7, అక్టోబర్ 2021, గురువారం

*దుఃఖ విముక్తి

 *దుఃఖ విముక్తి*


ధర్మరాజు " పితామహా ! మానవుడు దేనిని ఆచరించిన సమస్త దుఃఖములనుండి విముక్తి పొందగలడు " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! నేను నీకు అజగర కథచెప్తాను. పూర్వము ప్రహ్లాదుడు ఒక బ్రాహ్మణుడిని చూసి తనకు శమము గురించి చెప్పమని అడిగాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు " మహారాజా ! ఈ చరాచర జగత్తులో అనుదినము ఏ నిమిత్తము లేకుండా ఎన్నో ప్రాణులు పుడుతున్నాయి, చనిపోతున్నాయి. అందులో మానవులూ ఉన్నారు. ఏ ప్రాణి శాశ్వతం కాదు. ప్రాణం శాశ్వతం కాదని తెలిసీ, మానవులు మరణానికి కలత చెందుతారు. నదులకు వరదలు వచ్చినప్పుడు ఎన్నో దుంగలు కొట్టుకు వస్తాయి. అవి ఒక్కక్కసారి కలుస్తూ తిరిగి కొంతదూరం పోయి విడిపోతాయి. ఈ సృష్టిలో భార్యాభర్తలు బంధుమిత్రులు అలాగే కలుస్తూ విడిపోతుంటారు. ఈ సత్యం తెలిసిన వాడు సుఖదుఃఖాలకు అతీతుడు అయి శాశ్వత ఆనందం పొందగలడు. నేను సుఖదుఃఖాలకు అతీతుడను కనుక నన్ను అడిగి నీ సందేహాలు తీర్చుకుంటున్నావు. నేను, నాకు మేలు జరగాలని ఎన్నడూ కోరను. దుఃఖం వచ్చిన కలత పడక దానిని పోగొట్టడానికి ప్రయత్నిస్తుంటాను. నేను ఆహారంలో రుచికి ప్రాధాన్యత ఇవ్వక ఏది దొరికినా తింటాను. మృదువైన శయ్యమీద కటిక నేలమీద సమభావంతో నిద్రించగలను. పట్టువస్త్రాలు, నారచీరలు ఏవైనా ధరించగలను. ఎదీ నాకుగాకోరను. లభించినది ఏదైనా తృప్తి చెందగలను. అజగరవ్రతం స్వీకరించి నన్ను వెదుకుతూ వచ్చినది మాత్రం స్వీకరించి ప్రశాంత చిత్తతతో ఉంటాను. తృప్తి, శుభ్రత, ఓర్పు, అంతటా సమభావం, అంతర్దృష్టి ఇదే అజగరవ్రతం . ఇది యజ్ఞయాగాదుల వలన లభించదు. ఆత్మజ్ఞానం వలననే ఇది లభించ గలదు. అజగరవ్రతం ఆచరించే వారికి పాపము అంటదు, భయము ఉండదు, శోకముచేరదు, మోక్షము అతడికి దగ్గరగా ఉంటుంది " అని ప్రహ్లాదుడికి బ్రాహ్మణుడు చెప్పాడు.

🕉️

కామెంట్‌లు లేవు: