*తిరుమల సర్వస్వం -171*
*శ్రీ హాథీరామ్ బావాజీ 3*
మహిమ గల సిద్ధులకు, మునిపుంగవులకు సైతం సాధ్యంకాని శ్రీరాముని నిజరూపదర్శనం తనబోటి సాధారణ భక్తునికెలా సాధ్యం? ఇది తప్పనిసరిగా కలయే! స్వామి స్వప్నంలోనికి వచ్చి తనతో పరిహాసమాడుతున్నాడు! ఇలా పరి పరి విధాలుగా ఆలోచిస్తూ ఉద్విగ్న మనస్కుడై, చేష్టలుడిగిన బావాజీ ఆంతరంగాన్ని పసిగట్టిన శ్రీరామచంద్రుడు అతనిని సంబోధిస్తూ, అది కల కాదని, తన ఇష్టసఖుడైన బావాజీతో పాచికలాడ డానికి వైకుంఠం నుంచి దిగి వచ్చానని సర్దిచెప్పి పాచికలాట ప్రారంభించాడు.
*భగవంతుని ఐచ్ఛిక ఓటమి*
భక్తులచేతిలో పరాజయం పొందటాన్ని అమితంగా ఇష్టపడే శ్రీవారు, పాచికలాటలో స్వచ్ఛందంగా పరాజితులయ్యారు. తాను ఓటమిపాలై, బావాజీ విజేతగా నిలచినందున ఏదైనా వరాన్ని కోరుకొమ్మని పలికారు. సంతోషాంతరంగుడైన బావాజీ శ్రీరామచంద్రుని దర్శనభాగ్యంతో తన చిరకాల వాంఛ యీడేరి జన్మ ధన్యమైందని, అంతకుమించిన సంపద మరేమీ లేదని, శ్రీరాముని పాదాల చెంత కొంచెం చోటిమ్మని, ఇకమీదట తనను దూరం చేయవద్దని విన్నవించుకున్నాడు.
బావాజీ నిస్వార్థ భక్తికి ముగ్ధుడైన శ్రీరామచంద్రుడు బావాజీకి తగిన ఆభయం ఇవ్వడమే కాకుండా, ప్రతిరోజు రాత్రి బావాజీతో పాచికలాడే నిమిత్తం ఆశ్రమానికి విచ్చేస్తానని శెలవిచ్చి అంతర్థానమయ్యాడు. బాబాజీ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. మరునాటి ఉదయం శ్రీవారి దర్శనం నిమిత్తం ఆలయానికి విచ్చేసిన బావాజీకి పరమాశ్చర్యకరంగా, ఏ విధమైన అడ్డంకులు ఎదురు కాలేదు. చాలా సేపు శ్రీవారిని తనివితీరా దర్శించుకుని, తిరిగి ఆశ్రమానికి వచ్చి, సూర్యాస్తమయం కోసం ఆతృతగా ఎదురు చూడసాగాడు. 'ఎప్పుడెప్పుడు శ్రీవారితో పాచికలాడదామా' అని ఒక ప్రక్కన బావాజీ; ప్రియభక్తునితో భేటీ కోసం మరో ప్రక్కన శ్రీరామచంద్రుడు ఇరువురూ ఉవ్విళ్ళూరుతున్నారు.
ఆనాటి రాత్రి పవళింపుసేవ అనంతరం ఆలయద్వారాలు మూయగానే, శ్రీవేంకటేశ్వరుడు శ్రీరామచంద్రుని రూపంలో బావాజీ ఆశ్రమానికేతెంచి, అతనితో పాచికలాడి, తన భక్తుని సాన్నిహిత్యంలో మురిసిపోయి, బావాజీని కూడా పరమానంద భరితుణ్ణి గావించాడు. అలా చాన్నాళ్ళు రాత్రివేళల్లో పాచికలాడిన తరువాత, బావాజీ సేవాభావానికి పూర్తిగా సంతృప్తి చెందిన శ్రీవారు, బావాజీ భక్తితత్పరతను లోకానికి చాటిచెప్పాలని భావించారు. తక్షణం వారి మదిలో ఒక ఆసక్తికరమైన పథకం రూపుదిద్దుకుంది. ఆ పథకాన్ని ఆచరణలో పెట్టే ఉద్దేశ్యంతో వెంటనే స్వామివారు కార్యోన్ముఖులయ్యారు.
[స్వామివారి పథకం ఏమిటో, దాన్ని వారు ఏ విధంగా ఆచరణలో పెట్టారో, దానితో బావాజీ పేరుప్రఖ్యాతులు ఏ విధంగా మార్ర్మోగి పోయాయో తెలుసుకుందాం.]
బాబాజీ భక్తి తత్పరతను, నిస్వార్థ సేవాభావాన్ని లోకానికి వెల్లడించే ప్రయత్నంలో శ్రీవారు ఒక మహత్తరమైన పథకానికి నాంది పలికారు.
*మాయమైన వజ్రాలహారం*
ఒకనాటి రాత్రి యథావిధిగా బావాజీ ఆశ్రమానికి వచ్చి, దాదాపు రాత్రి సమయమంతా బావాజీతో పాచికలాటలో వ్యస్తులై ఉన్న శ్రీవారు ప్రాతఃసంధ్య వేళలో సుప్రభాతపఠనం వినిపించడంతో, ఆటను మధ్యలోనే ఆపి హుటాహుటిగా ఆనందనిలయానికి బయలుదేరారు. బాబాజీ లాంటి భక్తులెందరికో దర్శనమిచ్చి వారందరినీ స్వామివారు కటాక్షించాలి కదా!
ఆ హడావిడిలో శ్రీవారు తన వజ్రాలహారాన్ని అక్కడే వదలి వెళ్లారు. స్వామివారు నిష్క్రమించిన తర్వాత, వారి వజ్రాలహారాన్ని గమనించిన బాబాజీ దాన్ని తీసి పూజామందిరంలో భద్రపరిచాడు. మరునాటి రాత్రి ఆటకై వచ్చినపుడు దాన్ని భద్రంగా శ్రీవారికి అందజేద్దామని బావాజీ ఆంతర్యం.
ఇంతలో, సుప్రభాతానంతరం గర్భాలయం లోకి విచ్చేసిన అర్చకస్వాములకు, దర్శనార్థమై వచ్చిన అధికారులకు, భక్తులకు స్వామివారు వజ్రాలహారం లేకుండా దర్శనమివ్వడంతో అందరూ విస్తుపోయారు. స్వామివారి అమూల్యమైన హారం చోరీకి గురైందని భావించారు. ఆలయంలో అణువణువునా గాలించారు. చివరికి అర్చకస్వాముల ఇళ్ళలో కూడా సోదాలు జరిగాయి. ఎక్కడా హారం కానరాలేదు.
*బావాజీపై నేరారోపణ*
చివరికి ఆలయ అధికారుల దృష్టి బావాజీపై పడింది. ప్రతినిత్యం స్వామివారిని గంటల తరబడి తదేకదీక్షతో గమనిస్తూ ఉండడంతో బావాజీపై అనుమాన బీజం నాటుకుంది. కొద్దిసేపట్లోనే అనుమానం పెనుభూతంగా మారడంతో, రాజభటులు బావాజీ ఆశ్రమం లోకి బలవంతంగా ప్రవేశించి వెతుకులాట ప్రారంభించారు. ఈ విషయాలను ఏమాత్రం పట్టించుకోకుండా దైవచింతనలో మునిగివున్న బావాజీ అమాయకంగా ప్రశ్నించడంతో రాజభటులు శ్రీవారి అమూల్యమైన ఆభరణం తస్కరించబడిందని, అధికారుల ఆనతి మేరకు తాము బావాజీ ఆశ్రమంలో గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అదేదో మామూలు విషయంగా భావించిన బాబాజీ రాత్రి సమయంలో శ్రీరామచంద్రుడు తన ఆశ్రమానికి విచ్చేసి, తనతో పాచికలాడి, సుప్రభాత సమయంలో హడావిడిగా లేచి వెళ్లారని; ఆ తొందరపాటులో వజ్రాలహారాన్ని అక్కడే మరచిపోయారని జరిగింది జరిగినట్లుగా విడమరచి చెప్పాడు.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి