*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*కర్ణ పర్వము ద్వితీయాశ్వాసము*
*386 వ రోజు*
*ధృష్టద్యుమ్నుడు*
ధృష్టద్యుమ్నుడు కృతవర్మను వక్షస్థలానికి గురిపెట్టి తొమ్మిది బాణములతో కొట్టి కృతవర్మ సారథిని రథమును అశ్వములను ధ్వజమును తన బాణములతో కప్పాడు. కృతవర్మ రథము నుండి దిగి పోయాడు. ధృష్టద్యుమ్నుడు కృతవర్మను వెతుకుతూ అతడి సారథిని చంపాడు. కృతవర్మ నేనిక్కడ ఉన్నాను అని పెద్దగా అరిచాడు. ధృష్టద్యుమ్నుని కృతవర్మ నేల మీద నిలబడి ఒక విల్లందుకుని ఎదుర్కొన్నాడు. కౌరవ వీరుడు అక్కడకు వచ్చి కృతవర్మను రథము మీదకు లాక్కుని తీసుకు వెళ్ళాడు. చేతికి చిక్కిన్మ కృతవర్మ పోగానే ధృష్టద్యుమ్నుడు కౌరవసేనను నాశనం చేయ సాగాడు.
*అశ్వత్థామ ధర్మజుల పోరు*
అశ్వత్థామతో యుద్ధము చేస్తున్న ధర్మజునికి సాయంగా సాత్యకి వచ్చి చేరాడు. అశ్వత్థామ వారందరిని తన శరపరంపరతో ముంచెత్తాడు. ధర్మరాజు కూడా అశ్వత్థామ మీద బాణవర్షం కురిపించాడు. అశ్వథ్థామ ధర్మజుని విల్లు తుంచి అతడి మీద మూడు బాణంఅములు వేసాడు. సాత్యకి అశ్వత్థామ విల్లు తుంచాడు. అశ్వత్థామ ఒక ఈటెను విసిరి సాత్యకి సారథిని చంపి సాత్యకి మీద బాణములు గుప్పించాడు. సారథి లేని సాత్యకిని రథమును గుర్రములు ఎటో ఈడ్చుకు వెళ్ళాయి. తన మీద శరవర్షం కురిపిస్తున్న పాడవ సేన మీద ఆగ్రహించిన అశ్వత్థామ పాండవసేనను ఊచకోత కోస్తున్నాడు. ఇది విన్న సుయోధనుడు పాండవులు కూడా అశ్వత్థామ చేతిలో హతులైనారని అనుకుని ఆనందించాడు. ఇంతలో ధర్మరాజు అశ్వత్థామను తరమడం చూసి హతాశుడయ్యాడు. ధర్మరాజు అశ్వత్థామను చూసి " గురుపుత్రా అశ్వత్థామా ! నీవు అత్యంత బలశాలివి అస్త్రశస్త్ర పారంగతుడవు నీ పరాక్రమము నా మీద కాక ధృష్టద్యుమ్నుడి మీద చూపు. నీవు బ్రాహ్మణుడవు నీకు జాలి దయ కరుణ కృతజ్ఞత ఏకోశాన లేవు. నీవు బ్రాహ్మణ సహజమైన జపతపాదులను వదిలి విల్లు పట్టి ఇలా యుద్ధము చేయడం ధర్మము కాదు " అన్నాడు. అశ్వత్థామ ఆ మాటలు పట్టించుకొనక ధర్మరాజు మీద బాణములు గుప్పించాడు. అశ్వత్థామ అస్త్రధాటికి ఆగలేక ధర్మరాజు అక్కడి నుండి వెళ్ళాడు.
*కురుపాండవ యోధుల సమరం*
భీమసేనుడితో యుద్ధము చేస్తున్న కర్ణుడు కృపాచార్యుడికి సాయంగా వచ్చాడు. భీముడు కౌరవ యోధులను తనుమాడుతున్నాడు. నకులసహదేవులతో యుద్ధం చేస్తూ సుయోధనుడు సహదేవుని ధ్వజము ఖండించి వారిద్దరి ధనస్సులు విరిచాడు. వారు వేరు ధనస్సులు ధరించి సుయోధనుడి మీద శరములు గుప్పించారు. సుయోధనుడు కోపించి వారిరువురిని బాణములతో కప్పేశాడు. వారు సుయోధనుడి చేతిలో మరణిస్తారని అనుకుంటున్న తరుణంలో ధృష్టద్యుమ్నుడు వేగంగా అక్కడకు వచ్చి వారిని రక్షించాడు. సుయోధనుడు ధృష్టద్యుమ్నుడు మీద అత్యంత తీవ్రమైన బాణము ప్రయోగించి అతడి ధనస్సును ఖండించాడు. ధృష్టద్యుమ్నుడు వేరొక విల్లు తీసుకుని సుయోధనుడి మీద బాణవర్షం కురిపించాడు. సుయోధనుడు ధృష్టద్యుమ్నుని ధనస్సు ఖండించి అతడి నుదుటన పది బాణములు నాటాడు. ఆగ్రహించిన ధృష్టద్యుమ్నుడు వేరొక ధనస్సు అందుకుని సుయోధనుడి ధనస్సు, కేతనము, రథమును విరిచాడు. సుయోధనుడు ఏమాత్రం జంకక ధృష్టద్యుమ్నుని బల్లెము, ఖడ్గం, ధ్వజము, అశ్వములను, సారథిని, కవచమును తునాతునకలు చేసాడు. అది చూసిన ధృష్టద్యుమ్నుడి సోదరుడు అతడిని తన రథము మీదకు లాక్కుని తీసుకు వెళ్ళాడు. అప్పటి వరకు సాత్యకితో పోరుతున్న కర్ణుడు అతడిని విడిచి ధృష్టద్యుమ్నుని వెంబడించాడు. సాత్యకి కర్ణుడిని తరుముతున్నాడు. ధృష్టద్యుమ్నునికి కర్ణుడికి మధ్య యుద్ధం ఘోరంగా సాగింది. వారిరువురికి మధ్యలో వచ్చి కర్ణుడిని ఎదుర్కొన్న ఎనిమిది మంది పాంచాలరాకుమారులను కర్ణుడు యమపురికి పంపాడు. తనను చుట్టుముట్టిన చేధి, పాంచాల వీరులను కర్ణుడు సంహరించి ధర్మరాజు వైపు వెళ్ళసాగాడు. అది చూసిన ఉపపాండవులు,
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి