14-15-గీతా మకరందము
గుణత్రయవిభాగయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అవతారిక - రజోగుణ, తమోగుణయుతులు మరణానంతరము బొందు గతులను వివరించుచున్నారు–
రజసి ప్రళయం గత్వా
కర్మసఙ్గిషు జాయతే |
తథా ప్రలీనస్తమసి
మూఢయోనిషు జాయతే ||
తాత్పర్యము:- రజోగుణము అభివృద్ధినొందియుండగా మరణించువాడు కర్మాసక్తులగు వారి యందు జన్మించుచున్నాడు. అట్లే తమోగుణ మభివృద్ధినొందియుండగా మరణించువాడు పామరుల గర్భములందు, లేక పశుపక్ష్యాది హీనజాతులందు పుట్టుచున్నాడు.
వ్యాఖ్య:- రజోగుణాధిక్యత గలిగి మరణించువాడు తనయొక్క సంస్కారమునకు అనుగుణ్యముగనే తిరిగి కర్మాసక్తులయందు జన్మించుచున్నాడు. అట్లు జన్మించి మఱల పెక్కు బహిర్ముఖకార్యములందు, విషయాదులందు ప్రవర్తించి - తిరిగి మరణించుచు - ఈ ప్రకారముగ సంసారబంధమునుండి విడివడక, పెక్కుయాతనల ననుభవించుచు అశాంతి గలిగియుండును. ఇక తమోగుణాధికత్యయందు మరణించువాడు హీనచరితులగు మూఢజనులందో, లేక పశుపక్ష్యాదులందో జన్మించును. అట్టివా రెన్ని దుర్భరదారుణ దుఃఖముల ననుభవించవలెనో! కావున అట్టి భయంకర పరిణామములు, భీషణదుఃఖజనకపరిస్థితులు తనకు కలుగకుండ జీవుడు అతిజాగరూకుడై జీవితకాలమున, మరణము దవ్వుననున్నపుడే ప్రయత్నపూర్వకముగ ఆ రజోగుణ, తమోగుణరూప ఫెూరపిశాచములను తన హృదయగేహమునుండి తరిమివేసి, భగవద్భక్తి, వైరాగ్యము, ఆత్మజ్ఞానము - ఇత్యాది సద్గుణరాశిని అలవఱచుకొని ముక్తుడై జన్మసార్థకత నొందవలయును.
ప్రశ్న:- రజోగుణాధిక్యతగలిగి మరణించువా డెచ్చోట జన్మించును?
ఉత్తరము: - కర్మాసక్తులందు.
ప్రశ్న:- తమోగుణాధిక్యత గలిగి మరణించువా డెచ్చోట జన్మించును?
ఉత్తరము:- పామరుల (మూఢజనుల) గర్భములందు, లేక, పశుపక్ష్యాది నీచ జాతులందు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి