*అడుగులకు మడుగులు:*
పూర్వం మహారాజులూ, మహారాణులూ బయల్దేరినప్పుడు వాళ్లవెనక కొంగులెత్తి పట్టుకోవడానికి సేవకులుండేవాళ్ళు. అలాగే ముందు గుడ్డలు పరిచేవాళ్ళు, కాళ్ళకు నేల తగిలి ఒత్తిడి కలిగి బాధ పడకుండా. పూర్వం రాజకుమార్తెలు ఏడు మల్లెపూల ఎత్తుండేవాళ్లని కాశీమజిలీల వంటి కథలు వర్ణిస్తాయి. అంత సుకుమారులకు నడుస్తున్నా ఇబ్బంది కలక్కుండా 'మడుగులు' పరిచేవాళ్ళు. మడుగు అంటే మడతపెట్టిన గుడ్డ. ఒంటిపొర గుడ్డలు పరిచినా కాళ్ళు కందిపోవచ్చు. కాబట్టి గుడ్డ మడతలు పరిచేవారన్నమాట. ఆ పరచటాన్ని కూడా మరింత సుకుమారంగా ఒత్తటమన్నారు. అడుగులకు మడుగులొత్తే పని సేవకులందరిలోనూ తక్కువరకం వాళ్ళ కర్తవ్యం. రాజులకు సరే. సామాన్యులక్కూడా ఇలాంటి సేవలు చేయటం దాస్య ప్రవృత్తికి చిహ్నం. అయితే సామాన్యుల భోగం కట్టుగుడ్డల్తో సమాప్తమవుతుంది. ఉత్తుత్తి సేవలు చేయించుకోవలసిందే వాళ్ళు. ఈ కాలంలో మడుగుల్లేకపోయినా అవి ఉంటే ఎలా సేవలు చేస్తారో అలా వంగి వంగి దణ్ణాలు పెడుతూ బతకటాన్ని అడుగులకు మడుగులొత్తటం అంటారు. అంటే - బానిసలా వ్యవహరించటం/ప్రవర్తించటం, రాజమర్యాదలు జరపటం, విపరీతంగా గౌరవించటం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి