16, జూన్ 2023, శుక్రవారం

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 92*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️



*పార్ట్ - 92*


"నా ప్రియాతి ప్రియమైన మాగధులకు.... 


మీ అందరి ఆదరాభిమానాలను చూరగొన్న మీ మహారాజు మహానందుడు స్వహస్తాలతో రాస్తున్న ఆఖరి బహిరంగ లేఖ... ప్రియాతి ప్రియమైన నా ప్రజలారా... మా పూర్వులు మగధ ప్రజలను తమ కన్న బిడ్డల కంటే మిన్నగా ప్రేమించారు. పాలించారు. మేము వారి మార్గాన్నే అనుసరించామని మీకు తెలుసు, మా తదనంతరం మా వారసుడు కూడా మా పూర్వీకుల మార్గాన్నే అనుసరించాలని మా ఆకాంక్ష... కానీ.... 


నేను చేరదీసి అభిమానించిన విషవృక్షం దాన ఫలాలు యిప్పుడు నా ప్రజల మీద విషం కక్కుతున్నాయని విని చాలా విచారించాను. మహాపద్ముడు, రాణి సునంద కలిసి చేసిన ద్రోహం కారణంగా నేను 'దీర్ఘరోగి' నన్న ముద్రతో ఏకాంత దుర్గంలో బంధీనయ్యాను. మీ మహారాణి మురాదేవి తప్ప నాకు దిక్కూ తోడూ ఎవ్వరూ లేని దుస్థితిలో అసలు నా పరోక్షంలో రాజ్యంలో ఏం జరుగుతుందో కూడా నాకు తెలియ లేదు. చెప్పేవారూ లేరు. కానీ నిజాన్ని ఎల్లకాలం దాచలేరు. అది నివురుగప్పిన నిప్పులాంటిది. 


నాకు ఎట్టకేలకు నిజం తెలిసింది. మహాపద్ముడు 'పవిత్రమైన నందవంశాన్ని' కళంకితం చేస్తూ తనకీ సునందకి పుట్టిన సంతానానికి పేర్ల చివర 'నంద' నామదేయాన్ని చేర్చాడని విని కృంగిపోయాను. పరమ పవిత్రమైన మా నందవంశాన్ని అపవిత్రం చేస్తూ యీ 'సంకరనందులు' నవనందులు అనే పేరుతో దుష్టపాలన గావిస్తూ మా వంశానికి మాయని మచ్చ తెస్తున్నారని తెల్సుకుని బాధతో, పగతో, ప్రతీకారేచ్చతో రగిలిపోయాను. 


కానీ, వార్ధక్యం మీదపడి నిర్బంధంలో వున్న నేను, ఒకవేళ చెరసాల నుంచి బైటపడ్డా నందల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి తగిన శక్తి, సామర్థ్యం నాకు లేదని గ్రహించాను. అంతే కాదు. మగధ సింహాసనాన్ని అధిష్టించడానికి సమర్ధుడైన వారసుడు కూడా లేడు. అందుకే.... మీ మహారాణి మురాదేవిని ప్రార్థించి, ఆమెని ఒప్పించి, ఈ వయస్సులో... కేవలం... మగధ సింహాసనానికి... సక్షత్రియుడైన నందవంశ వారసుడిని ఇవ్వాలన్న ఏకైక సంకల్పంతో... మురాదేవిని కూడి పురుష సంతానాన్ని పొందాను. 


నా ప్రియమైన మగధ ప్రజలారా ! నాకు వారసుడు పుట్టాడు .... అతడికి 'చంద్రగుప్తుడు' అని నేనే నామకరణం చేశాను. అమావాస్య చీకటిలా ముగియబోతున్న నా జీవితంలోకి వెన్నెల వెలుగులా ప్రవేశించిన నా చంద్రుని గుర్తించడానికి ఆధారాలు, గుర్తులు - చంద్రుని వామపాదంలో వజ్రరేఖ... కనుపాపల్లో మత్సరేఖలు చేతుల్లో చక్రాంకితాలు, ఇంకా వీపు వెనక ఎడమ భాగాన పైన చాణు మాత్రపు అంటే శెనగ గింజంత నల్లని పుట్టుమచ్చ... వీటి ఆధారంతోనూ, యీ లేఖద్వారా, మురాదేవి ద్వారా మీరు నా చంద్రగుప్తుని గుర్తించగలరు. 


నాకింక జీవితేచ్చ లేదు. నా తదనంతరం సర్వసమర్థుడైన పాలకుడు మీకు లభించాలని నా ఆశ. నవనందుల వల్ల నా వంశం కలుషితమైంది. అందుచేత నా జీవితలక్ష్యాన్ని నెరవేర్చడానికి దీక్ష వహించిన త్యాగమయి మహారాణి ముర పేరిట... ఇహ నుంచీ నా వంశము మౌర్య వంశంగా గుర్తించబడాలని నా ఆకాంక్ష... చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించి నేను కన్న కలలు తీర్చగలడని నా నమ్మకం. 


నా ప్రియాతిప్రియమైన ప్రజలారా .... బిడ్డలారా .... 


నా బిడ్డడు చంద్రుడు మీ వాడు... మీలో ఒకడు. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడగలడు. అట్లే మీరూ అతడికి అండగా నిలువ గలరని నా ప్రగాఢ విశ్వాసం. దుష్టనందుల శకం అంతరించి, మౌర్యవంశ శకం ప్రారంభమైతేనే యీ లేఖ వెలుగుచూస్తుంది. యీ లేఖ మీ ముందుకు వచ్చిందంటే... నందులు అంతరించారని, నా పగతీరిందని అర్థం... పగ తీరడానికి సహకరించిన వారెందరో... వారందరికీ నా కృతజ్ఞతాభి వందనాలు తెలియజేసుకుంటూ.... 


మౌర్య సామ్రాజ్య ఛత్రఛాయలో మాగదులు శాంతి, సౌభాగ్యాలతో అలరారగలరనీ చంద్రగుప్త మౌర్యునికి అనుక్షణం బాసటగా నిలవగలరనీ ఆశిస్తూ.... ఆకాంక్షిస్తూ.... 

        మీ 

మహానందుడు.... 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻


👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*


🌺🌹🌺🌹🌺🌹🌺🌺🌹🌺

కామెంట్‌లు లేవు: