29, సెప్టెంబర్ 2023, శుక్రవారం

సందేహాలు-- సమాదానాలు

 ప్ర : పూజంతా చేసి “పాపోహం పాపకర్మాహం" అని దేవుని ముందు ప్రదక్షిణం చేయడం తప్పుకదా! పూజించాక ఇంకా ఎక్కడ పాపముంటుంది? కాబట్టి "పుణ్యోహం-పుణ్య కర్మాహం” అనుకోవడం మంచిదికదా! 


జ: ప్రదక్షిణల వల్ల పాపాలు పోతాయనేది నిజమే. అయితే మనం మనసారా మన  తప్పుల్ని ఒప్పుకోవాల్సిందే. మన పాపాలను దాపరికం లేకుండా దేవుని ముందు ఒప్పుకోవడానికే పెద్దలు ఆ శ్లోకం ఉంచారు. సంప్రదాయంగా వస్తున్న సదాచారాలలో చాలా గంభీరార్థం ఉంటుంది. ఆవేశపడి వెంటనే మార్చేయకూడదు.

పైగా-జీవుడికి కర్మసంచితాలు ఎన్నో అతడే నిర్ణయించలేడు. ఒక్క పూజతోనే పోయేవికావుగా. కొన్ని కొన్ని క్రమ క్రమంగా నశిస్తుంటాయి. ఇంకా చేయబోయేవీ ఉంటాయి కదా! "పుణ్యోహం” అని చెప్పాక, ఇంక “త్రాహిమాం” ఎందుకు? తప్పులు ఒప్పుకొనే నిజాయతీలో శరణు వేడడం ఆ శ్లోకంలో భావం.

*ప్ర* :  *'రాముడు'  ఏకపత్నీవ్రతుడు' కావచ్చు. కానీ కృష్ణుడు, విష్ణువు, శివుడు వీళ్ళంతా కారుకదా! మరి*  *'బహుభార్యాత్వంఉన్నప్పుడు ఎలా 'ధర్మం' అనగలం?* 


 *జ* : రాముడు 'ఏకపత్నీ' అనే వ్రతాన్ని పట్టినవాడు. తద్వారా కుటుంబ వ్యవస్థ పటిష్టతకు సరియైన ఆదర్శాన్ని చూపించాడు. 'ఒక భర్తకు ఒక భార్య' అనేది ఉత్తమ ధర్మం.

దీనికి భిన్నంగా వెళ్ళడానికి ధర్మంగా సమర్ధించరాదు. అయితే దశరథుడు ధర్మమయుడే. అందులో సందేహం లేదు. రాజ ధర్మంలో కొన్ని సందర్భాల్లో బహుభార్యాత్వం తప్పదు. అది సమర్ధనీయం కాకపోవచ్చు. కానీ అప్పటి పరిస్థితుల్లో గర్వనీయమూ కాదు. వాటికి రాజకీయపరమైన కారణాలు ఉంటాయి. కొన్ని దేశకాల పరిస్థితుల్లో అప్పటి సామాజిక అవసరాలూ వాటికి హేతువౌతాయి. అనాదిగా ఈ దేశంలో గౌరవస్థానం పొందినది ఏకపత్నీ ధర్మమే. అత్రిఅనసూయ, వశిష్ఠఅరుంధతులు -  వంటి కుటుంబీకులు అందరూ - 'ఒక భర్తకు ఒక భార్య' అనే ధర్మాన్ని అవలంబించినవారే. 'సుందరకాండ'లో సీత -సనాతన దాంపత్య ధర్మానికి ప్రతీకలుగా చెప్పిన పరంపర అంతా ఆ ధర్మావలంబకులే.

ఇక -శ్రీ కృష్ణుడు సాక్షాత్తు దైవంగానే ప్రవర్తించాడు. ఆయన పత్నులందరికీ పతిగా వివిధ రూపాలు ధరించాడు. కృష్ణునిలో దైవలక్షణం, మానుష ధర్మం కలగలిసి కనిపిస్తాయి. మానుషాతీతమైన కృష్ణలీల అనుకరణకు అసాధ్యం. వాటిని కృష్ణుడు ఆయా జీవులను అనుగ్రహించిన పరమాత్మ విధానంగా గుర్తించాలి. అతిమానుషమైన

కృష్ణ ధర్మం -ఆదర్శం. యోగీశ్వరేశ్వరుడైన కృష్ణుని కథ ఏకాగ్రబుద్ధితో అధ్యయనం

చేయవలసినది.

విష్ణువు, శివుడు దేవతలు. గంగ, గౌరీ దేవతలు ఒకే పరాశక్తి యొక్క రూపాలు. అలాగే ఒకే మహాలక్ష్మీ దేవత శ్రీ లక్ష్మీ భూలక్ష్ములుగానున్నది. వారు ఉపాస్య దైవాలు. వాటికి మానుషపరమైన అన్వయాన్ని ఇవ్వలేం. ఇంకా - వాటి వెనుక మంత్ర, ఉపాసనా పరమైన అంతరార్థాలూ ఉన్నాయి. ఎప్పటికైనా మానవ సమాజానికి అత్యంత ఆవశ్యక ధర్మం మాత్రం 'ఒక భర్తకు ఒక భార్య' అనే ఉన్నతాదర్శమే.

కామెంట్‌లు లేవు: