*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*కర్ణ పర్వము ద్వితీయాశ్వాసముసమాప్తం*
*390 వ రోజు*
కర్ణుడు సుయోధనుడికి సాయం వచ్చాడు. కర్ణుడు తన శరములతో శిఖండి విల్లును, కేతనమును ఖండించాడు. శిఖండి అక్కడ నుండి పారిపోయాడు. దుశ్శాసనుడు ధృష్టద్యుమ్నుడు ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధము చేస్తున్నారు. నకులుడు కర్ణుడి కుమారుడైన వృషసేనుడి సారథిని చంపాడు. వృషసేనుడి సైన్యము చెదిరి పోయింది. వృషసేనుడు వేరొక సారథిని తీసుకుని యుద్ధానికి వచ్చాడు. సహదేవుడు శకుని కుమారుడైన ఉలూకుడిని తీవ్రంగా గాయపరిచాడు. ఉలూకుడు ఆ దెబ్బకు పారిపోయాడు. సాత్యకి శకుని ఒకరితో ఒకరు తీవ్రంగా పోరుసల్పుతున్నారు. సాత్యకి శకుని రథాశ్వములను చంపగా శకుని రథము దిగి పారిపోయాడు. భీముడు సుయోధనుడిని సారథిని చంపి రథమును విరుగ కొట్టాడు. సుయోధనుడు మరొక రథము ఎక్కి అక్కడి నుండి తొలిగి పోయాడు. యుధామన్యుడు కృపాచార్యుని ఎదుర్కొని అతడి విల్లు విరిచాడు. కృపాచార్యుడు వేరొక విల్లు తీసుకుని యుధామన్యుడి సారథిని చంపి కేతనమును, విల్లును విరిచాడు. యుధామన్యుడు పారిపోయాడు. అశ్వత్థామ అర్జునుడిని ఎదుర్కొన్నాడు. కృష్ణార్జునుల మీద శరములు గుప్పించాడు.అర్జునుడు అశ్వత్థామ మీద అనేక దివ్యాస్త్రాలు సంధించాడు. ధర్మరాజు చిత్రసేనుడిని ఎదుర్కొని భీముడు, నకుల సహదేవులు, ధృష్టద్యుమ్నుడు సుయోధనుడిని అతడి పరివారాన్ని ఎదుర్కొన్నారు. అది చూసి కర్ణుడు సుయోధనుడికి సాయంగా వచ్చి ధర్మరాజు గుండెలకు గురిపెట్టి బాణము వేసాడు. ఆ దెబ్బకు ధర్మరాజు రథము మీద కూలబడి రథమును పక్కకు పోనిమ్మని చెప్పాడు. కౌరవులు ధర్మరాజును తరిమారు. కేకయ, పాంచాల యోధులు వచ్చి ధర్మరాజును రక్షించారు. భీముడు సుయోధనుడితో యుద్ధం చేస్తున్నాడు. కర్ణుడు కేకయ, పాంచాల సేనలను నుగ్గు చేసి ధర్మరాజును తరిమాడు. ధర్మరాజు వెను తిరిగి కర్ణుడి మీద శరవర్షం కురిపించి కర్ణుడి సారథిని హయములను చంపాడు. నకులుడు సహదేవుడు ధర్మరాజుకు సాయంగా వచ్చి కర్ణుడి మీద శరములు గుప్పించారు. కర్ణుడు విజృంభించి ధర్మరాజు తలపాగా కొట్టి అతడి సారథిని చంపాడు. ధర్మరాజు నకులుడి రథము ఎక్కాడు. ఇంతలో శల్యుడు కర్ణుడిని చూసి " కర్ణా ! ఏమిటీ పని నీపరాక్రమము అర్జునుడి మీద చూపాలి కాని ధర్మరాజు మీద కాదు. నీవు పొరపాటున ధర్మరాజును చంపితే అర్జునుడు నిన్ను వధించుట తధ్యం. కనుక ధర్మరాజును వదలి అర్జునుడితో యుద్ధము చెయ్యి. కర్ణా ! అటు చూడు నీ అనుంగు మిత్రుడు సుయోధనుడు భీమసేనుడి చేత చిక్కి నిరాయుధుడయ్యాడు. సుయోధనుడు భీముని చేతిలో మరణించిన నీ శ్రమ వృధా ! నీవు పాండవులను గెలిచినా ప్రయోజనము ఉండదు. కనుక సుయోధనుడిని రక్షించు " అన్నాడు. శల్యుని మాటలు విని కర్ణుడు ధర్మరాజును వదిలి సుయోధనుడి వైపు వెళ్ళాడు. కర్ణుడు తనను విడిచి వెళ్ళగానే ధర్మరాజు నకుల సహదేవులతో తన శిబిరానికి వెళ్ళాడు.
*కర్ణ పర్వము ద్వితీయాశ్వాసముసమాప్తం*
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి