*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*కర్ణ పర్వం – తృతీయాశ్వాసం*
*405 వ రోజు*
*శల్యుడు కర్ణుని మరణం సుయోధనుడికి వివరించుట*
కర్ణుడి మరణం పాండవ సేనలో ఆనందోత్సాహాలు నింపాయి. జయజయ ధ్వానాలు మిన్నంటాయి. కర్ణుడు లేని రథమును తోలుకుని శల్యుడు వెళ్ళి పోయాడు. భీముడు కర్ణుడి మరణానికి ఆనందించి పెద్దగా అరుస్తూ కేకలు వేసాడు. శల్యుడు సుయోధనుడిని చేరి " సుయోధనా ! ఎన్నో యుద్ధాలు చూసాను కాని ఈ రోజు జరిగిన కర్ణార్జునుల యుద్ధం లాంటిది చూడ లేదు. ఒక దశలో కృష్ణార్జునులు సైతం కర్ణుడి పరాక్రమానికి భయపడ్డారు. కాని విధి బలీయం కనుక అంతటి బలశాలి కర్ణుడిని బలి తీసుకుంది. కృషార్జునుల శంఖధ్వానాలు వింటున్నావు కదా! సూర్యాస్థమయం అయింది ఈ రోజుకు యుద్ధం చాలించడం మంచిది " అన్నాడు. కర్ణుడి మరణ వార్త సుయోధనుడిని నిశ్చేష్టుడిని చేసింది. అంతలో కర్ణుడి మరణ వార్త తెలుసుకుని అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ, శకుని, సుశర్మ విషణ్ణ వదనాలతో అక్కడకు చేరారు. సుయోధనుడి దుఃఖానికి అవధులు లేవు. " కర్ణా ! కర్ణా ! " అని అరుస్తూ శిబిరానికి చేరుకున్నాడు.
*కృష్ణార్జునులు ధర్మజునుకి కర్ణుని మరణ వార్త ఎరిగించుట*
కృష్ణార్జునులు కూడా యుద్ధంచాలించమని తమ సేనలకు చెప్పారు. అందరూ తమతమ శిబిరములకు చేరారు. అందరూ తమ ధర్మరాజు శిబిరానికి వెళ్ళి అన్న మాట నిలబెట్టు కున్నందుకు ధర్మరాజును అభినందించారు. కృష్ణుడు ధర్మరాజుతో " ధర్మజా! కర్ణుడు ఈరోజు మహా పరాక్రం ప్రదర్శించాడు. నీ ఆగ్రహజ్వాలలే కర్ణుడిని దహించాయి. కర్ణుడి చావుతో నీకు కౌరవుల బాధ తీరింది. నీవు ఇక నిశ్చింతగా ఉండు " అన్నాడు.ధర్మరాజు " అది సత్యము కాదు. నీ అనుగ్రహమే మాకు విజయాన్ని చేకూర్చింది. కాని మరేది కాదు " అన్నాడు. కృష్ణుడు " ధర్మజా! నేను కేవలం నిమిత్త మాతృడను. నీ తమ్ములు , బావలు అత్యంత పరాక్రమ వంతులు. అందరి సమిష్టి కృషి వలనే మీకు విజయం చేకూరింది " అని అన్నాడు.
*ధర్మజుడు కర్ణుడిని రణభూమిలో చూచుట*
ధర్మరాజు కర్ణుడి మరణానికి ఆనందించి " ఒకసారి రణ భూమికి వెళ్ళి కర్ణుడిని చూడవలెనని కోరికగా ఉంది అన్నాడు. ధర్మరాజు బంధు మిత్రులు తోడురాగా సపరివార సమేతంగా రణ భూమికి వెళ్ళి కర్ణుడు మరణించడం చూడడానికి వెళ్ళాడు. రణభూమిలో తలతెగి పడి ఉన్న కర్ణుడిని అతడి పుత్రులను చూసి ఇక తనకు పునర్జన్మ కలిగినంతగా సంతోషించాడు ధర్మరాజు " అన్నాడు సంజయుడు
*కర్ణ పర్వం – తృతీయాశ్వాసం సమాప్తం *
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి