుమ్నా మార్గంలో షట్చక్రములగుండా, బ్రహ్మ,విష్ణు,రుద్ర గ్రంథులను ఛేదిస్తూ సహస్రారంచేరి అచటగల చంద్రమండలమునుండి సుధాధారలను స్రవింపజేసి, సాధకుని డెబ్బదిరెండువేల నాడీమండలమును తడపి, ఆ సుధాధారలలో సాధకుని ఆహ్లాదగొలిపి, మరల మూలాధారంచేరి యథాప్రకారం నిద్రాణమునకు చేరుకుంటుంది కండలినీ శక్తి. అనగా మూలాధారమందుగల కులకుండము తన నివాసస్థానమై, అది తన నిలయంగా, ఆలయమై విలసిల్లుతుంది గనుక శ్రీమాత *కులకుండాలయా* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం కులకుండాలయాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: