18, జులై 2023, మంగళవారం

సముద్రస్నానం - సహాయం

 సముద్రస్నానం - సహాయం


దేవాలయాలను తీర్థాలను దర్శించి సేవించాలని చాలామందికి కోరికగా ఉంటుంది. ఈనాటికి చాలామంది పుణ్యనది స్నానం కొరకు మహామాఖం, కుంభమేళా వంటి ఉత్సవాలకు వేల సంఖ్యలో వస్తుంటారు. తిర్తస్నానం వల్ల మన పాపములు తొలగి మనస్సుకు శాంతి చేకూరుతుంది.


“కేవలం సముద్ర దర్శనమే మహా పుణ్యం“. సాధారణ రోజులలో సముద్ర స్నానం చెయ్యరాదు. అది కేవలం అమావాస్య, పౌర్ణమి, గ్రహణాల వంటి రోజులలో మాత్రమే చెయ్యాలి. కాని రామేశ్వరం, తిరుప్పులని, వేదారణ్యం, ధనుష్కోటి వంటి క్షేత్రములలో సంవత్సరంలో ఎప్పుడైనా సముద్రస్నానం చేసి పుణ్యం ఆర్జించవచ్చు.


ఒకసారి కంచి పరమాచార్య స్వామివారు తమిళనాడు మొత్తంగా విజయయాత్ర చేస్తున్నారు. ఆడి (ఆషాడం) అమావాస్య దగ్గర పడుతుండడంతో వేదారణ్యంలో సముద్ర స్నానం చెయ్యాలని ప్రణాళిక వేశారు. కారణం లేకుండా శ్రీరాముడు ఒక్కమాట కూడా మాట్లాడడు అని ప్రతీతి. అలాగే సన్యాసులు కూడా. అక్కరలేని విషయాలు మాట్లాడడం, నిష్పలమైన పనులు చెయ్యడం అన్నది వారి వద్ద ఉండదు.


మహాస్వామివారు వేదారణ్యం చేరేదారిలో కొన్ని ఊళ్ళల్లో మకాం చేస్తూ యాత్ర సాగిస్తున్నారు. అలా ఒక ఊరిలో, ఆకలిగొన్న వ్యక్తీ ఒకరు స్వామీ దర్శనానికి వచ్చాడు. స్వామివారు మఠం మేనేజరును పిలిచి “అతనికి మంచి ఆహారం పెట్టి, ఒక పంచ ఉత్తరీయం ఇమ్మ”ని ఆదేశించారు. మేనేజరు స్వామివారి ఆదేశాన్ని పాటించి “అతనికి మీరు మీరు చెప్పినవన్ని ఇచ్చాము. పంపెయ్యమంటారా?” అని అడిగారు.


స్వామివారు వెంటనే, “అతణ్ణి మఠ ప్రముఖునిగా చూసుకుంటూ, రాజభోగాలను కల్పించ”మని ఆదేశించారు. మేనేజరుకు ఏమీ అర్థం కాకపోయినా స్వామివారి ఆదేశాన్ని పాటిస్తూ అతణ్ణి యాత్రలో తమతోపాటు ఉండమన్నారు.


“అతనికి భోజనం ఇచ్చారా? బాగా చూసుకున్తున్నారా?” అని మహాస్వామివారు మేనేజరుతో ప్రతిరోజూ అడిగి తెలుసుకునేవారు. రోజులు గడుస్తున్నాయి. హఠాత్తుగా ఒకరోజు అతను మఠానికి తాగి వచ్చాడు. భగవంతుణ్ణి దూషించాడు. మఠ ఉద్యోగులను తిట్టాడు. ఆఖరికి కూడుగుడ్డ ఇచ్చిన పరమాచార్య స్వామిని కూడా తూలనాడాడు. మేనేజరుకు కోపం వచ్చి అతని ప్రవర్తనను మహాస్వామికి విన్నవించారు. “అతణ్ణి పంపెద్దాం పెరియవ” అని స్వామిని అర్థించారు.


స్వామివారు ఏమీ కోప్పడక గట్టిగా నవ్వారు. “స్వామీ! అతణ్ణి పంపెయానా?” అని మేనేజరు మరలా అడిగారు. కాని స్వామివారు అందుకు ఒప్పుకోలేదు.


ఆరోజు ఆడి ఆమావాస్య. స్వామివారు వేదారణ్యంలో సముద్రస్నానం చేయడానికి వస్తున్నారని తెలిసి వేలమంది భక్తులు వచ్చారు. ఆడి అమావాస్య రోజు సముద్ర స్నానం పుణ్యప్రదం. అందునా ‘నడమాడుం దైవం’ పరమాచార్య స్వామితో కలిసి చెయ్యడం అత్యంత పుణ్యప్రదం. దాంతో తీరం అంతా లక్షలాదిమంది భక్తులతో నిండిపోయింది. భక్తితో ఎంతోమంది వృద్ధు మహిళలు కూడా తీరం వెంబడి నిలుచున్నారు.


పరమాచార్య స్వామివారు సముద్రం దగ్గరకు వచ్చారు. అందరూ స్వామివారికి నమస్కరించగా స్వామివారు సముద్రంలోకి నడిచారు. స్వామివారిని అనుసరిస్తూ అక్కడున్న వృద్ధ మహిళలతో పాటు అందరూ లోపలి నడిచారు.


అంతే ఒక్కసారిగా వచ్చిన ప్రచండమైన అలల తాకిడికి ఆ వృద్ధ మహిళలు కొంతమంది సముద్రలోకి కొట్టుకునిపోయారు. అందరూ ఏం చెయ్యాలో పాలుపోక చేష్టలుడిగి నిలుచున్నారు. అంతటి భయంకరమైన అలలను కూడా లెక్క చెయ్యకుండా ఒక వ్యక్తీ వెంటనే సముద్రంలోకి దూకి ఆ ఆడవారిని ఒడ్డుకు లాగి రక్షించాడు. ఆ వ్యక్తీ మరెవరో కాదు. మఠంలో అందరిని ఇబ్బందులు పెడుతున్న ఆ తాగుబోతు.


ఈ సంఘటనను చూడగానే మహాస్వామివారు మేనేజరు వంక తిరిగి ఒక చిన్న నవ్వు నవ్వారు. మేనేజరు పరుగున వచ్చి స్వామివారి పాదాలపై పడ్డాడు.


సన్యాసులు భవిష్యత్తును దర్శించగల దిర్ఘదర్శులు. వారు చేసే ప్రతి క్రియలో కొన్ని వేల కారణాలు/నిజాలు ఉంటాయి. మనం వాటిని లోతుగా పరిశీలిస్తేనే వారి పూర్ణ అనుగ్రహాన్ని పొందగలము.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: