18-12-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అవతారిక - కర్మఫలములను త్యజించుటచే కర్మబంధమునుండి మనుజు డేల విడివడగలడో చెప్పుచున్నారు -
అనిష్టమిష్టం మిశ్రం చ
త్రివిధం కర్మణః ఫలమ్ |
భవత్యత్యాగినాం ప్రేత్య
న తు సన్న్యాసినాం క్వచిత్ ||
తాత్పర్యము:- దుఃఖకరమైనదియు, సుఖకరమైనదియు, సుఖదుఃఖములు రెండును గలసినదియునగు మూడువిధములైన కర్మఫలము- కర్మఫలత్యాగము చేయనివారలకు మరణానంతరము కలుగుచున్నది, కర్మఫలత్యాగముచేసినవారికన్ననో అవి యెన్నటికిని కలుగనేరవు.
వ్యాఖ్య:- కర్మ బంధమును గలుగజేయునని, జన్మకు హేతువగునని, కావున చేయరాదని చెప్పువారికి భగవాను డీశ్లోకమున సరియైన సమాధాన మొసంగిరి. కర్మ యెవరికి బంధమును గలిగించును? అందఱికినిగాదు. ఫలాపేక్షతో చేయువారికి, సంగముతోను, అభిమానముతోను, కర్తృత్వబుద్ధితోను ఆచరించువారికి మాత్రమే కర్మ బంధకరముగ పరిణమించునుగాని, అసంగముగ, నిష్కామముగ ఫలాపేక్షారహితముగ ఆచరించువారికి గాదు. ఆ విషయమే ఈ శ్లోకమందు స్పష్టముగ చెప్పబడినది. స్వర్గాది సుఖరూప ఇష్టఫలముగాని, నరకనీచజన్మాది దుఃఖరూప అనిష్టఫలముగాని, మానవజన్మయను సుఖదుఃఖమిశ్రఫలముగాని ఫలాపేక్షతో కర్మలను జేయువారికే కలుగునుగాని, ఫలములను వదలిన వారికి కాదు. (న తు సన్న్యాసినాం క్వచిత్) అని చెప్పుటవలన ఏకాలమందును వారికి బంధము కలుగదని భావము. ఏలయనగా కర్మఫలములను త్యజించువారికి చిత్తశుద్ధిద్వారా మోక్షమే కలుగును. జన్మరాహిత్యమే సిద్ధించును. వారికి లోకాదుల (జన్మాదుల) ప్రసక్తియే యుండదు. సంసారచక్ర పరిభ్రమణమంతయు ఫలాపేక్షతో కర్మలను జేయువారికే యగును. దీనినిబట్టి ఫలాపేక్షారహితమగు (నిష్కామమగు) కర్మ యెంతటి మహిమతో గూడుకొనియున్నదో, భగవానునకు దానియెడల యెంతటి ప్రీతియో విస్పష్టమగుచున్నది.
ప్రశ్న:- కర్మఫల మెన్నివిధములు? అవి యేవి?
ఉత్తరము: - మూడు విధములు - (1) ఇష్టమైనది (సుఖకరమైన స్వర్గాదులు) (2) అయిష్టమైనది (దుఃఖకరమగు నరకనీచజన్మాదులు) (3) ఇష్టానిష్టమిశ్రమమైనది (సుఖదుఃఖములు రెండునుగల మానవజన్మ).
ప్రశ్న:- ఈ మూడు ఫలములు యెవరికి కలుగును?
ఉత్తరము:- కర్మఫలములను వదలక కర్మలను ఫలాసక్తితో చేయువారికే కలుగును.
ప్రశ్న:- ఎపుడు కలుగును?
ఉత్తరము:- మరణానంతరము (ప్రేత్య).
ప్రశ్న:- ఈ కర్మఫలములు ఎవరికి కలుగవు?
ఉత్తరము:-కర్మఫలములు త్యజించి కర్మనాచరించువారికి అనగా, నిష్కామకర్మాచరణపరులకు కలుగవు. (వారికి చిత్తశుద్ధిద్వారా మోక్షమే లభించును గావున).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి