6, సెప్టెంబర్ 2023, బుధవారం

శ్రీకృష్ణాష్టమి

 ॐ          శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు 


    దేవకీవసుదేవులకు కుమారుడుగా చతుర్భుజుడైన స్వామి ఆవిర్భవించినరోజు. 

    వారు స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని చూసి స్వామిని స్తుతించారు. 

    దాన్ని నారాయనతీర్థులవారు ఒక తరంగంలో చక్కగా చూపారు, 


భావం  


దేవకీవసుదేవులు పరమానంద సాగరమగ్నులయి వినుతిస్తున్నారు. 


మంగళస్వరూపా! శ్రీపతీ! 

    నీవు అపరిమిత జ్ఞానానంద స్వరూపుడవు. జ

    సనకాదియోగులునూ, బ్రహ్మాదిదేవతలునూ నీ మహిమను చనలేరు, 

    అట్టివాడవు మా గర్భాన ఈ చీకటింట ఉదయించడమేమి? 

    ఈ దివ్యకిరీటరత్న ప్రకాశమేమి? 

    ఈ పీతాంబర సుందర దివ్యమంగళ విగ్రహమేమి? 

    ఈ కౌస్తుభ వనమాలాలంకృత వక్షమేమి? 

    ఈ మకరకుండల ప్రభావిభావసిత కపోలమేమి? 

    ఈ కనుతామరల విలాసములేమి? 

    సకల దుష్ట తమస్సులను పారదోలు నీ దివ్యపుంజమేమి? 

    ఆశ్చర్యంగా ఉంది. 

    దీనులమైన మమ్మ గావుము. 

    భూమియందు గురుభక్తి విశేషంగల నారాయణతీర్థమునికి రక్షకుడవు కమ్ము. 


తరంగం 


మంగళాలయ మామవ దేవ

పంకజాసన భావిత భావ 


1. దేవకీవసుదేవతనూజ

    దివ్యకిరీట దళితభవబీజ

    సర్వయోగివిచింత్యపదాబ్జ

    సంగతాఖిలసాధుసమాజ


2. అపరిమితానందబోధస్వరూప

    అతికరుణాకర కరధృతచాప 

    కపటదైత్యహర ఖండితపాప

    కనకాంబరధర కలితకలాప 


3. మకరకుండల కేయూరవిభూష

    మనసిజశతకోటి మంజులవేష

    వికచకమలసన్నిభ విపులాక్ష

    విమలహృదయ గోపాలరక్ష


4. కలిత శ్రీకౌస్తుభ కమనీయ కంఠ

    కరుణారసభర మిళిత వైకుంఠ

    పరిపాలయభువి భాగ్యవితరణ

    గురుభక్త నారాయణతీర్థ శరణ 


అవతారిక 


    ఇట్లు తదేకచిత్తంతో భగవంతుని దివ్యమంగళ విగ్రహాన్ని సేవించి, 

    కంసునివలన భయమునొందినవాడు గావున ఈ విధంగా విన్నవించుకొనుచున్నాడు వసుదేవుడు.  


    శ్రియఃపతీ! 

    సర్వాంతర్యామివగు నీవు ఎఱుగనిది ఉన్నదా? 

    సర్వేశ్వరుదవగు నీవు దేవబ్రాహ్మణరక్ష ఎటులచేయనగునో? అది ఆనతిమ్ము. 

    మరియు మహా తపస్సంపన్నులగు మనీంద్రులకు గమ్యమైన నీ దివ్యరూపమును దర్శింప శక్తులముగాని మాకు, 

    మనుష్య బాలరూపమును చూపుము. 

    

https://youtu.be/0Z2Yh44jquE?si=IBamG7asP87b_kEm


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం

కామెంట్‌లు లేవు: