13, అక్టోబర్ 2023, శుక్రవారం

అర్చన..విభూతి.

 *అర్చన..విభూతి..*


"నేనండీ..తిరుమల రెడ్డిని...మా దంపతుల పేరు మీద రేపు గురువారం ఉదయం స్వామిదగ్గర అర్చన చేయిస్తారా?..మా గోత్రము వగైరాలు మీకు మెస్సేజ్ చేస్తాను..రెండు మూడు వారాల్లో అక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటాము..చాలా ఇబ్బందుల్లో వున్నాను స్వామీ..ఈ ఒక్క సహాయం చేయండి.." అని అతను ప్రాధేయపడుతూ ఫోన్ లో అడిగాడు.."అలాగే రెడ్డి గారూ..అర్చన చేయిస్తాను.." అన్నాను..మరో పదినిమిషాల్లో అతను తనది, తనభార్యది గోత్రము, నక్షత్రము మెస్సేజ్ చేసాడు..మా అర్చకస్వామికి ఆ గోత్రనామాలు ఒక కాగితం మీద వ్రాసి ఇచ్చి..మర్చిపోకుండా అర్చన చేయమని చెప్పాను..


ఆ ప్రక్కరోజు గురువారం..స్వామివారికి ప్రభాతసేవ పూర్తి కాగానే..అర్చకస్వామి తిరుమలరెడ్డి దంపతుల గోత్రనామాలతో అర్చన చేశారు..ఆ విషయమే నాకు తెలిపారు కూడా..మరో గంటలో తిరుమల రెడ్డి ఫోన్ చేసి.."అయ్యా..మన్నించండి..మా తరఫున స్వామివారి వద్ద అర్చన జరిపించారు కదా.." అన్నాడు.."జరిపించాము.." అన్నాను.."చాలా ధన్యవాదాలు స్వామీ.." అని చెప్పి.."ఇప్పుడున్న పరిస్థితుల్లో మా కుటుంబాన్ని ఆ స్వామివారే ఆదుకోవాలి.." అన్నాడు..నాకు కొద్దిగా ఆశ్చర్యం వేసింది.."ఏమైంది రెడ్డిగారూ..ఎందుకు ఆందోళన చెందుతున్నారు..?" అన్నాను.."నేను అక్కడికి వచ్చి అన్నీ వివరంగా చెపుతాను..అయ్యా..దయచేసి స్వామివారి విభూతి గంధం మా అడ్రెస్ కు పంపించండి.." అన్నాడు.."అలాగే పంపుతాము.." అని చెప్పాను..ప్రక్కరోజే అతని చిరునామాకు స్వామివారి విభూతి గంధం పోస్ట్ ద్వారా పంపాము..ఆ తరువాత అతని వద్ద నుంచి మరే సమాచారము రాలేదు..మేము కూడా ఆ విషయం మర్చిపోయాము..


ఐదారు నెలలు గడిచిపోయాయి..ఒక శనివారం నాటి మధ్యాహ్నం తిరుమల రెడ్డి తన భార్యతో సహా మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చాడు.."ఈరోజు స్వామివారి వద్దకు రావడానికి వీలు కలిగింది..అందుకే ఉదయాన్నే బయలుదేరి నేరుగా మాలకొండకు వచ్చి..ఆ మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకొని..ఇక్కడికి వస్తున్నాము..ఈరోజు పల్లకీసేవ లో పాల్గొని..రేపుదయం స్వామివారి సమాధి దర్శించుకొని వెళ్లిపోతాము.." అన్నాడు.."కొన్నాళ్ల క్రితం మీరేదో ఇబ్బందుల్లో ఉన్నామని నాతో అన్నారు కదా?..ఇప్పుడు బాగున్నారా..?" అని అడిగాను..ఆ మాట అడిగిన వెంటనే..తిరుమల రెడ్డి ముఖం గంభీరంగా మారిపోయింది.."ఆ విషయం మీతో చెప్పుకోవాలి..ముఖ్యంగా ఈ స్వామివారు నన్ను ఎలా కాపాడిందీ మీతో చెప్పుకోవాలి..మీకు తెలుసుకదా నేను సెంట్రింగ్ కాంట్రాక్టులు చేస్తుంటానని..ఆరేడు నెలల క్రితం ఒక్కసారిగా వ్యాపారం లో మాంద్యం ఏర్పడింది..నాకు సెంట్రింగ్ కాంట్రాక్ట్ ఇచ్చిన ముగ్గురు బిల్డర్లూ బిల్లులు రాలేదని పనులు ఆపేశారు..వాళ్ళ వద్దే సుమారు ఒక లక్ష చదరపు అడుగుల సెంట్రింగ్ పెట్టివున్నాను..పూర్తిగా ఆగిపోయింది..చేతిలో ఉన్న పెట్టుబడి ఇరుక్కుపోయింది..ఈలోపల మా భార్య కడుపులో నొప్పి అంటూ బాధపడుతోంది..డాక్టర్ గారికి చూపిస్తే ఆపరేషన్ చేయాలన్నారు..ఆవిడను హాస్పిటల్ లో చేర్పించాను..మూడురోజుల తరువాత ఆపరేషన్ చేస్తాము..అంతవరకూ ఇక్కడే ఉంచండి..పరీక్షలు చేయాలి..అన్నారు..పరీక్షలకే సుమారు యాభైవేలు ఖర్చు పెట్టించారు..ఒక్కసారిగా నిరాశ ఆవహించింది..అప్పుడే మీకు ఫోన్ చేసాను..ఏ దిక్కూ తోచలేదు..ఈ స్వామివారే పదే పదే గుర్తుకొచ్చారు..ఇన్నిసార్లు మొగిలిచెర్ల వెళ్లినా ఎన్నడూ స్వామివారిని ఏ కోరికా కోరలేదు.."మమ్మల్ని చల్లగా చూడు తండ్రీ.." అని మాత్రమే కోరుకునేవాడిని..కానీ ఆరోజు మాత్రం "స్వామీ నన్నూ నాకుటుంబాన్నీ నువ్వే కాపాడాలి.." అని మొక్కుకున్నాను..మీరు మా పేర్లతో అర్చన చేయించాము అని చెప్పారు..గురువారం మీరు అర్చన చేయించారు..శుక్రవారం మధ్యాహ్నం డాక్టర్ గారు నన్ను పిలిచి.."ఆపరేషన్ ఇప్పుడు అవసరం లేదని అనుకుంటున్నాము..పరీక్షల్లో పెద్దగా ఏమీ కనబడలేదు..మందులు వాడండి..ఓ రెండు మూడు నెలల తరువాత మళ్లీ చూసి..అప్పుడు నిర్ణయం తీసుకుందాము.." అన్నారు..శనివారం పొద్దున్న ఇంటికి పంపారు..కేవలం స్వామివారి దయ వల్లే ఇలా జరిగింది అని అనిపించింది..మరో రెండు మూడు రోజుల్లో మీరు పంపిన స్వామివారి విభూతి గంధం పోస్టులో వచ్చాయి..స్వామివారి ఫోటో వద్ద వాటిని ఉంచి..రోజూ నుదుటి పై ఇద్దరమూ పెట్టుకున్నాము..వారం గడిచింది..నేను పని ఒప్పుకున్న ముగ్గురు లో ఒకరు నన్నుపిలచి..మళ్లీ పని మొదలుపెట్టమని చెప్పారు..కొంత డబ్బు కూడా ఇచ్చాడు..మరో నెల కల్లా మూడు చోట్లా పని మొదలైంది..గాడిన పడ్డాను..మొన్ననే మొదటి బిల్లు కూడా చేతికి వచ్చింది..ఇక ఆగలేదు..నేరుగా ఇక్కడికి వచ్చాను..ఆమె ఆరోగ్యం బాగుంది..నా సెంట్రింగ్ వ్యాపారం కూడా  బాగుంది..స్వామివారు ఎంత దయ చూపించారో అర్ధం అయింది.." అంటూ బాగా ఉద్వేగంతో చెప్పుకొచ్చాడు.."ఈ స్వామి చల్లంగా చూడబట్టే ఇప్పుడు ఇద్దరమూ ఇలా ఉన్నాము.." అంటూ అతని భార్య అన్నది..ప్రక్కరోజు ఉదయం స్వామివారి సమాధి దర్శించుకొని ఇవతలికి వచ్చి.."అయ్యా..మందిరం వద్ద రూములు కట్టిస్తామన్నారు కదా..నాకు తెలపండి..నా శక్తిమేరకు నేను కూడా పాలుపంచుకుంటాను.." అని నాతో చెప్పి వెళ్లారు..


భక్తుల అనుభవాలు కోకొల్లలు..వాటికి కారణభూతుడైన ఆ అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారు మాత్రం మందిరం లోపల మౌనంగా సమాధి స్థితి లో ఉండి..అందరినీ ఉద్దరిస్తున్నారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: