24, మే 2025, శనివారం

జీవికా పరీక్ష*

 *జీవికా పరీక్ష*


ఇదేదో వ్రాత పరీక్ష కాదు, ఈ పరీక్షలో ఉత్తీర్ణులైతే గాని తదుపరి విద్యలను అభ్యసించడానికి అర్హత పొందగలమని కాదు. లేదా మనం చేపట్టు ఉద్యోగానికి తొలిమెట్టు అని అంతకన్నా కాదు. 


నూతన దంపతులకు కలుగు సంతానం భవిష్యత్తులో ఎటువంటి వృత్తిని చేపట్టగలదని అన్నప్రాసన సమయాన్నే నిర్ధారించు ఓ ప్రక్రియ మాత్రమే. శాస్త్రాలే ఈ పరీక్షను సూచించాయి. ఈ పరీక్ష జరపడానికి ఒకే నియమం ఏంటంటే ఆ సంతానం - బాబు కావొచ్చు, పాప కావొచ్చు - దోగాడుతూ ఉండాలి. అంటే బిడ్డ నేలపై జేతులాని మోకాళ్లతో అటూఇటూ ప్రాకుతూ ఉండాలన్నమాట. అంటే బిడ్డకు అన్నప్రాశన సమయంలో గాని ఆ తర్వాత గాని ఎప్పుడైనా చేయగలం. దీనినే జీవికా పరీక్ష అని అంటారు. 


పూర్వకాలంలో పిల్లల భవిష్యత్తు ఏవృత్తిలో నైపుణ్యం ద్వారా అభివృద్ధి చెందుతుంది అనే విషయాన్ని ఈ పరీక్ష ద్వారానే నిర్ధారించేవారు. అంటే తన భవిష్యత్తు ఎలా ఉంటుందనడానికి ఓ చిన్ని సంకేతమే అన్నట్టు. 


ఈ పరీక్షను ఎలా పాటించాలంటే వారి వారి కులదైవాన్ని పూజా గృహంలో నుండు ఇతర దేవతలను ప్రార్థించుకొని ఓ శుభ ముహూర్తాన ఈ పరీక్షను నిర్వహించాలి. 


వివిధ వృత్తులకు సంభందించిన ఆటవస్తువులు అంటే, వైద్య వృత్తిని, శాస్త్రవేత్త వృత్తిని, సాఫ్ట్వేర్ రంగాన్ని, పైలట్ లేదా వ్యోమగామిలను సూచించే బొమ్మలను గాని విద్యా రంగం లేదా ఇంజనీరింగు అని, ఇలా వివిధ రంగాలకు, అవి ఏవైనా కావొచ్చు, అనుగుణంగా చిన్ని చిన్ని వస్తువులను సేకరించి ఓ గదిలో నేలపై అక్కడక్కడా పరచాలి. ముందు ఈ వస్తువులన్నటిని నేలపై పరిచిన తర్వాత ఆ చిన్ని బాబును గాని పాపను గాని ఆ గదిలో ప్రవేశపెట్టాలి. 


వారికి అప్పటికే మనుష్యులను ఆట వస్తువులను శబ్దాలను గుర్తించే వయస్సు. ఈ వస్తువులన్నింటినీ వాళ్ళు చూడగానే నవ్వుతూ ఎంతో ఉత్సాహంగా ఆ వస్తువులను చేపట్టడానికి దోగాడుతూ వెళ్తారు కదా. వారు మొట్టమొదట ఏ వస్తువును మిక్కిలి మక్కువతో చేపట్టుతారో ఆ వస్తువు సూచించే వృత్తినే వారు భవిష్యత్తులో చేపట్టి నైపుణ్యం పొంది ఆరితేరినవారౌతారని ఘంటాపథంగా చెప్పగలం.


పుస్తకాన్ని గైకొన్న యెడల విద్యా రంగాన్ని, స్టెతస్కోప్పును పట్టుకొన్నచో వైద్య రంగాన్ని లేదా ఏరోప్లేన్ను చేపట్టితే పైలట్టని లేదా లాప్టాప్పును చేపట్టితే సాప్ట్వేరని ఇలా వివిధ రంగాల్లో భవిష్యత్తులో వారి జీవనశైలి కొనసాగ గలదని చెప్పడానికి ఇది శాస్త్ర ప్రామాణిత సూచికగా పరిగణించగలం. 


ఇవన్ని మనకేదో వింతగా తోచవచ్చు. ఇవన్నీ ఓ బూటకమేనని ఈ తరంవాళ్ళు కొట్టిపారేయవచ్చు. కాని ఇలాంటి పరీక్ష పురాతన కాలాల నుండే సంక్రమించింది, శాస్త్ర సమ్మతం కూడా. నమ్మడం నమ్మకపోవడం మన వంతు మరి. ఇలాంటి ఓ తంతును జరిపించి ఎక్కడైనా వ్రాసుకొన్న యెడల భవిష్యత్తులో సరిచూసుకోగలం. 


ప్రాచీన కాలానికి ఇప్పటికీ ఎన్నో వృత్తులు మారాయి. కొన్ని అడుగంటి పోయాయి, మరి కొన్ని నూతనంగా ఉద్భవించాయి కూడా. ఇవే కాకుండా కులవృత్తి అనే వైనం కూడా చాలా వరకు మారాయి. ఈ కాలంలో అందరూ అన్ని రంగాల్లో ప్రవేశించి వారి వారి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అందువల్ల ప్రస్తుత కాలప్రమాణాలకు అనుగుణంగా సూచించే వస్తువులను బొమ్మలను సేకరించి ఆ చిన్నారిని పరీక్షించాలి. వాళ్ళు ఏ వస్తువుపై ఎక్కువ మక్కువ చూపుతున్నారో మనం ఇట్టే పసిగట్టగలం. 


వారి భవిష్యత్తు అటే ఉండగలదని శాస్త్ర ఉవాచ. మీ పిల్లలతో ఇప్పుడే ప్రయత్నించండి. ఓ ఇరవై సంవత్సరాల తర్వాత మీరే సరిచూసుకోండి. నూటికి నూరు పాళ్ళు జరిగి తీరుతుంది. 


చిన్న పిల్లల మేధస్సు ఎలా పరిణమించగలదో అనడానికి ఓ చిన్ని సంకేతం మాత్రమే.

కామెంట్‌లు లేవు: