17-24-గీతా మకరందము.
శ్రద్ధాత్రయ విభాగయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదానతపఃక్రియాః |
ప్రవర్తన్తే విధానోక్తాః
సతతం బ్రహ్మవాదినామ్ ||
తాత్పర్యము:- అందువలన, వేదములను బాగుగనెఱింగినవారియొక్క శాస్త్రోక్తములగు యజ్ఞదాన తపః క్రియలన్నియు ఎల్లప్పుడును "ఓమ్” అనిచెప్పిన పిమ్మటనే అనుష్టింప బడుచున్నవి.
వ్యాఖ్య:- ‘ఓమ్, తత్, సత్' అను మూడు పదములలోను మొదటిది యగు ‘ఓమ్’ అను పదముయొక్క మహిమను వెల్లడించుచున్నారు - పరబ్రహ్మముయొక్క వాచకము (నామము) అయి అతిపవిత్రమై, మహాశక్తివంతమై యలరుచుండుటచే వేదవేత్తలందఱును తాము ప్రారంభించు యజ్ఞదానతపస్సులను క్రియలన్నిటియొక్క ఆదియందు ఎల్లప్పుడును ‘ఓమ్' అను ఆ ఏకాక్షర ప్రణవమంత్రమును ఉచ్చరించుచున్నారు. అట్లుచ్చరించిన పిదపయే ఆ యా క్రియలను వారు ఉపక్రమించుదురు. (అట్లే ఆ యా క్రియలు సమాప్తమైన వెనుకను మఱల 'ఓమ్’ అని (ఆ ప్రణవమును) ఉచ్చరించుచుందురు). అట్లొనర్చుటవలన ఆ యా క్రియలలో ఏవైనలోపములు, దోషములు ఉన్నచో అన్నియు తన్మంత్ర ప్రభావమువలన భస్మీభూతములైపోవ ఆ కర్మలు పరిపూర్ణఫలముల నొసంగగలవు.
“సతతమ్” - (ఎల్లప్పుడును) అని చెప్పుటవలన అట్టి వేదవేత్తలు తామాచరించు ఆ యా యజ్ఞదానాది సత్క్రియల ప్రారంభమున ఎల్లప్పడును ఆ ప్రకారమే ప్రణవోచ్చారణము చేయుదురని స్పష్టమగుచున్నది. ఇంజనువలన రైలు పెట్టెలన్నియు కదలునట్లును, ఒకటి యను సంఖ్యచే ప్రక్కనగల పూర్ణానుస్వారములు (సున్నలు) అన్నియు శక్తివంతములగునట్లును, మొదటగల ఓంకారముచే తక్కిన మంత్రములు, క్రియలు అన్నియు చైతన్యవంతములు, ప్రతిభావంతములు అగును.
ప్రశ్న: -"ఓంకారము" యొక్క మహిమను తెలుపుడు?
ఉత్తరము: - వేదవేత్తలు తా మాచరించు యజ్ఞ దాన తపఃక్రియలకు మొదట ఎల్లప్పడును ఓంకారమును ఉచ్చరించియే పిమ్మట ఆ యా క్రియలను చేయుచుందురు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి