13, జులై 2023, గురువారం

శివాలయంలో శివ సేవ*

 *శివాలయంలో శివ సేవ*



✳️ మనలో చాలామంది భక్తులు ఆలయాలకు వెళ్తుంటారు. రోజూ, లేక వారానికోసారి, ఏదైనా పండుగలు, ఉత్సవాలు జరిగే సమయంలో ఆలయానికి వెళ్లి దర్శనం మాత్రం చేసుకుని తిరిగి వచ్చేస్తుంటారు. ఏవైనా మొక్కుబడులు ఉంటే తీర్చుకుంటారు. ఏవైనా విశేష ఆర్జిత సేవలు జరిపించుకుంటారు. అవకాశాన్ని బట్టి సమీపంలో ఉన్న ఇతర ఆలయాలను, సందర్శనీయ స్థలాలను దర్శిస్తారు. క్షేత్రంలో నిద్రచేస్తారు. కానీ మనం ఆలయాలకు వెళ్లి ఇంకా ఎన్నో సేవలు స్వయంగా ఆచరించి అక్షయమైన ఫలితాలను, *శివాలయం నిర్మాణం చేస్తే.. నిర్వహణ చేస్తే.. పునరుద్ధరణ చేస్తే ఎంతైతే ఫలితం ఉంటుందో దానితో సమానమైన ఫలితాలు శివాలయసేవ ద్వారా పొందవచ్చు.*


👉 *అటువంటి కొన్ని సేవలు.. వాటి ఫలితాలు ఇవి....*


꧁┉┅━❀🔯❀━┅┉꧂



 *దూరం నుండి దర్శిస్తే చాలు...* 


🕉️ అల్లంత దూరంలో ఆలయశిఖరం కనిపిస్తే చాలు. అమాంతం మన రెండు చేతులు ఒకదానికొకటి కలిసి నమస్కరిస్తాయి. అదే మన చిన్ననాటి నుండి మన పెద్దలు మనకు నేర్పిన ధర్మం. దాని వలన మనకు కలిగే ఫలితం ఏంటో తెలుసా? 


*దూరతః శిఖరం దృష్ట్వా నమస్కుర్యాచ్ఛివాలయమ్ ।*

*సప్తజన్మకృతం పాపం క్షిప్రమేవ వినశ్యతి ||*


✅👉 దూరం నుండి ఆలయశిఖరాన్ని దర్శించిన వెంటనే నమస్కరించాలి. అలా చేస్తే ఏడుజన్మలలో తాను చేసిన పాపాలనుండి వెంటనే విముక్తుడౌతాడు. రెండుచేతులు జోడించిన వెంటనే మనలోని అహంకారం తొలగి దైవసాక్షాత్కారం కోరి మనస్సు పరితపిస్తుంది. అప్పుడే మనం ఆ దైవాన్ని దర్శించేందుకు పరిపూర్ణమైన యోగ్యత సంపాదించుకున్నవాళ్లమౌతాం.


꧁┉┅━❀🔯❀━┅┉꧂


 *ఆలయపరిసరాల్ని పరిశుభ్రం చేస్తే....*


*పశ్యన్ పరిహరన్ జంతూన్ మార్జన్యా మృదుసూక్ష్మయా!* 

*శనైస్పమ్మార్జనం కుర్యాత్ చాంద్రాయణఫలం లభేత్ ॥*


🛕 పరిశుభ్రమైన మనసు ఉంటేనే పరమేశ్వరుని దర్శనం లభిస్తుందని భావించే మనం.. మరి భగవంతుని నిలయమైన శివాలయానికి వెళ్లి అక్కడ అపరిశుభ్రంగా ఉంటే... ఆలయంలో పశువులు తిరుగుతుంటే.. మనమేం చేయాలి? అప్పుడు భక్తులు అక్కడ ప్రాణులు, పశువులను కొట్టకుండా.. చప్పట్లు చరుస్తూ నోటితో అరుస్తూ వాటిని బయటకు పంపి ఆ పరిసరాన్ని మెత్తటి మార్జని(చీపురు)తో పరిశుభ్రం చేయాలి. అలా చేస్తే గొప్పదైన *చాంద్రాయణవ్రతం ఆచరించిన ఫలితం* కలుగుతుందని శివధర్మశాస్త్రం చెప్పింది.


꧁┉┅━❀🔯❀━┅┉꧂


 *ఆవుపేడతో అలికి ముగ్గులు పెడితే....* 


👉 ఆవుపేడ లక్ష్మీ నిలయంగా భావిస్తాం మనం. పైగా ఆవుపేడలో అనేక సూక్ష్మక్రిములను నశింపజేసే శక్తి ఉంటుంది. అందుకే ఆలయాన్ని శుభ్రంగా ఆవుపేడతో అలికితే కూడా ఎంతో గొప్ప ఫలితం ఉంది. ఆ ఆవుపేడను మంచి ఆవుల నుండీ సేకరించాలి. లేదా తన ఇంటినుంచి తీసుకురావాలి. లేదా పవిత్రమైన చోటునుండి తేవచ్చు. ఆ గోమయాన్ని కూడా పైభాగం, కిందభాగం వదిలి మధ్యలో శుద్ధం, మలినం కాని ఆవుపేడనే తీసుకోవాలని స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాంటి గోమయంతో శివాలయ పరిసర ప్రాంతాన్ని చక్కగా అలికితే... *తమ పూర్వీకులు తరించి గోలోకం చేరుకుంటారు.* చక్కగా రంగవల్లులు (ముగ్గులు) తీర్చిదిద్ది పంచరంగులతో అలంకరిస్తే చాలా చక్కగా ఉంటుంది. అలా చేస్తే చేసిన వారు..వారి కుటుంబసభ్యులతో సహా సిరిసంపదలతో తులతూగుతారు.


꧁┉┅━❀🔯❀━┅┉꧂


 *రంగు రంగుల పూలమాలలతో అలంకరిస్తే...*  


✅👉 ఆకయం తోరణాలకు, గోడలకు, కొన్ని మండపాలు, స్తంభాలను పూలతో అలంకరించడం ఒక గొప్పసేవ. అలా చేస్తే... *ఆ మనిషి రుద్రలోకం చేరతాడని చెప్పబడింది.* 


*యావద్ధస్తా భవే ద్భూమిః సమన్తా దుపశోభితా* 

*తావద్యుగసహస్రాణి రుద్రలోకే మహీయతే*


✅👉 శివాలయాన్ని రకరకాల పుష్పాలతో అలంకరించినా.. అందంగా తీర్చిదిద్దినా..ఎంత ప్రదేశం తీర్చిదిద్దాడో దాన్ని అంగుళాలతో కొలిచి అంతకాలం రుద్రలోకంలో నివసిస్తారని చెప్పబడుతోంది. అలాగే... శివపూజా కైంకర్యాల కోసం పుష్పవనాలను పాదుగొల్పినా.. రకరకాలైన పూల చెట్లను నాటి వాటిని సంరక్షించినా అదికూడా పుష్పకైంకర్యం లెక్కలోకే వస్తుంది కనుక భక్తులు ఈ ప్రయత్నం కూడా చేయాలి.


꧁┉┅━❀🔯❀━┅┉꧂


 *నీటితో కడిగి.. అద్దంలా తుడిచి....* 


👉 ఆలయాన్ని నీటితో కడిగితే ఆ ప్రాంతమంతా పరిశుద్ధమౌతుంది. అటువంటి ఆలయాన్ని కడిగే నీటిని మాత్రం వడగట్టి తీసుకోవాలని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. 


*యః కుర్యాత్ సర్వకార్యాణి వస్త్రపూతేన వారిణా।*

*స ముని స్స మహాసాధు స్వ యోగీ స శివం వ్రజేత్ ॥* 


✅👉 వస్త్రంతో వడగట్టిన నీటితో ఆలయాన్ని పరిశుభ్రం చేసినవారు సజ్జనులు. అతడు యోగియై శివుని చేరుకుంటాడు. అలాగే శివాలయం నేలను అద్దంలా తుడవాలి. ఎంతలా అంటే నేలపై తన ప్రతిబింబం కనపడేంతగా.


꧁┉┅━❀🔯❀━┅┉꧂


 *శివరూపాలను చిత్రిస్తే...* 


✅👉 మనం ఆలయ గోపురాలపై అనేక శిల్పాలు చూస్తుంటాం. అలాగే ప్రాచీన ఆలయాల్లో అనేక శివరూపాలు చిత్రించి ఉంటాయి. ఉదాహరణకు మన రాష్ట్రంలో లేపాక్షి, తమిళనాడులోని మధురై దేవాలయం పై భాగంలో తలెత్తి చూస్తే అనేక దేవుళ్ల చిత్రాలు గమనించే ఉంటారు. అలా మనం కూడా ఆలయాల్లో దేవుడి చిత్రాలు చిత్రింపచేయడం ఒక కర్తవ్యంగా నెరవేర్చాలి.        దీని వలన కలిగే ఫలితం ఇది.


*యావంతి రుద్రరూపాణి స్వరూపాణ్యపి లేఖయేత్ ।* 

*తావద్యుగసహస్రాణి రుద్రలోకే మహీయతే ॥*


చిత్రకారులను రప్పించి వారితో శివాలయంలో వేదపురాణాలలో పేర్కొనబడిన శివుని అవతారాలు, లీలలకు సంబంధించిన చిత్రాలు వేయించాలి. అలా ఎన్ని బొమ్మలు చిత్రిస్తారో అంతకాలం రుద్రకాలంలో గొప్పగా ప్రకాశిస్తారు.


꧁┉┅━❀🔯❀━┅┉꧂


 *ఆలోచించి ఆచరిస్తే అనేక సేవలు*


✅👉 *ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు గుక్కెడు మంచినీళ్లు ఇచ్చి ఉపచరించడం, వారి వసతి కోసం చలువపందిళ్లు వేయించడం, వారికి సమయానికి ఇంత ప్రసాదం పంచడం, తోటి భక్తులకు కావాల్సిన సాయం అడిగి చేయడం, వాహనం మోయడం, రథం లాగడం, ముఖ్యంగా క్షేత్ర మర్యాద తెలుసుకోవడం, పాటించడం, తెలుసుకున్నదానిని నలుగురు భక్తులకూ తెలియజెప్పడం ఇలా ఎన్నో సేవలను భక్తులు ఆచరించవచ్చు.


꧁┉┅━❀🔯❀━┅┉꧂

 *వెల్ల వేయించి..  దీపాలు వెలిగించి...* 


*సుధావిలిప్తం యః కుర్యాత్ సర్వయత్నైశ్శివాలయమ్ ।* 

*తావత్పుణ్యం భవేత్ సోపి యావదాయతనే కృతే ॥* 


✅👉 శివాలయానికి, ప్రాకారం గోడలకు సుధాకర్మ (సున్నం పూయించడం) చేయించిన వారికి ఆలయనిర్మాణం చేసిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది. అలాగే ప్రతి సంవత్సరం విడువకుండా, పాలవంటి తెల్లసున్నంతో లేదా వేరే రంగులతో అందంగా వెల్లవేయించినా అతడికి శివలోకవాసపుణ్యం లభిస్తుంది. అలాగే ఆలయంలోని గోడలకు సుగంధాలు పూయడం, గుగ్గిలంతో ధూపం వేయడం కూడా ఆలయసేవలో భాగాలే.


✅👉 ఆలయం ఆవరణలో దీపాలు వెలిగించడం, దానికి కావలసిన వత్తులు, తైలం మొదలైన ద్రవ్యాలను సిద్ధం చేసి అందించడం, మొదలైన సేవలు ఆ వంశంలోని పిల్లలకు చక్కటి విద్య లభించడానికి ముఖ్యమైన సేవలు.


꧁┉┅━❀🔯❀━┅┉꧂

*సర్వే జనాః సుఖినోభవంతు*

కామెంట్‌లు లేవు: