*తిరుమల సర్వస్వం -268*
*శ్రీవారి సంవత్సర సేవలు - 5*
*బాలాలయం*
పైన చెప్పుకున్న 'కళాపకర్షణ' ప్రక్రియ ద్వారా 48 కళలను నిక్షేపం చేయబడ్డ కలశాన్ని సర్వలాంఛనాలతో ఓ ప్రత్యేక మంటపం లోనికి చేర్చుతారు. ఈ కలశంతో పాటుగా పంచబేరాలలో మిగిలిన నలుగురి ఉత్సవమూర్తులను; ఆనందనిలయంలో ఉండే రామపరివార దేవతలను, శ్రీకృష్ణపరివార దేవతలను, చక్రత్తాళ్వార్ ను; జయవిజయుల అంశను; విమానప్రదక్షిణమార్గంలో ఉండే విష్వక్సేనుల వారి, యోగానరసింహుని, వరదరాజస్వామి వారి, శ్రీమద్రామానుజుల వారి అంశలను; ధ్వజస్తంభం, బేడి ఆంజనేయుడు, వేణుగోపాలస్వామి వారి అంశలను మొత్తం 18 కలశాలలో నిక్షిప్తం చేసి, వాటిని 18 ప్రత్యేక పీఠాలపై ఉంచుతారు. మూలవిరాట్టుతో పాటు మిగిలిన దేవతలందరూ తాత్కాలికంగా కొలువై ఉండి నిత్యనీరాజనాలు అందుకునే ప్రదేశాన్నే *'బాలాలయం'* గా వ్యవహరిస్తారు. సుప్రభాత, ఏకాంతసేవలతో పాటుగా శ్రీవారికి అనునిత్యం జరిగే సేవలన్నీ ఈ బాలాలయంలో క్రమం తప్పకుండా జరుగుతాయి. ముఖ్యమైన సేవలన్నీ మూలమూర్తికి కూడా యథావిథిగా జరుగుతాయి. ఇతర వైష్ణవాలయాలకు భిన్నంగా స్వామివారి అంశ బాలాలయంలో ఉన్న సమయంలో కూడా, స్వల్ప అంతరాయంతో మూలవిరాట్టు దర్శనానికి అనుమతిస్తారు. శ్రీవారు స్వయంభువుగా అవతరించి యుండటమే ఈ మినహాయింపునకు కారణం.
*మహాసంప్రోక్షణ*
*'సంప్రోక్షణ'* అంటే 'శుద్ధి చేయడం. గర్భాలయంతో పాటుగా తిరుమలక్షేత్రాన్నంతా శుద్ధిచేసి, అవసరమైన మరమ్మత్తులు జరిపి, నవీనీకరించడమే 'మహాసంప్రోక్షణం'. ఐదు రోజుల ఉత్సవం చివరిరోజు కళాన్యాసం జరిగిన తరువాత మూలమూర్తిని, ఉత్సవమూర్తులను, పరివార దేవతలను, ఉపాలయాలలోని దేవతలను వైదిక సాంప్రదాయ క్రియల ద్వారా, విశిష్ఠమైన ద్రవ్యాల ద్వారా శుద్ధి చేయడం 'మహాసంప్రోక్షణ' లో భాగం. ఆలయ అర్చకులతో పాటుగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఋత్విక్కులు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు.
*దినసరి కార్యక్రమాలు*
ఐదు రోజులు జరిగే ఈ ఉత్సవంలో రోజువారి క్రతువులు ఈవిధంగా ఉంటాయి.
ముందురోజు మృత్సంగ్రహణం (పుట్టమన్ను సేకరించడం), అంకురార్పణ, విష్వక్సేనునికి ప్రత్యేక పూజ, ఊరేగింపు కార్యక్రమాలు జరుగుతాయి.
మొదటిరోజు వాస్తుహోమం జరుగుతుంది. ఈ ప్రక్రియలో క్రతువుకు అవసరమయ్యే యాగశాలలను సిద్ధం చేసి, వాటిని శుద్ధిచేసి; ఎటువంటి ఆటంకాలు, విఘ్నాలు కలుగకుండా దైవారాధన చేయబడుతుంది.
రెండవ రోజున ముందు చెప్పుకున్న కళాపకర్షణ ప్రక్రియ చేపడతారు.
మూడవ రోజు విశేష హోమాలు; భారత, రామాయణ, భాగవత పారాయణం జరుప బడుతాయి.
నాల్గవరోజు అష్టదిగ్బంధనం జరుగుతుంది.
ఐదవరోజు పూర్ణాహుతి, కళాన్యాసం, మహాశాంతి అభిషేకం జరుగుతాయి. తరువాత, శుభముహూర్తంలో ఆలయ సంప్రోక్షణ జరుపబడుతుంది.
ఈ ఉత్సవం జరిగిన ఇదు రోజుల వ్యవధిని ప్రధాన మరియు ఉపాలయాలలోని విగ్రహాలను, గర్భాలయాలను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన మరమ్మత్తులు చేపట్టడం కోసం వినియోగిస్తారు.
*అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణోత్సవం* ఎప్పుడు ప్రారంభమైందో తెలియజెప్పే ఖచ్చితమైన చారిత్రకాధారాలు లభించలేదు. అయితే, దాదాపు వెయ్యేళ్ళ క్రితం శ్రీమద్భగవద్రామానుజుచార్యులే ఈ ఉత్సవానికి నాంది పలికినట్లు కొందరు భావిస్తారు. రెండు శతాబ్దాల క్రితం నుంచి ఈ ఉత్సవం జరిగినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. దస్త్రాలు, (రికార్డులు) లభించినంత వరకూ 1908, 1934, 1946, 1958, 1970, 1982, 1994, 2006, 2018 సంవత్సరాలలో ఈ ఉత్సవం జరిగినట్లు తెలుస్తోంది.
[ రేపటి భాగంలో... *శ్రీవారి మొక్కుబడులు* గురించి తెలుసుకుందాం...]
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి