*తిరుమల సర్వస్వం -210*
*మాధవుడు చేసే మానవ సేవ – 7*
*గోసేవ*
వైకుంఠాన్ని విడిచివెళ్లిన శ్రీమహాలక్ష్మిని అన్వేషిస్తూ భూలోకంలోని వేంకటాచల పర్వతానికి విచ్చేసిన శ్రీమహావిష్ణువు అలసి సొలసి ఆకలిదప్పులతో అలమటిస్తున్నప్పుడు వారిని ఒక గోమాత తన క్షీరంతో ఆదుకుంది. ఆ విధంగా శ్రీవేంకటేశ్వరునికి, గోవులకు విడదీయరాని బంధం ఏర్పడింది. అంతే కాకుండా, హైందవసంస్కృతిలో గోమాతకు విశిష్ఠమైన స్థానం ఉంది. గోమాత తనువులో ముక్కోటి దేవతలు కొలువై ఉన్నట్లుగా చెబుతారు.
అలా గోవుకు ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని, గోసంరక్షణకై తి.తి.దే. అనేక చర్యలను చేపట్టింది. అందులో భాగంగానే తిరుమల, తిరుపతి పట్టణాలలో వందలాది ఎకరాలలో విశాలమైన గోశాలలు ఏర్పాటు చేసి, అందులో వేలాది గోవులను సంరక్షిస్తున్నారు. వీటిలో పాలిచ్చే ఆవులతో పాటుగా ఒట్టిపోయిన ఆవులు, లేగదూడలు కూడా ఉన్నాయి. వయసుడిగిన ఆవులను కసాయిశాలలకు తరలిస్తుంటే గోరక్షాసమితి కార్యకర్తలు వాటిని రక్షించి, తి.తి.దే. గోశాలలకు తరలిస్తారు.
ఆలయంలో ప్రసాదాల తయారీ కోసం, నేతిదీపాలు వెలిగించడం కోసం, అర్చకుల భుక్తి కోసం ఆలయానికి గోవులను దానం చేసే సాంప్రదాయం అనాదిగా వస్తోంది.
చరిత్రపుటల్లోకి వెళితే, లభించిన శాసనాలను బట్టి, మొట్టమొదటగా కుళోత్తుంగచోళుడనే చోళరాజు ప్రప్రథమంగా ఆలయానికి గోవులను దానం చేశాడు. తరువాత, 13వ శతాబ్దానికి చెందిన విజయగండ గోపాలుడు 33 గోవులను; యాదవరాజు వీరనరసింగ దేవరాయల వారి దేవేరి 64 ఆవులు, 2 ఆంబోతులను సమర్పించారు. ఇంకా పెరియతెమ్మ నాయకన్, వీరకుమార కంపన, చంద్రగిరికి చెందిన మాధవదాసన్, మహాకుండలేశ్వరుడు, సాళువ మహదేవమహారాజు, కందాడై రామానుజ అయ్యంగార్ వంటి ఎందరో మహారాజులు, వారి దేవేరులు, ఆచార్యపురుషులు, పీఠాధిపతులు, జమీందార్లు, వర్తకశ్రేష్ఠులు - ఇలా ఎందరెందరో శ్రీనివాసునికి గోవులనర్పించి తరించారు.
మొట్టమొదట *'గోశాల'* గా వ్యవహరించబడే ఈ గోసంరక్షణశాల తరువాత *'శ్రీవేంకటేశ్వర డైరీ ఫామ్'* గానూ, తరువాతి కాలంలో *'శ్రీవేంకటేశ్వర గోసంరక్షణ కేంద్రం'* గానూ రూపాంతరం చెందింది.
మహంతుల కాలంలో గోవిందరాజస్వామి ఆలయ పరిసరాలో ఉన్న ఈ గోశాల, పెరుగుతున్న గోవుల సంఖ్యకు అనుగుణంగా తరువాతి కాలంలో కపిలతీర్థం మార్గంలో గల శ్రీవేంకటేశ్వర ఓరియంటల్ కళాశాల ప్రాంగణానికి, తదనంతరం ఇప్పుడు మహతీ ఆడిటోరియం ఉన్న ప్రదేశానికి, చివరగా తిరుపతి పట్టణ శివారులో ఇప్పుడున్న సువిశాల ప్రాంగణానికి మార్చబడింది. ప్రస్తుతం ఇందులో గోవులే కాకుండా రేవతి, పద్మ, లక్ష్మీ, మహాలక్ష్మి, వైష్ణవి అనే ఏనుగులు; గుర్రాలు, ఆంబోతులు, ఒంటెలు, జింకలు, పొట్టేళ్ళు, నెమళ్ళు, బాతులు; అనేక పక్షిజాతులు కూడా పెంచబడుతున్నాయి.
దేశం మొత్తం మీద 33 జాతుల ఆవులుంటే, వాటిలో 13 జాతుల ఆవులు తిరుపతి లోని శ్రీవేంకటేశ్వర గోసంరక్షణ శాలలోనే ఉండడం విశేషం. ఇందులో సంరక్షించ బడుతున్న ఆవులలో చాలా వరకు భక్తులు సమర్పించుకున్నవే! దేశవాళీ ఆవుల సంతతిని వృద్ధి చేయాలనే లక్ష్యంతో మేలుజాతి ఒంగోలు వృషభాలు కూడా గోశాలలలో పెంచబడుతున్నాయి. దేశవాళీ ఆవుల యొక్క పాలు, గోమయం మరియు గోపంచకాలలో ఉన్న ఔషధ విలువలను గుర్తించి, వాటి వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు.
గోశాలలలో ఆవుల ఆరోగ్యానికి, పరిశుభ్రతకు పెద్దపీట వేస్తారు. ప్రతిరోజు నాలుగు సార్లు నిర్ణీతసమయాలలో పౌష్ఠికాహారాన్ని అందిస్తారు. క్రమం తప్పకుండా నిపుణులైన పశువైద్యులు వైద్యపరీక్షలు నిర్వహిస్తారు.
పాల దిగుబడి పెంచడం కోసం గోమాతలకు సంగీతం వినిపించడం ఈ గోశాల ప్రత్యేకత. అన్నమయ్య సంకీర్తనలు, శాస్త్రీయసంగీతం నిరంతరంగా వినిపిస్తున్నందు వల్ల పాలదిగుబడి వృద్ధి చెందినట్లు శాస్త్రోక్తంగా వెల్లడైంది.
రోజూ కొన్ని వేల లీటర్ల పాలు ఉత్పత్తి అయినప్పటికీ, పాలను విక్రయించే సాంప్రదాయం లేదు. ఉదయం, సాయంత్రం సేకరించిన స్వచ్ఛమైన పాలు, పెరుగు, వెన్న స్వామివారి సేవకు మరియు దేవాలయ అవసరాలకు వినియోగిస్తారు. మిగిలిన వాటిని వివిధ దేవస్థానాలకు, ఫలహారశాలలకు, అతిథిగృహాలకు, మూగ-బధిర పాఠశాలకు, హాస్టళ్ళకు, వైకుంఠం క్యూ సముదాయంలో వేచి ఉండే భక్తులకు సరఫరా చేస్తారు.
2002వ సంవత్సరంలో ప్రారంభించబడ్డ గోసంరక్షణ ట్రస్టు ఆధ్వర్యంలో అనాథలుగా ఉన్న గోవుల ఆలనా-పాలనా, ఉచిత పశువైద్యశాలల నిర్వహణ, గోవుత్పత్తులు మరియు పశుసంరక్షణా పద్ధతులపై శాస్త్రీయపరిశోధన మున్నగునవి నిర్వహిస్తారు. గోమాత వైశిష్ట్యాన్ని చాటి చెప్పేందుకు గానూ తి.తి.దే. ఆధ్వర్యంలో ఒక జాతీయసదస్సు నిర్వహించబడింది.
గోవుల పట్ల ప్రజలలో శ్రద్ధాభక్తులు పెంపొందించడం కోసం ప్రతిరోజూ గోపూజ నిర్వహిస్తూ, ప్రజలు కూడా పూజలో పాల్గొనే అవకాశం కలిగిస్తున్నారు. అలాగే, కృష్ణాష్టమి నాడు ఘనంగా ఉత్సవాలు నిర్వహించి, వేలాది మంది భక్తులు, పురప్రముఖుల సమక్షంలో గోమాతలకు విశేషపూజలు నిర్వహిస్తారు.
రేపటి భాగంలో ... *కళ్యాణ కట్ట* గురించి తెలుసుకుందాం
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి