🕉 108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు ::
88వ దివ్యదేశము 🕉
🙏శ్రీ విజయరాఘవ పెరుమాళ్ దేవాలయం,
తిరుప్పుళ్ కుళి, కాంచీపురం 🙏
🔅ప్రధాన దైవం: విజయరాఘవ ప్పెరుమాళ్
🔅 ప్రధాన దేవత: మరకతవల్లి
🔅 పుష్కరిణి: జటాయుతీర్థం
🔅విమానం: విజయకోటి విమానము
🔅 జటాయువునకు
🔔 స్థలపురాణం 🔔
💠 పరంధాముని భక్తవత్సలతకు ఎల్లలు లేవు అని తెలిపే ఈ ఆలయ గాధ శ్రీ మద్రామయణం నాటి సంఘటనతో ముడిపడి ఉన్నది.
💠శ్రీమహావిష్ణువు రాక్షస సంహారార్ధము ఇక్ష్వాకు వంశమున దశరథ మహారాజు తనయునిగా జన్మించిన శ్రీరామ అవతారమున తన పినతల్లి కైకేయికి తండ్రి ఇచ్చిన వరము నెరవేర్చుటకై 14 సంవత్సరములు వనవాసము చేయుచుండగా ( భార్య సీతాదేవి , తమ్ముడు లక్ష్మణుడు కూడ శ్రీమునితో బాటు వనవాసమున యుండిరి ) .
💠 ఆ సమయమున రావణాసురుడు సీతాదేవిని మాయోపాయము చేసి బలవంతముగా తన లంకాపురికి తీసికొని పోయి బంధించెను . సీతను వెదకుచూ రామలక్ష్మణులు అడవులలో తిరుగుచుండగా జటాయువు అను ఒక గరుడజాతి పక్షి నేలపై పడి మూలుగుచుండుట చూచి ఆ పక్షి దగ్గరకు పోయిరి . ఆ జటాయువు ..రావణుడు సీతను అపహరించి బలవంతముగా తీసికొని పోయెనని చెప్పెను .
ఆ విషయము శ్రీరాముడు ఎప్పటికైనా వచ్చునప్పుడు తెలియ జేయుటకే వేచియుండినట్లు తెలియ జెప్పి తన కర్తవ్యము పాటించిన తృప్తితో శ్రీరాముడు తనను చేతులలో తీసికొని నిమురు చుండగా ప్రాణములు విడిచెను .
💠శ్రీరాముడు జటాయువును తన తండ్రి స్థానమున భావించుకొని తండ్రికి ( దశరథునకు ) అంత్యక్రియలు చేయలేక పోవుటచే , జటాయువునకు అంత సంస్కారములు చేసి భూమిలో గోయితీసి పాతి పెట్టెను .
శ్రీరామునిలో జటాయువు శ్రీమహావిష్ణువును దర్శించెను .
కార్యక్రమానికి కావలసిన నీటి కొరకు శరప్రయోగం తో పాతాళగంగ ను రప్పించారు. అదే ఈ ఆలయంలో ఉన్న "జటాయువు పుష్కరిణి ".
💠వేగావతి నదీతీరం లో ప్రశాంత రమణీయ వాతావరణంలో ఉన్న ఈ ఆలయంలో శ్రీ విజయరాఘవ పెరుమాళ్ ఉపస్థిత భంగిమలో తూర్పు ముఖంగా దేవేరులు శ్రీ దేవి భూదేవి తో కలిసి దర్శనమిస్తారు. మూలవిరాట్టు ఒడిలో జటాయువు ను చూడవచ్చును.
పక్షిరాజు మరణానికి చింతిస్తున్నట్లుగా అమ్మవార్లు తమ ముఖాలను పక్కకు తిప్పుకొన్న భంగిమలో కనిపిస్తారు.
కొద్ది దూరంలో ఉన్న చిన్న కొండ మీద జటాయువు ఆలయం కలదు.
పక్షిరాజు జటాయువు ప్రభుసేవలో ప్రాణం విడిచిన ప్రదేశం కనుక "తిరుపహిషి "(శ్రీ పక్షి ) అన్న పేరుతో పిలవసాగారు.
💠" పుల్ " అనగా గరుడజాతి పక్షి , " కుళి " అనగా గోయి .
జటాయువును గోయిలో పూడ్చి పెట్టిన స్థలము కావున " తిరుపుల్ కుళి ” అని పేరు పొందినది.
💠 శ్రీరాముడు జీవులనందరను ఎట్టి తారతమ్యము లేని విధముగా చూచుకొను పరమాత్మావతారము .
శబరి , అహల్యలకు తన మాతృ స్థానమునిచ్చి గౌరవించి ఉద్ధరించెను . సుగ్రీవుడు , గుహుడు మరియు విభీషణులను తన సోదర స్థానమున ఉంచుకొని ప్రత్యేక గౌరవముతో చూచుకొనెను .
భక్తికి , శరణాగతికి , ప్రేమకు బద్ధుడై పరమాత్ముడు సర్వజనులను అనుగ్రహించును అని బోధించు అవతారము శ్రీరాముడు , సచ్ఛీలత , కర్తవ్యపాలనము , నిస్వార్థపరత్వము భూతదయ మొదలగు సర్వ సద్గుణ రాశి శ్రీరాముడు .
💠ఈ క్షేత్రంలో గల ఈ దేవాలయంలో, పిల్లలు లేని స్త్రీలు, పప్పును (పరుప్పు) మాడపల్లికి (భగవంతుని భోజనం తయారు చేసిన ప్రదేశం) ఇస్తారు. అది ఇచ్చిన తర్వాత, పప్పును నీటిలో నానబెట్టి, వారి కడుపు చుట్టూ కట్టి, నిద్రపోమని చెప్తారు. వారి నిద్ర నుండి మేల్కొన్న తర్వాత, విత్తన మొగ్గలు ఏర్పడితే, వారు ఒక బిడ్డకు జన్మనిస్తారని నిర్ధారించబడింది.
ప్రతి అమావాస్య నాడు ప్రత్యేక పూజలు జరుగుతాయి.
🙏 జై శ్రీమన్నారాయణ 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి