*తిరుమల సర్వస్వం -253*
*ద్వాదశ ఆళ్వారులు-17*
*తిరుమంగై ఆళ్వార్*
శ్రీమహావిష్ణువు చేబూని ఉండే *'శార్ఙ్గము'* అనే ధనుస్సు యొక్క అంశగా భావించబడే తిరుమంగై ఆళ్వార్ తమిళదేశం లోని 'కురయలూరు' అనే గ్రామంలో జన్మించారు. శ్రీమహావిష్ణువు కున్న సహస్రనామాలలో *'శార్ఙ్గపాణి'* యనే నామధేయం కూడా ఒకటి.
776 వ సంవత్సరంలో, కార్తీకమాసపు కృత్తికానక్షత్రంలో జన్మించిన వీరు సేనాధిపతిగా, రాజప్రతినిథిగా, భాగవతోత్తమునిగా, చోరుశేఖరునిగా, కవిపుంగవునిగా అనేక పాత్రలు పోషించి; వైష్ణవదివ్యక్షేత్రాల నెన్నింటినో సందర్శించి విష్ణుసాయుజ్యం పొందారు. వారి జీవన గమనానికి సంబంధించిన ఆసక్తికరమైన గాథ అనేక దయనీయ మలుపులు తిరుగుతూ కరుణ, భక్తిరస ప్రధానాలుగా చదువరులలో ఉత్సుకత నింపుతుంది.
*కంచి వరదుని కటాక్షం*
'నీలుడు' అనే కడజాతి వానికి జన్మించిన తిరుమంగై ఆళ్వార్ జన్మనామం కూడా 'నీలుడే'! బాల్యం నుండి కులవిద్యతో పాటుగా యుద్ధవిద్య లన్నింటిలో అత్యంత నైపుణ్యం సంపాదించడంతో అప్పటి చోళరాజు నీలుణ్ణి సైన్యాధిపతిగా, తన సామ్రాజ్యంలో కొంత భాగానికి రాజప్రతినిధిగా నియమించాడు. క్షాత్రవిద్యలతో పాటుగా భగవదారాధానలో కూడా అమితాసక్తిని ప్రదర్శించే నీలుడు ప్రజల నుండి పన్నుల ద్వారా సేకరించిన సొమ్మును ప్రభుత్వ కోశాగారంలో జమ చేయకుండా, భగవత్కైంకర్యాలకు వెచ్చించేవాడు. పన్నుబకాయిలు పేరుకు పోవడంతో, చోళప్రభువు నీలునిపై 'ప్రభుత్వనిధుల మళ్ళింపు' నేరం మోపి; అతనిని నిత్యపూజలకు నోచుకోని ఒక వైష్ణవాలయంలో బంధించాడు. అలా పెక్కుదినాలు ఆకలిదప్పులతో అలమటిస్తూ బందీగా ఉన్న నీలుడు తన అన్నపానాదుల కోసం, సౌకర్యం కోసం, స్వేచ్ఛ కోసం చింతించకుండా; భగవదార్చన చేయలేక పోయినందుకు కృంగిపోయాడు. త్వరలో తనను విడుదల చేయించి, తనచే నిత్యపూజ జరిపించుకొమ్మని పరమేశ్వరుణ్ణి వేడుకొన్నాడు. అతని త్యాగనిరతికి, నిస్వార్థచింతనకు, భక్తిశ్రద్ధలకు ముగ్ధుడైన కంచి వరదరాజస్వామి నీలునికి స్వప్నంలో సాక్షాత్కరించి ఒక గుప్తనిధి జాడ తెలియజేశాడు. నీలుడు చోళరాజు సమ్మతితో నిధిని తెగనమ్మగా సమకూడిన సొమ్ముతో పన్నుబకాయిలను జరిమానాతో సహా తీర్చివేసి, మిగిలిన రొక్కాన్ని భగవత్కైంకర్యానికై వినియోగించాడు. అంతే గాకుండా తన ఆధ్యాత్మిక చింతనకు అడ్డుగా నున్న రాచకొలువును విడనాడి, శ్రీహరిని కొలుచుకుంటూ కవితా వ్యాసంగంలో మునిగి పోయాడు. తన పాశురాల సంకలనమైన *'పెరియ తిరుమొళి'* లో శ్రీమన్నారాయణుని కథానాయకునిగా, తనను కథానాయకిగా ఊహించుకొని మధురభక్తిని ప్రకటించాడు.
*మంత్రోపదేశం*
కాలాంతరాన, ఒకానొక సరోవరంలో జలకమాడుతున్న 'కుముదవల్లి' అనే గంధర్వకన్యను కాంచి మోహించిన నీలుడు ఆమె విధించిన మొదటి షరతు ప్రకారం పంచసంస్కారాలు గావించుకొని, శ్రీవైష్ణవునిగా పునర్జన్మ నెత్తి, ఆమెను శాస్త్రసమ్మతంగా పరిణయమాడాడు. ఆమె విధించిన రెండవ షరతును అనుసరించి ఒక సంవత్సరకాలం పాటు ప్రతినిత్యం వేయిమంది శ్రీవైష్ణవులకు అన్నసంతర్పణ కావించే మహత్కార్యానికి పూనుకున్నాడు. ప్రతిరోజూ వేయిమందికి అన్నదానమంటే అది మహారాజులకే గానీ, సామాన్యులకు సాధ్యపడే కార్యం కాదు. కొద్దికాలానికే నీలుని ఆర్థిక వనరులన్నీ అడుగంటి పోయాయి. అన్న సంతర్పణను కొనసాగించడం శక్తికి మించిన భారమైంది. రేయింబవళ్ళు కష్టించినప్పటికీ ప్రతిరోజు వేయిమందికి అన్నవితరణకు కావలసినంత పైకాన్ని కూడబెట్ట లేకపోయాడు. ఆరునూరైనా సరే, భాగవతుల విషయంలో సతీమణి కిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టు కోవలసిందే! ఎంతకూ తరుణోపాయం కానరాక పోవడంతో, నీలుడు భావసారూప్యత గలిగిన కొందరు వైష్ణవభక్తులను కూడదీసి, చోరబృందంగా ఏర్పడి, బందిపోటు తనాలకు పాల్పడసాగాడు. శాస్త్రాలను క్షుణ్ణంగా అభ్యసించిన నీలుని దృష్టిలో చోరవృత్తి నేరమే అయినప్పటికీ, దానికి పరిహారముంది. కానీ వాగ్దానభంగం మాత్రం ప్రాయశ్చిత్తం లేని నేరం. అది కుడా, భాగవతోత్తముల విషయంలో అనృతానికి (అసత్యం) పాల్పడడం మరింత మహాపరాధం. ఇలా తర్జన భర్జన పడిన అనంతరం అక్రమ మార్గాలలో ధనార్జన చేసినవారి నుండి మరియు నాస్తికుల నుండి ధనాన్ని దొంగిలించి, ఆ సొమ్ముతో శ్రీవైష్ణవులకు అన్నసంతర్పణను నిరాటంకంగా కొనసాగించాడు.
ఇలా కొంత తడవు జరిగిన తరువాత శ్రీరంగనాథుడు తిరుమంగళై ఆళ్వార్ భక్తిశ్రద్ధలను పరీక్షింప గోరాడు. శ్రీరంగనాథుడు ఒక పెళ్ళిబృందంలో వరుని రూపంలో ఊరేగుతూ తనను దోచుకోబోతున్న నీలునికి తారసపడి, స్వీయరక్షణకై అతనితో ముష్టియుద్ధం గావించాడు. తన ప్రాణాలకు తెగించి వీరోచితంగా పోరాడిన నీలుడు పెళ్ళిబృందం వారి ఆభరణాలను, ధనాన్ని దోచుకున్నాడు. కానీ వారి మానప్రాణాల కేమాత్రం హాని తలపెట్టలేదు. ఊరేగింపులో నున్న వైష్ణవుల జోలికి పోలేదు. అతని సాహసాన్ని, కార్యనిరతిని, వాగ్దానాన్ని నిలబెట్టు కోవడానికి ప్రదర్శించిన తెగువను, శ్రీవైష్ణవుల పట్ల అతనికున్న నిబద్ధతను చూచి ముచ్చట పడిన శ్రీరంగనాథుడు స్వయంగా ప్రత్యక్షమై నీలునికి *'నారాయణాక్షరి'* మంత్రోపదేశం కావించాడు. శ్రీరంగశాయిని కనులారా కాంక్షించిన తిరుమంగై ఆళ్వార్ భక్తిశ్రద్ధలు మరింతగా ఇనుమడించాయి.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి