18, జులై 2023, మంగళవారం

సూర్యోదయ శోభలు

 శు భో ద యం🙏🙏


సూర్యోదయ శోభలు !!


"హరిదంభోరుహలోచనల్, గగన రంగాభోగ రంగత్తమో/

భరనేపథ్యము నొయ్యనొయ్య సడలింపన్, రాత్రి శైలూషికిన్/

వరుసన్ మౌక్తికపట్టమున్, నిటలమున్,వక్త్రంబునుందోచెనా/

హరిణాంకాకృతి వొల్చె,రేకయి, సగంబై ,బింబమై,తూర్పునన్;

వసుచరిత్రము-4ఆ:17 ప: రామరాజ భూషణుడు.


         రాయల అష్టదిగ్గజ కవులలోమేటి,శ్లేషకవిత్వంలో ఘనాపాటి.రామరాజభూషణకవి విరచిత వసుచరిత్రము లోనిదీ పద్యరత్నం.

విషయం సూర్యోదయం.

         ఆకాశంలో తూరుపురేఖలను సవరిస్తూ ఉదయిస్తున్న సూర్యబింబం క్షణక్షణం తనరూపం మార్చుకుంటూ చంద్రవంకవలె దర్శనమిస్తూ,రంగస్ధలంలో తెఱదించుతూఉండగా కనువిందుచేసే నట్టువకత్తె ఆకారంగా గోచరిస్తున్నాడట.

         వెనకటి రోజులలో కూచిపూడి భాగవతులు భామాకలాపం ప్రదర్శించేవారు.వాళ్ళు నాట్యగత్తెను బహుచిత్రంగా రంగస్థలమీద ప్రవేశపెట్టేవారు.పైనుండి క్రిందకు తెఱదింపేవారు.అది కూడామధ్యలో ఆగి ఆగి పాత్రను ప్రేక్షకులకు చూపేవారు.ఆక్రమంలో ముందుగా శిరస్సుకేశపాశమునందలంకరణములు, తదుపరి,ఫాలభాగము, ఆవెనుక,కనులు నాశిక, పెదవులు, మెడ ,ఇత్యాదిగా క్రమశః అవయవప్రదర్శన చేస్తూ చివరకు మొత్తం పాత్రను చూపేవారు.

         సూర్యోదయంకూడా ఆవతుగా ఉన్నదట.

"రాత్రియను నట్టువకత్తె,గగనమను రంగస్థలమున నాట్యమాడువేళ,దిగంగనలు(దిక్కులనేవనితలు)చీకటితెఱను క్రిందికి దించు చుండగా క్రమశః ముత్యాలపట్టెడ(శిరోభూషణము) ఫాలభాగము,మొగము,ను కనబడినట్లు,చీకటిని చేధించుచు ,తొలుత రేఖామాత్రమయి, ఆవెనుకసగభాగమయి, ఆపై పరిపూర్ణబింబమయి సూర్యభగవానుడు.కనువిందు చేసెను.

రూపకానుప్రాణిత, ఉత్ప్రేక్షాలంకారము.

కఠినపదములకు అర్ధవివరణ:


హరిత్-దిక్కు,

అంభోరుహలోచన-వనిత;

రంగము-ప్రదర్శనావేదిక;

శైలూషి-నాట్యకారిణి;

మౌక్తికపట్టము-ముత్యాలశిరోభూషణము;

వక్త్రము-వదనము(నోరు)

హరిణాంకాకృతి-చంద్రునిబోలినయాకారము;


                               స్వస్తి !🙏🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: