12, ఆగస్టు 2023, శనివారం

దుర్యోధనుని మహా వైభవం


దుర్యోధనుని  మహా వైభవం 

     

                        


              శా:  నత నానావనినాధ  యూధ  మకుట  న్యస్తాబ్జ రాగోజ్జ్వల


                   ద్యుతి  విభ్రాజిత   పాదపీఠు ,లలనా దోశ్చామరోధ్ధూత  మా


                   రుత  లోలాళి  వినీల కుంతలు ,ప్రభారుగ్ధాము ,కేయూర బాహా

                   యుత భూషున్  సువర్ణ ధరణీ  భృధ్ధైర్యు   దుర్యోధనున్ ;


                         అధర్వణ భారతము--  అధర్వణుడు--జైనాచార్యుడు!


                                              సంస్తృతము నందలి వ్యాస భారతమును  నన్నయ మాత్రమేగాక  జైనుడగు  అధర్వణాచార్యుడు గూడ  ననువదించెనట( సాహిత్య లోక ప్రచారము) కానీ యతడు  అవైదిక మతస్థుడగుట దానిని ప్రజలు ఆదరింపలేదట.ప్రజాదరణమునకు నోచుకోని యాగ్రంధము ఖిలమై  నశించెనట!. కాని లక్షణగ్రంధములలో  లాక్షణికులు కొందరు 

తమసూత్రములకు లక్ష్యములుగా  గ్రహించిన పద్యములను బట్టి యధర్వణభారతమను గ్రంధము రచింపబడిదను సమాచారము మనకు తెలియుచున్నది. పైపద్యము  అధర్వణ భారతమునందలిది. హస్తిపురినేలు  సుయోధనుని   మహావైభవము ఇందు వర్ణింప బడినది.


               అర్ధవివరణము: నత-వంగిన  ; నానావనినాధ-- అనేకదేశరాజుల; యూధ--సమూహముయొక్క;  మకుట--కిరీటములయందు; న్యస్త-- పొదుగబడిన; అబ్జరాగ-పద్మరాగమణులయొక్క;  ద్యుతి--కాంతులచే; విభ్రాజిత --ప్రకాశించుచున్న ;పాదపీఠున్--పాదపీఠముగలవానిని ,లలనా ---అందమైన పరిచారికల; దోఃచామర-- చేతులలోని చామరములచేత; ఉధ్ధూత--ఎగురగొట్టబడుచున్న ;మారుత--గాలికి ;లోల-కదలుచున్న-; అళి-తుమ్మెదలనుబోలు;  వినీల  కుంతలున్--నల్లని ముమగురులు గలవాడు ; ప్రభారుగ్ధామున్-- కాంతులకు నిలయమైనవానిని; కేయూర బాహాయుత భూషున్--కడియముమొన్నగు భూషణములుగల బాహువులుగలవానిని; సువర్ణధరణీభృత్ ధైర్యున్--బంగరుకొండవంటి (మేరుపర్వతమువంటి) ధైర్యముగలవానిని ; దుర్యోధనుని జూచెనని ముందుపద్యముతోనన్వయము.


                     భావము: సామంత రాజ సముదాయము వచ్చి శిరసువంచి యతనిపాదములకు నమస్కరించుచుండ ,వారి కిరీటములయందలి పద్మరాగ మణులకాంతులచే (సుయోధనుని) పాదపీఠము ధగధగ లాడుచుండేను. అందమైన పరిచారిక 

లిరువైపుల నిలచి  విజామరలతో వీచుచుండ నాగాలికి తుమ్మెదలనుబోలిన యతనిముంగురులు కదలుచున్నవి. అతడు మహా

వీరుడగుట ప్రతాపకాంతులకు నైలవైయుండెను. కేయూరాది భూషణాలంకృతమైన బాహువులు కలిగియుండెను.మేరునగ సమానధీరుడై ఆదుర్యోధనుడొప్పారుచుండెను. 


                    వ్యాఖ్యానము:  అధర్వణుడు ప్రౌఢకవి యని యతనిపద్యము  నిరూపించుచున్నది.సుదీర్ఘసమాస ఘటనతో  సుయోధనునిలోని  యహంకారాధిక్యతను గాంభీర్యమును ప్రతాపములను విశదముగావించినాడు.సామంతరాజులు సకిరీటధారులైవచ్చి పాదములకు నమస్కరించుట తిరుగులేని యతని యధికారమునకు సూచకము. దాసీజనము వింజామరలువీచుట, ముంగురులు గాలికి యూగుట యతనివిలాసజీవనమునకు సంకేతము. ప్రతాపకాంతుల విస్తరణము, భూషణాద్యలంకారములు అతనియాండబరమునకు సూచికలు. మేరునగధీరుడని చివరకు చెప్పుట.బలగర్వితుడనియు,తెంపరి బహుసాహసి యనితెలుపుటకు జేసిన ప్రయత్నము.


                           ఈవిధముగా  నొకవంక ప్రౌఢమైన  సాహిత్యమును గ్రుమ్మరించచు ,మరియొక  వంక నతనిరాచరికపు  వైభము విలాసజీవనము  ధైర్యము  ఇత్యాది గుణగణములను దెలిపిన  అధర్వణుడు  బహుధా ప్రశంసనీయుడనుట


                                      యదార్ధము!                         స్వస్తి !🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: