11, ఏప్రిల్ 2025, శుక్రవారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము పంచమాశ్వాసము*


*344 వ రోజు*


*అశ్వత్థామ ధృష్టద్యుమ్నుని ఎదుర్కొనుట*


అది గమనించిన కేకయ, పాంచాల సేనలు అశ్వత్థామను చుట్టుముట్టాయి. అశ్వత్థామ వారి మీద శరవర్షం కురిపించి వారిని పారతోలాడు. అది చూసి ధృష్టద్యుమ్నుడు అశ్వత్థామను ఎదుర్కొని " అశ్వత్థామా! నేను నీ తండ్రి ద్రోణుని చంపడానికి పుట్టిన వరప్రసాదిని. నీ తండ్రినే కాదు నిన్ను కూడా వధిస్తాను రా! " అన్నాడు. అశ్వత్థామ " ధృష్టద్యుమ్నా! నీ కోసమే ఎదురుచూస్తున్నాను రా! నా బాణములకు నిన్ను బలిచేస్తాను రా! " అంటూ ధృష్టద్యునుని ఎదుర్కొన్నాడు. ధృష్టద్యుమ్నుడు " నీ తండ్రి పని తరువాత చూడవచ్చు ముందు నీ పని పడతాను " అంటూ అశ్వత్థామ మీద శరములు గుప్పించాడు. అశ్వత్థామ కోపించి ధృష్టద్యుమ్నుని కేతనము ఖండించి, సారథిని, హయములను చంపి అతడి చక్రరక్షకులను నూరు మందిని చంపి సింహనాదం చేసాడు. పాంచాల సేనలు అశ్వత్థామ ధాటికి నిలువ లేక చెరిరి పోయాయు. అది చూసి ధర్మరాజు, భీముడు తమ సైన్యాలతో ధృష్టద్యుమ్నునికి సాయం వచ్చారు. సుయోధనుడు ద్రోణుని తీసుకుని అశ్వత్థామకు సాయం వచ్చాడు. అది చూసిన అర్జునుడు ధృష్టద్యుమ్నునికి సాయం వచ్చాడు. ఇరు పక్షాల నడుమ పోరు ఘోరమైంది. అర్జునుడు తన వాడి అయిన బాణములతో మగధ, మద్ర, వంగదేశముల నాశనం చేస్తున్నాడు. భీముడు అంబష్ట, శిబి, వంగదేశ సైన్యములను తుద ముట్టించాడు. అది చూసి ఆగ్రహించిన ద్రోణుడు వాయవ్యాస్త్రమును ప్రయోగించి పాండవసేనలను చెల్లాచెదురు చేసాడు. అర్జునుడు, భీముడు ద్రోణునికి రెండు వైపుల నిలిచి శరములు గుప్పించాడు. ద్రోణుడు బెదరక పాండవ సేనలను తనుమాడుతున్నాడు. సుయోధనుడు పాండవ సేనలను చెల్లాచెదురు చేస్తున్నాడు. అప్పుడు సోమదత్తుడు పాండవ సేనలను ఎదుర్కొన్నాడు. సాత్యకి సోమదత్తుడిని ఎదుర్కొన్నాడు. సోమదత్తుడు ఒకే బాణంతో సాత్యకి విల్లు విరిచి సాత్యకిని ముప్పై అయిదు బాణాలతో కొట్టాడు. సాత్యకి మరొక విల్లందుకుని సోమదత్తుని విల్లు విరిచాడు . సోమదత్తుడు మరొక విల్లు తీసుకున్నాడు. అది చూసి భీముడు సోమదత్తుడిని ఎదుర్కొన్నాడు. ఘటోత్కచుడు సోమదత్తుడి మీద పరిఘను విసిరాడు. సోమదత్తుడు దానిని రెండు ముక్కలు చేసాడు. సాత్యకి ఒక వాడి అయిన బాణములతో సోమదత్తుడి సారథిని, హయములను చంపి మరొక నారసముతో సోమదత్తుడి తల నరికాడు. సోమదత్తుడి మరణం చూసి కౌరవ సేనలు సాత్యకిని ఒక్కుమ్మడిగా ఎదుర్కొన్నాయి. అది చూసిన ధర్మరాజు సాత్యకిని అక్కడి నుండి తప్పించి తాను ద్రోణుని ఎదుర్కొన్నాడు. ద్రోణుడు ధర్మరాజు విల్లు విరిచి, కేతనము పడగొట్టి ధర్మజుని శరీరం తూట్లు పడేలా కొట్టాడు. ధర్మరాజు ఉగ్రరూపందాల్చి మరొక విల్లందుకుని ద్రోణుని శరీరంలో గుచ్చుకునేలా బాణములు సంధించాడు. ద్రోణుడు తన రథము మీద మూర్చిల్లాడు. కొంచెం సేపటికి తేరుకున్న ద్రోణుడు తేరుకుని పాండవ సైన్యం మీద వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ధర్మరాజు కూడా వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి దానిని నిర్వీర్యం చేసి ద్రోణుని మీద శరములు గుప్పించాడు. అది చూసిన శ్రీకృష్ణుడు ధర్మజుని వద్దకు వెళ్ళి " ధర్మజా ! నిన్ను పట్టుకుని సుయోధనుడికి అప్పగిస్తానన్న ద్రోణుని ప్రతిజ్ఞ మరిచావా ! ద్రోణునితో యుద్ధము మంచిది కాదు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళి భీముడికి సాయపడు " అన్నాడు. కృష్ణుడి మాట మన్నించి ధర్మజుడు భీముని వద్దకు వెళ్ళాడు. ద్రోణుడు ధర్మజుడిని వదిలి పాంచాల సేనలను ఎదుర్కొన్నాడు. ధర్మరాజు, భీముడు, ధృష్టద్యుమ్నుడు, సాత్యకి కౌరవ సేనలను తనుమాడుతున్నారు. కృపాచార్యుడు, కర్ణుడు, ద్రోణుడు వారిని ఎదుర్కొన్నారు. యుద్ధం ఘోరరూపందాల్చింది. సేనల పదఘట్టనలకు రేగిన ధూళి ఆకాశాన్ని తాకి సూర్యుడిని మరుగున పరిచి చీకట్లు కమ్ముకున్నాయి. సైనికులకు కళ్ళు కనిపించడం కష్టమైంది. ద్రోణాచార్యుడు ఒక వైపు సుయోధనుడిని ఒక వైపు కురు సేనలను ప్రోత్సహిస్తూ యుద్ధోన్ముఖులను చేసి అప్పటికప్పుడు ఒక వ్యూహమును ఏర్పరిచాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: