11, ఏప్రిల్ 2025, శుక్రవారం

మనసుకు దూరంగా!

 శీర్షిక..మనసుకు దూరంగా!


ఏమై పోతున్నాడు మనిషి? 

ఎటు పోతున్నాడు? మతి గతి తప్పుతూ

స్వార్ధం నిండిన రొచ్చులో కూరుకుపోతూ 

అత్యాశల కోర్కెలతో కష్టాల పాలవుతూ 

నీకు నీవె మంటల్లో చితి పేర్చుకుంటున్నావ్..


ఓ మనిషీ!

నవ యుగానికి నాందిగా నిలిచావు 

వైజ్ఞానిక యుగమంటూ

మేథా శోధనకు పదును పెట్టావు 

మనిషి సాధించలేనిదంటూ ఏమీ లేదని 

పంచభూతాలూ నా వశమంటూ 

ఆకాశం హద్దుగా పైపైకి ఎగిరావు 

నిన్ను నీవే మరమనిషిగా మార్చేసుకున్నావు..


అణువణువునీ శోధించావు 

అణుబాంబులను సృష్టించావు 

రాముని క్షేత్రాన్ని రణక్షేత్రంగా మార్చేసావు 

రక్తపు ధారలను ప్రవహింపజేస్తున్నావు 

విరుద్ధ వైషమ్య భావాలతో నిన్ను నీవే చంపేసుకుంటున్నావ్..


నింగికి నేలకు వంతెన లేసి 

లోకాన్ని జయించానని అనుకుంటున్నావు

భూగోళాన్ని చుట్టేస్తున్నావు 

ఆగని పయనం, ప్రగతికి దారులు వేస్తున్నా 

ఈర్ష్యా ద్వేషాలతో మనస్సులను చంపేస్తూ

యంత్రాల పనిముట్టులా మారిపోతున్నావు 

*ఆలోచించు! పయనం ప్రపంచమంతా*

*హృదయం మాత్రం అతి కాలుష్యంతో*


మరిచి పోతున్నావు..శాంతీ సౌహార్ద్రభావాలను

నీతీ-రీతి..నిజాయితీని నవ్వుల పాల్జేస్తూ

అగాథంలో పడి నీ ఉనికిని కోల్పోతున్నావు..


ఇకనైనా గుర్తించు, బేధాలెంచని సహకారమె

నీ సొత్తని..కలిసుంటే నే కలదు సుఖమని 

సమతా మమతా నిండినళ మానవతా తత్వమె

నీ మనుగడకు సిద్ధాంతమని..

.......................................................

ఇది నా స్వీయ కవిత

కామెంట్‌లు లేవు: