24, మే 2025, శనివారం

17-20-గీతా మకరందము

 17-20-గీతా మకరందము.

    శ్రద్ధాత్రయ విభాగయోగము

   

  -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - ఇక నిపుడు దానములను గూర్చి చెప్పదలంచి మొట్టమొదట సాత్త్వికదానమెట్టిదో తెలుపుచున్నారు–


దాతవ్యమితి యద్దానం దీయతే౽నుపకారిణే | 

దేశే కాలే చ పాత్రే చ 

తద్దానం సాత్త్వికం స్మృతమ్ || 


తాత్పర్యము:- ఇవ్వవలసినదే యను నిశ్చయముతో ఏ దానము పుణ్యప్రదేశమందును, పుణ్యకాలమందును, యోగ్యుడగువానికి మఱియు ప్రత్యుపకారముచేయు శక్తిలేనివానికొఱకు ఇవ్వబడుచున్నదో అది సాత్త్వికదానమని చెప్పబడుచున్నది.


వ్యాఖ్య:- “దాతవ్యమితి” - ప్రతివాడును దానముచేయుట తన ధర్మమని తలంచి దానము చేయవలెను. అంతియేకాని ఒకరిమెప్పుకొఱకుగాని, ప్రతిఫలాపేక్షచేగాని చేయరాదు. "నీవేల దానము చేయుచున్నా”వని యెవరైన దాత నడిగినచో “ఇది నా ధర్మము. నేను దానము చేయవలసినదే (దాతవ్యమ్) కాబట్టి చేయుచున్నాను" అనియే సమాధానము చెప్పవలయును. వాస్తవముగ త్యాగముచేయుట, దానముచేయుట తనమేలు కొఱకే యగును. ఒకరికి ఉపకారము చేసినను అదియు (పుణ్యప్రాప్తివలన) తనకు తానుచేసికొను ఉపకారమే యగును. కావున దానముచేయువారు తామేదో ఒకరి నుద్ధరించితిమని తలంచుటకంటె ౼ ఆ దానక్రియచే తమ్ముతాము యుద్ధరించుకొనినవారైరని భావించుట యుత్తమము.


"అనుపకారిణే” - అని చెప్పినందువలన, ప్రత్యుపకారము చేయలేనివారికి, బీదవారికి, అశక్తులకు, వికలాంగులకు, దరిద్రనారాయణులకు చేయు దానము ఉత్కృష్టమని తేలుచున్నది. మఱియు శక్తిగలవారికి, ప్రత్యుపకారము చేయగల సమర్థతగలవారికి దానముచేయుట అంత ఉత్తమమైనదిగాదనియు ఈ పదముద్వారా సూచితమగుచున్నది.


“దేశే” - అనగా పుణ్యక్షేత్రమందు, తీర్థాదులందు, పవిత్ర ఆశ్రమాదులందు లేక పవిత్రమైనట్టి, దైవగంధయుతమైనట్టి ఏ ప్రదేశమందైనను అని యర్థము.


"కాలే” యనగా గ్రహణము, సంక్రాంతి, లేక ఏదైన పుణ్యకార్యసందర్భము - ఇత్యాదిరూపమగు పవిత్రకాలమునందు అని యర్థము.


 ‘పాత్రే' యనగా యోగ్యతగలవానికి, తగినవానికి అని యర్థము. పాత్రతనెఱింగి దానముచేయుడని పెద్దలు చెప్పుదురు. అపాత్రునకు దానముచేసినచో దాతకు ఉత్తమఫలము చేకూరదని భావము.


ప్రశ్న: - సాత్త్వికదానమనగా నెట్టిది?

ఉత్తరము:- "దానముచేయవలసినదే" అని నిశ్చయించుకొని (1) ప్రత్యుపకారము చేయలేనివారికి, దీనులకు, అసహాయులకు (2) దేశ, కాల. పాత్రతలను జూచి చేయబడు దానము సాత్త్వికమని చెప్పబడును.

కామెంట్‌లు లేవు: