19, ఏప్రిల్ 2025, శనివారం

శ్రీ భోజేశ్వర దేవాలయం

 🕉 మన గుడి : నెం 1082


⚜ మధ్యప్రదేశ్ : భోజ్‌పూర్


⚜ శ్రీ భోజేశ్వర దేవాలయం



💠 మానవులు ఎల్లప్పుడూ రహస్యాలు తెలుసు కోవటానికి ఆసక్తి కలిగి ఉంటారు, ఏదైనా అసంపూర్తిగా ఉన్న కథను లేదా అసంపూర్ణ నిర్మాణాన్ని చూడాలని ఆతృతగా ఉంటారు,అది చాలా సార్లు ఆకర్షణగా మారుతుంది. 


💠 అటువంటి మర్మమైన మరియు అద్భుతమైన నిర్మాణం మధ్యప్రదేశ్ రాజధాని #భోపాల్ నుండి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న భోజ్పూర్ (రైసన్ జిల్లా) లో ఉంది.


💠 భోజ్‌పూర్ కొండపై అద్భుతమైన భారీ, కానీ అసంపూర్ణమైన శివాలయం ఉంది.  

దీనిని భోజ్‌పూర్ శివాలయం లేదా భోజేశ్వర్ ఆలయం అని పిలుస్తారు. 


💠 ఇక్కడివారి నమ్మకం ప్రకారం ఈ ఆలయాన్ని పాండవులు తమ తల్లి కుంతీదేవి పూజ చేసుకోవటంకోసం నిర్మించారంటారు.  

అక్కడివారి కధనం ప్రకారం కుంతీదేవి శివ భక్తురాలు.  

నిత్యం శివాభిషేకాలు, పూజలు చేస్తూ వుండేది.  

అప్పట్లో మనుషులు చాలా ఎత్తుగా వుండేవారుట.  

కుంతీ దేవి ఎత్తు 25 అడుగులని కూడా చెప్తారు.  

ఆవిడ గర్భగుడిలో నేలమీద నుంచుని ఆ విగ్రహానికి అభిషేకం చేసేదిట.  

ఇంత భారీలింగానికి భీముడు  మోకాళ్లపై కూర్చొని పుష్పాలు సమర్పించేవాడంట!!!

నమ్మేవాళ్ళు నమ్మవచ్చు.



💠 1000లో ఈ ప్రాంతాన్ని పాలించిన పరమార వంశీయుడైన భోజ రాజు పేరు మీద ఈ ఊరుకి భోజపూర్ అని పేరొచ్చింది. 


💠 ఈ ఆలయం ప్రఖ్యాతి చెందటానికి కారణం ఇందులో భారత దేశంలో అతి పెద్ద లింగం వున్నది.  

18 అడుగుల ఎత్తు, 7.5 అడుగుల చుట్టుకొలత వున్న ఈ లింగం ఒకే రాతిలో చెక్కబడింది.  

ఈ నిర్మాణం ఆర్కియాలాజికల్ సర్వే అఫ్ ఇండియా సంరక్షణలో వున్నది.  


💠 ఎత్తయిన పీఠం మీద, ఇంకా ఎత్తయిన ఆలయం దూరంనుంచే కనిపిస్తుంది. అయితే అప్పటికీ, ఇప్పటికీ ఈ ఆలయ నిర్మాణం మాత్రం పూర్తికాలేదు. అయివుంటే తప్పకుండా ఇది ఒక అద్భుత ఆలయంగా పేరు పొందేది.


 💠 పూర్తికాని దేవాలయమే ఇంత అద్భుతంగా, ఇన్ని వందల ఏళ్ళ తర్వాత కూడా ఇంతమంది సందర్శకులను ఆకర్షిస్తున్నదంటే ఆ ఆలయ నిర్మాణం పూర్తయితే ఎలా వుండేదో!! కానీ దురదృష్టం.  


💠 కళ్యాణి, గుజరాత్ చాళుక్యులు, కాలాచూరి వంశస్ధులైన లక్ష్మి-కర్ణలతో కలిసి భోజరాజు రాజ్యంపై దండెత్తారు. తన రాజ్యాన్ని రక్షించుకోవటానికి చేసిన ఆ భీకర పోరులో భోజరాజు చనిపోయాడు.


💠 గుట్ట మీద పునాది వేసి నిర్మించటం కాక దానిమీద మరొక ఐదు మీటర్ల ఎత్తు వేదిక నిర్మించి దాని పైన గుడి నిర్మించటం ఎంతో విశేషంగా కనపడుతుంది. 

దాదాపు 35 × 25 మీటర్ల పొడవూ, వెడల్పూ కలిగినదీ వేదిక. 


🔆 ఆలయ నిర్మాణం: 

ఈ ఆలయం 106 అడుగుల పొడుగు, 77 అడుగుల వెడల్పు, 17 అడుగుల ఎత్తు వున్న ఎత్తయిన పీఠం మీద నిర్మింపబడటంతో దూరంనుంచే సందర్శకులను ఆకర్షిస్తుంది.  


💠 ఆలయం చేరుకోవాలంటే ఈ ప్లాట్ ఫాం కి వున్న 16 మెట్లు ఎక్కాలి. గర్భగుడి దగ్గర కూడా కొన్ని మెట్లు ఎక్కాలి. గర్భ గుడి గుంటలో వున్నట్లు వుంటుంది. అక్కడ దిగే మెట్లూ ఎత్తుగానే వుంటాయి.  

దిగలేనివాళ్ళు ఆ మెట్లమీదనుంచే శివ దర్శనం చేసుకోవచ్చు.


 💠 ఆలయం ముఖద్వారానికి ఇరు పక్కల గంగ, యమునల విగ్రహాలున్నాయి.  

లోపల స్ధంబాల మీద ఉమా మహేశ్వరులు, లక్ష్మీ నారాయణులు, బ్రహ్మ సావిత్రిలు (సరస్వతి), సీతారాముల విగ్రహాలు అందంగా మలచబడ్డాయి. 


💠 ఈ ఆలయం యొక్క అతి పెద్ద లక్షణం ఇక్కడ భారీ శివలింగమే, ఈ శివలింగం యొక్క ప్రత్యేకమైన భారీ పరిమాణం కారణంగా, భోజేశ్వర్ ఆలయాన్ని ఉత్తర భారతదేశంలోని సోమనాథ్ అని కూడా పిలుస్తారు.


💠 మృదువైన ఎర్ర ఇసుకరాయితో తయారు చేయబడిన ఈ శివలింగం ఒకే రాయి నుండి తయారైంది మరియు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పురాతన శివలింగంగా పరిగణించబడుతుంది.


💠 పాలరాతితో చేసిన ఈ లింగం 20 పొడవూ, 18 చుట్టుకొలతతో భారీగా ఉంటుంది. 

ఇక్కడ నిత్యపూజా పునస్కారాలు కొంచెం తక్కువే.

యాత్రీకులు ఆలయం బయట ఉన్న శివపంచాయతనానికి పూజలు చేసుకుని మరలిపోతుంటారు.


💠 పై నుంచి అభిషేకం చేయటానికి ఉపయోగించే వారేమో, దాదాపు 2006 వ సంవత్సరం, దాకా ఇది ఇలాగే, శివుడు అనాచ్చాదితంగానే ఉండేది. అయితే ఈ మధ్యనే ఇది కప్పువేయబడిందని తెలిసింది. 

ఇన్ని కలిగి ఉన్న ఈ ఆలయం అసంపూర్తిగానే మిగిలిపోయినట్లు గోచరిస్తుంది. 

దగ్గరలో ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంది బెత్వానది, ప్రస్తుత ప్రభుత్వం శ్రద్ధతో దీన్ని అభివృద్ధి చేస్తోంది. 

అయితే ఇక్కడ ఇతర సౌకర్యాలు కల్పిస్తే తప్ప భక్తులు వెళ్లిరాలేరు.


💠 అసంపూర్తిగా ఉన్న ఈ దేవాలయం పూర్తయితే శివుని అతిపెద్ద దేవాలయాలలో ఒకటిగా ఉండేది.


🔆 ఉత్సవాలు:


💠 శివరాత్రికి ఇక్కడ పెద్ద తిరుణాల జరుగుతుంది.

భోజన సదుపాయం, వసతి సదుపాయం లేదు. భోపాల్ దగ్గరే. అక్కడ అన్ని సదుపాయాలూ వుంటాయి.


💠 దర్శన సమయాలు

ఉదయం నుంచి సాయంకాలందాకా.

ప్రవేశ రుసుము ఒక్కొక్కరికి 10 రూ.



💠 మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ నగరానికి 28 కి.మీ. దూరం

 

Rachana

©️ Santosh Kumar

కామెంట్‌లు లేవు: