7, అక్టోబర్ 2021, గురువారం

మొదటి పాఠశాల

 ఇల్లే మొదటి పాఠశాల.

...................................


         2012 వ సంవత్సరం. నవదంపతుల కోసం మొట్టమొదటి సారిగా ' శ్రీమాతా కుటుంబ చింతనయాత్ర ' పేరుతో రెండురోజుల శిబిరం కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా కొప్ప తాలూకా లోని కానూరు గ్రామంలో శ్రీ రంగప్పయ్య గారింట్లో నిర్వహించబడింది. రెండు రోజులు విజయవంతంగా జరిగి వచ్చిన నవదంపతులు పుట్టింటినుండి అత్తగారింటికి వెళ్ళేవారిలాగా భావుకులయ్యారు. శిబిరంలో చివరి కార్యక్రమం ప్రశ్నోత్తరాలు, సమారోప్ ( ముగింపు ) మాననీయ శ్రీ న. కృష్ణప్ప గారు నిర్వహించడానికి సిద్ధమై వేదిక మీద కూర్చున్నారు. సమారోప్ కార్యక్రమం కావడం వల్ల వేదిక ఒక చివరన ఆతిథ్యమిచ్చిన ఆ ఇంటి యజమాని కూడా ఆసీనుడై ఉన్నారు. 

          శిబిరంలో పాల్గొన్న ఒక యువతి లేచి నిలబడి ' నాదొక ప్రశ్న. అయితే ఈ ప్రశ్న కృష్ణప్ప గారికి కాదు, ఈ ఇంటి యజమాని అయిన శ్రీ రంగప్పయ్య గారికి ' అన్నది. ఆమె ఏ ప్రశ్న అడుగుతుందో, ఈయన ఏ జవాబిస్తారో అనే సంశయంతోనే ప్రశ్న అడగడానికి అనుమతించబడింది. 

         ఆమె ప్రశ్న ఇలా ఉంది : ' నేను ఎవరు ? నా వంశం ఏది ? నా కులం ఏది ? ఇవేవీ తెలియకుండానే మీరు, మేము రావడానికి చాలా ముందుగానే ఇంటి ముందు ముగ్గులు వేసి, మామిడాకు తోరణాలు కట్టి , ఎన్నో ఏళ్ళుగా పరిచితులో, బంధువులో వస్తున్నారనేలా ఎదురుచూస్తూ నిలబడిఉండి, మేం బస్సునుండి దిగగానే ఆత్మీయంగా ఎదురువచ్చి , మా కాళ్ళు కడిగి, హారతి ఇచ్చి స్వాగతించారు. ఇక ఈ ఇంట్లోని వారందరి తియ్యని మాటలు, ఆతిథ్యం, వండి వడ్డించిన రకరకాల వంటలు , అన్నిటికన్నా ఎక్కువగా మేం ఏ పని చేయకుండా మీరు తీసుకున్న శ్రద్ధ ఆధునిక శైలిలో పెరిగిన నాకు ఒక రకంగా విచిత్రంగా అన్పించింది. ఇక, ఈ ఇంట్లో వంటగది, పూజగదితో సహా ఏ గదిలోకైనా వెళ్ళడానికి నిర్బంధమేమీ లేదు. భావనలకన్నా వ్యవహారికతే విజృంభిస్తున్న నేటి కాలంలో ఈ రకమైన ఆత్మీయత,ప్రేమాభిమానాలు చూపడానికి కారణమేమిటి ? మాకందరికీ ఈ రకమైన ఆతిథ్యమివ్వాలని మీకు ఎందుకనిపించింది ? దీనివల్ల మీకేమిటి లాభం ? '

     ప్రశ్న విన్న రంగప్పయ్య గారు సాధారణ వ్యక్తి. పెద్దగా చదువుకున్నవారు కూడా కాదు.అయితే వినయ సంపన్నులు. రైతు.చిన్నగా నవ్వుతూ ఆయన ఇచ్చిన క్లుప్తమైన జవాబు ఎవరికైనా కన్నీరు తెప్పించేలా ఉంది. ' కాదమ్మా , మీరంతా మా ఇంటి ఆడపిల్లలే అని మేము భావించగా , నువ్వు ఇలా ప్రశ్నిస్తున్నావా ? మా ఇంటి ఆడపిల్ల తన భర్తతో కలసి వచ్చినపుడు చూసుకోవాల్సింది ఇలాగే కదా ? వచ్చిన మీ ఇరవైమంది కూడా మా ఇంటి ఆడపిల్లలే.పెళ్ళయిన ఆడపిల్లను పుట్టింటివారు చూసుకోవాల్సిన విధానమే ఇది.' జవాబు వినగానే ప్రశ్న అడిగిన యువతి వెక్కివెక్కి ఏడవడం ప్రారంభించింది. 

       ఎవరో సంబంధం లేని తమ కులం, గోత్రం తెలియని వారిని, అందులోనూ ప్రపంచంలో దొంగలే ఎక్కువ అని భావించే ఈ కాలంలో ఆదరించి, సత్కరించే ఆలోచన ఎక్కడినుండి వచ్చింది ? ఇది ఆలోచించాల్సిన విషయమేగదా ? ఉపనిషత్తుల్లోని మాతృదేవోభవ... ఆచార్యదేవోభవ అనే మాటలు కేవలం గ్రాంధిక పదాలుగాక, ఈ సమాజపు ఆచరణ, నడవడికల వల్లే కొనసాగుతూ వచ్చాయి. దీన్నే సంస్కారం అని పిలవచ్చు. 

        ఇలాంటి ఆచరణలున్న ఈ సమాజంలోనే అకస్మాత్తుగా మెకాలె కారణంగా ఎంత మార్పు వచ్చిందో ? దీని గురించి ఆలోచించాల్సి ఉంది. 

        ఇల్లు పాఠశాలగా మారి , తల్లి గురువుగా ఉన్నంతవరకూ సంతానం డబ్బు తయారుచేసే యంత్రమానవులు కావాలని భావించకుండా తన కుటుంబం, తన కులం, సమాజపు ఆస్తి కావాలనే భావన ఉండింది. ఒకవేళ తమ పిల్లలు తప్పుచేస్తే మొత్తం కుటుంబం , సమాజం ముందు పాపభీతితో తలవంచుకోవాల్సి వస్తుందనే హెచ్చరిక కూడా ఉండేది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు తమ వంశం, పరంపర, సంస్కృతుల పట్ల గర్వపడేరీతిలో పెంచేవారు. అయితే కాలప్రవహంలో మన కుటుంబమూ కొట్టుకుపోతున్న కారణంగా గర్వపడాల్సిన విషయాలన్నీ అపహాస్యానికి గురయ్యాయి. దీనినుండి బయటపడాల్సిన అవసరం గతంలోకన్నా నేడు ఎక్కువగా ఉంది. 

    ఈమధ్య ప.పూ. సరసంఘచాలకులు కుటుంబాన్ని మరింత దృఢతరం చేయడానికి భజన, భోజనం, భాష , భూష ( వేషధారణ ) , భవనం, భ్రమణం ( పర్యటన ) అనే ఆరు సూత్రాలను సమాజం ముందుంచారు.

కామెంట్‌లు లేవు: