*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*ద్రోణ పర్వము పంచమాశ్వాసము*
*348 వ రోజు*
*కర్ణుని విజృంభణ*
కర్ణుడు పాడవుల విజయోత్సాహానికి క్రుద్ధుడై విజృంభించి పాండవసేనలను తరుముతూ దొరికిన వారిని దొరికినట్లు చంపసాగాడు. అది చూసిన ధర్మరాజు అర్జునుడితో " అర్జునా ! చూసావా మధ్యందిన మార్తాండునిలా ఉన్న కర్ణుని విజృంభణ చూస్తే మనం ఊరకున్న ఈ రోజే పాండవ సేనను నాశనం చేసేలా ఉన్నాడు. నీవు అతడిని ఆపే మార్గం ఆలోచించు " అన్నాడు. అర్జునుడు శ్రీకృష్ణుని చూసి " కృష్ణా ! అన్నయ్య ధర్మజుడు మన సేనలు పారి పోవడం చూసి భయపడుతున్నాడు. ఒక వైపు కర్ణుడు, మరొక వైపు ద్రోణుడు మన సైన్యాలను తరుముతున్నారు. ద్రోణుడిని తరువాత చూడవచ్చు ముందు కర్ణుని ఆపాలి మన రథం కర్ణుని ముందు నిలుపు " అన్నాడు. కృష్ణుడు " అర్జునా ! రాత్రులందు రాక్షసులకు బలం ఎక్కువ కనుక నీవు ఇప్పుడు ఘటోత్కచుడిని పంపి కర్ణుడిని నిలువరించుట ఉత్తమం. మాయా విద్యా ప్రవీణ్యుడు దివ్యాస్త్ర సంపన్నుడైన ఘటోత్కచుడు కర్ణుడిని నిలువరించగల సమర్ధుడు. మనం ద్రోణుని ఎదుర్కొంటాము " అన్నాడు. కృష్ణుని మాట విన్న అర్జునుడు ఘటోత్కచుడిని పిలిచి " కుమారా ఘటోత్కచా ! కర్ణుడి పరాక్రమానికి పాండవ సేన చెదిరి పోతుంది. నీవు నీ పరాక్రమాన్ని చూపి అతడిని నిలువరింపుము. రాత్రి సమయంలో కర్ణుడు నీ అంత సమర్ధవంతంగా యుద్ధం చేయలేడు కనుక నీవు అతడిని కట్టడి చేయగలవు కనుక కర్ణుడిని ఎదుర్కొని నీ తండ్రుల పేరు నిలుపు " అన్నాడు. ఘటోత్కచుడు అర్జునుడికి నమస్కరించి కర్ణుడిని ఎదుర్కొనుటకు వెళ్ళాడు.
*ఘతోత్కచాలంబసుల యుద్ధం*
ఆసమయంలో జటాసురుడి కుమారుడైన అలంబసుడు సుయోధనుడి వద్దకు వచ్చి " రారాజా ! నాకు ఎప్పటి నుండో పాండవుల మీద పగ ఉన్నది. మీరు అనుజ్ఞ ఇస్తే పాండవులను సంహరించగలను " అన్నాడు. సుయోధనుడు ఆనందపరవశుడై అందుకు అంగీకరించాడు. అలంబసుడు కర్ణుడిని దాటి ఘటోత్కచుడిని ఎదుర్కొన్నాడు. ఇరువురు మొదట విల్లంబులతో యుద్ధం మొదలు పెట్టారు. ఆ తరువాత రాక్షస మాయలు ప్రయోగించి యుద్ధం చేయసాగారు. ఒకరు సర్పంగా మారితే ఒకరు గరుడునిగా మారారు. ఒకడు ఏనుగుగా మారిన వేరొకరు సింహంగా మారారు. ఒకరికి ఒకరు తీసి పోకుండా యుద్ధం చేయసాగారు. చివరికి ముష్టి యుద్ధానికి దిగారు. చివరకు ఘటోత్కచుడు అలంబసుడిని కిందకు తోసి గొండెల మీద కాలు పెట్టి అలంబసుడి తల గుండ్రంగా తిప్పి అతడి తల తెంచాడు. ఆ తలను తీసి సుయోధనుడి రథము మీద విసిరాడు. అది చూసి ఆశ్చర్య పోతున్న సుయోధనుడితో " ఓ సుయోధనా! ఇది నీ స్నేహితుడి అలంబసుడి తల ఇంకొంచెం సేపటికి కర్ణుడి తల నీ రథం మీదకు వేస్తాను నీ వంతు వచ్చినప్పుడు నీ తల విసరగలను. నేను భీమసేనుడి కుమారుడినని తెలుసు కదా ! జాగర్త " అని గర్జించాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి