8, మార్చి 2025, శనివారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!

*ద్రోణ పర్వము ద్వితీయాశ్వాసము*


*310 వ రోజు*


*సుభద్ర శోఖం*


కాని సుభద్ర పుత్రశోకము తట్టుకొన లేక శోకిస్తూ " నాయనా అభిమన్యా ! నేను పుణ్యం చేసుకుని నిన్ను కనే భాగ్యాన్ని పొందాను కాని నీ ముద్దు ముచ్చటలు చూసే భాగ్యానికి కరువయ్యాను. అత్యంత పరాక్రమవంతులైన కౌరవ వీరులను హతమార్చిన నీవు ఇలా దిక్కు లేని మరణం పొందుట నా మనస్సు కలచి వేస్తుంది. శిశువుగా సగం శరీరం నా మీద మిగిలిన శరీరం మెత్తటి శయ్య మీద ఉండేలా శయనించిన నీవు ఇలా కటిక నేలపై పరున్నావా! వంధి మాగధుల శోత్రపాఠములను విను నువ్వు ఇప్పుడిలా నక్కల ఊళలు వింటున్నావా ! ఇంతమంది మహా యోధులు పాండవులు విరాట, ద్రుపద, సాత్యకి, భీమసేనుల పరాక్రమం నిన్ను రక్షించ లేక పోయిందా! మహావీరుడైన అర్జునుడి కుమారుడవు శ్రీకృష్ణుని మేనల్లుడవు నీవు ఇలా శత్రువుల చేత మరణించుట చోద్యము కాక మరేమి ! నాయనా నీ భార్య ఉత్తర వచ్చింది చూడు లేచి ఆమెను ఓదార్చు " అని పలు విధముల రోదిస్తూ ఉంది. ద్రౌపది తన రెండు చేతులతో సుభద్ర, ఉత్తరలను పొదివి పట్టుకుని అలాగే వివశురాలై భూమి మీద పడి పోయింది. శ్రీకృష్ణుడు వారిని ఉచిత వచనములతో ఓదార్చి పాండవుల వద్దకు వచ్చి అందరిని వారి వారి శిబిరములకు వెళ్ళమని చెప్పాడు. తాను కూడా అర్జునుడితో అతడి శిబిరానికి వెళ్ళాడు.


*కృష్ణార్జునులు ఆయుధపూజ చేయుట*


శిబిరానికి వెళ్ళిన కృష్ణార్జునులు ఒక ప్రదేశమున దర్భాసనము వేసి దానిపై గాండీవము, దేవదత్తము, పాంచజన్యము, సుదర్శనము మొదలైన ఆయుధములు అమర్చారు. శ్రీకృష్ణుడు అర్జునుడిని వాటి మధ్య నిద్రించమని చెప్పాడు. ఆ తరువాత తన సారథి దారుకునితో తన శిబిరానికి వెళ్ళాడు. తాను కూడా నిద్ర పోదామని అనుకున్నా! నిద్ర రాలేదు. పాండవ శిబిరములో ఎవరికి నిద్ర రాలేదు. పాండవులు " కుమారుని మరణనానికి క్రుద్ధుడైన అర్జునుడు భీకర ప్రతిజ్ఞ చేసాడు. దానిని కౌరవులు ఎలాగైనా వమ్ము చేయ ప్రయత్నిస్తారు. రేపు పొద్దుక్రుంకే సమయానికి అర్జునుడు సైంధవుని చంపలేకున్న అగ్నిప్రవేశం చేస్తాడు. అప్పుడు పాండవులు ఏమౌతారు మనమేమి ఔతాము. అతడి పూజలు ఫలించి అర్జునుడు సైంధవుని వధించాలి. ద్రోణుల వంటి వారు పది వేల మంది రక్షించినా సైంధవుడు అర్జునుడి చేతిలో మరణించాలి " అని ముక్కోటి దేవతలను ప్రార్థిస్తూ వేడుకున్నారు. శ్రీకృష్ణుడికి కూడా నిద్ర పట్ట లేదు. సారథి దారుకుని చూసి " దారుకా ! అర్జునుడి ప్రతిజ్ఞ విన్నావు కదా ! రేపటి లోపల సైంధవుని చంపుట సాధ్యమా ! ఒక వేళ చంపలేకున్న ఎంత దుర్ధశ సంభవించగలదు. అర్జునుడు నా బహిర్ప్రాణము నాలో సగము అతడు లేక నేను జీవించ లేను ఇది నీకు తెలుసు. కనుక అతడిని రక్షించుకోవడం నా కర్తవ్యం. నాకు ఈ ద్రోణుడు ఒక లెక్క కాదు. రేపు ఈ చరాచర ప్రపంచం నా పరాక్రమము తిలకిస్తాయి. పాండవుల మీద నాకున్న ప్రేమ లోకానికి తెలియజేస్తాను. రేపు నేను విజృంభించి సైంధవుని హతమారుస్తాను. గర్వాంధుడు సుయోధనుడు సకల సైన్యంతో నన్ను అడ్డుకున్నా అందరిని హతమార్చి సైంధవుని చంపుట తధ్యం " అన్నాడు. " దారుకా ! నా రథం సిద్ధం చెయ్యి. శౌబ్య, సుగ్రీవ మొదలగు అశ్వరాజములను రధముకు కట్టు. గరుడ ధ్వజము ఎత్తించు. నా ఆయుధములైన సుదర్శనచక్రము, గధ వంటి ప్రముఖ ఆయుధములు రధములో పెట్టు. రేపు అత్యంత జాగరూకుడివై నేను పాంచజన్యం పూరించినంత రధమును అతి వేగంగా తీసుకు వచ్చి నా ముందుంచు. నేను నా రధము ఎక్కి సైంధవుని వధిస్తాను " అన్నాడు. దారుకుడు " మహానుభావా! నీ ఆజ్ఞ శిరసావహిస్తాను. రధము సిద్ధము చేసి మీ ఆజ్ఞ కొరకు వేచి ఉంటాను. అసలు మీరు అర్జునుడి రథం ఎక్కి పాంచజనన్యం పూరించగానే కౌరవుల గుండెలు జారిపోతాయి. తమరు యుద్ధం చేసే అవకాశం ఉండదు అయినా తమరి ఆజ్ఞకొరకు వేచి ఉంటాను " అన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: