7, అక్టోబర్ 2021, గురువారం

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*గోశాల..*


"శ్రీ స్వామివారి మందిరం వద్ద ..ఆ స్వామి కృపతో అన్నదానం జరుగుతున్నది..స్వామివారిని దర్శించుకున్న భక్తుల కోరికలు కూడా తీరుతున్నాయి..అన్నీ లక్షణంగా ఉన్నాయి..ఒక్క గోశాల కూడా వుంటే బాగుంటుంది..కనీసం ఐదు ఆవులను మన గుడి వద్ద పోషిస్తే బాగుంటుంది.."అని 2016 ఆగస్ట్ లో మా సిబ్బంది నాతో చెప్పారు.. చూద్దాం..అంటూ వాయిదా వేసాను నేను..అందుకు కారణం లేక పోలేదు..గోశాల నిర్వహణ తేలికైన పని కాదు..గోవులకు సరైన ఆహారం..వాటిని సంరక్షించడానికి పని వాళ్ళూ..ఉంచడానికి ఒక గోశాల కావాలి..ఇవన్నీ ఖర్చు తో కూడుకున్న పనులు..శ్రీ స్వామివారి వద్ద గోవులను ఇవ్వడానికి కొంతమంది ఉత్సాహం చూపుతున్నారు..కానీ..నేను వారిస్తూ వున్నాను..అన్ని ఏర్పాట్లూ చేసి..ఆపైన గోవులను ఇక్కడికి తీసుకురావాలని నా కోరిక..


క్రమంగా మా వాళ్ళ నుంచి గోశాల గురించిన అభ్యర్ధన పదే పదే వినబడసాగింది..నేనూ నిశ్చయానికి వచ్చేసాను..ముందుగా ఒక పది పదిహేను గోవులు ఉండడానికి సరిపడా షెడ్ నిర్మాణం జరగాలి..కనీసం రెండు, రెండున్నర లక్షల వ్యయం అవుతుంది..దాతల సహకారం తీసుకుందామని నిర్ణయించుకున్నాము..ఏ నిర్ణయమైనా అమలు చేద్దామని అనుకున్నప్పుడు..ముందుగా శ్రీ స్వామివారి సమాధి వద్ద మోకరిల్లి..అక్కడ చెప్పుకొని..మొదలుపెట్టడం అలవాటు..ఇప్పుడు కూడా శ్రీ స్వామివారి సమాధి వద్ద ఇలా గోశాల నిర్మాణం చేయాలని సంకల్పించామనీ..ఆశీర్వదించమని వేడుకున్నాను..


ఆ ప్రక్క ఆదివారం రోజు..వింజమూరు నుంచి..శ్రీ గుఱ్ఱం వెంకటేశ్వర్లు దంపత్సమేతంగా వచ్చారు..శ్రీ స్వామివారి ఆశ్రమాన్ని నిర్మించిన శ్రీ బొగ్గవరపు చిన మీరాశెట్టి గారికి స్వయానా మరదలి కుమారుడు..1979 నుంచీ నాకు పరిచయం ఉన్న వ్యక్తి..శ్రీ స్వామివారి మీద అత్యంత భక్తి శ్రద్ధలు కలిగిన వాడు..శ్రీ స్వామివారి సమాధి దర్శనం చేసుకొని..ఉత్సవ విగ్రహం వద్ద పూజ చేయించుకొని..నేరుగా నావద్దకు వచ్చి..ఏ ఉపోద్ఘాతమూ లేకుండానే..నేరుగా..


"మన గుడి వద్ద గోశాల లేదు కదా?..గోశాల ఎందుకు కట్టించలేదు?..ఇంత పెద్ద ఆలయం వద్ద గోశాల కూడా వుంటే ఎంత శోభస్కరంగా ఉంటుందో ఆలోచించావా?..నా మాట విని తొందరగా గోశాల ఏర్పాటు చెయ్యి.." అని గబ గబా చెప్పేసాడు..


నేను కొద్దిగా తేరుకొని.."గోశాల నిర్మించాలంటే..నిధులు కావాలి కదా?..సుమారు రెండులక్షల పైమాటే..గబుక్కున నేను ఒకరిని అడగలేను..గోశాల గురించి ఆలోచన చేసాను..ఆ స్వామివారితో కూడా మొర పెట్టుకున్నాను..దాతల సహకారం తీసుకొని..మెల్లిగా పూర్తి చేస్తాను..అదీకాక గోవులకు గ్రాసం కొనడం పెద్ద సమస్య ఇక్కడ..మొగలిచెర్ల లో గ్రాసం దొరకదు..వేరే గ్రామాల నుంచి గడ్డి కొని..ట్రాక్టర్ ద్వారా తెప్పించుకోవాలి..ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా.." అన్నాను..


"ముందు ఒకటి చెప్పు ప్రసాదూ..గోశాల నిర్మాణం జరగడం నీకు అభ్యంతరం లేదు కదా..ఇక ఆ ఖర్చు గురించి..రెండు..రెండున్నర లక్షలు కదా..ఇంకొంచెం ఎక్కువైనా పర్లేదు..వచ్చేనెలలో మంచిరోజు ఎప్పుడో చూడు..నిర్మాణం మొదలుపెడదాం..నేను పూర్తిగా ఆ ఖర్చు భరిస్తాను..రెండు మూడు నెలలకు సరిపడా గడ్డి కూడా నేనే ఏర్పాటు చేస్తాను..ఇక నీదే ఆలస్యం.." అన్నాడు..


నేను మాట్లాడటానికి ఏమీ లేదు..శ్రీ స్వామివారే వెంకటేశ్వర్లు ద్వారా చెప్పించేసారని అర్థమైపోయింది..సరే అన్నాను..మరో వారం రోజులకల్లా వెంకటేశ్వర్లు తన మనుషులను పంపించాడు..వాళ్ళు చక చకా గోశాల కు అనువైన షెడ్డును నిర్మించేశారు..మరో రెండు నెలల లోపే ఐదు గోవులతో..గోశాల ప్రారంభం అయింది..అందులో రెండు గోవులు వెంకటేశ్వర్లు ద్వారా వచ్చినవే..ఈరోజు మొత్తం పన్నెండు ఆవులతో మేము గోశాల ను నిర్వహిస్తున్నామంటే..పైకి కనిపించే కారణం శ్రీ గుఱ్ఱం వెంకటేశ్వర్లు ప్రోద్బలమూ..ఆర్థికసహాయమూ..కానీ అంతర్లీనంగా మాకు కనిపించేది ఆ దయామయుడైన అవధూత శ్రీ దత్తాత్రేయుడి సంకల్పం..అది నెరవేర్చే బాధ్యత కూడా శ్రీ స్వామివారిదే.. మేము నిమిత్తమాత్రులం..


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..సెల్..94402 66380 & 99089 73699)

కామెంట్‌లు లేవు: