18-18,19-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అవతారిక - కర్మకు కారణమును, ఆధారమును తెలుపుచున్నారు –
జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా
త్రివిధా కర్మచోదనా
కరణం కర్మ కర్తేతి
త్రివిధః కర్మసంగ్రహః
తాత్పర్యము: - కర్మమునకు హేతువు తెలివి, తెలియదగిన వస్తువు, తెలియువాడు అని మూడువిధములుగ నున్నది. అట్లే కర్మ కాధారమున్ను ఉపకరణము (సాధనము), క్రియ, చేయువాడు - అని మూడు విధములుగ నున్నది.
ప్రశ్న:- కర్మమునకు హేతు వెన్ని విధములుగ నున్నది? అవియేవి?
ఉత్తరము:- మూడువిధములుగ. అవి (1) ఉపకరణము (2) క్రియ (3) కర్త (చేయువాడు) అయియున్నవి.
~~~~
అవతారిక - జ్ఞానము, కర్మ, కర్త - అనువానియొక్క సాత్త్విక, రాజస, తామసరూపములను తెలియజేసెదనని భగవానుడు పలుకుచున్నారు -
జ్ఞానం కర్మ చ కర్తా చ
త్రిథైవ గుణభేదతః
ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావచ్ఛృణు తాన్యపి.
తాత్పర్యము:- గుణములనుగూర్చి విచారణచేయు సాంఖ్యశాస్త్రమునందు జ్ఞానము, కర్మము, కర్త అనునివియు సత్త్వాదిగుణములయొక్క భేదముననుసరించి మూడువిధములుగనే చెప్పబడుచున్నవి. వానినిగూడ యథారీతి (శాస్త్రోక్తప్రకారము) చెప్పెదను వినుము.
ప్రశ్న:- భగవానుడు గుణభేదముననుసరించి మూడువిధములుగ వేనినిగురించి చెప్పదలంచెను?
ఉత్తరము:- (1) జ్ఞానము, (2) కర్మ, (3) కర్త - అను ఈ మూడింటినిగూర్చి.
ప్రశ్న:- వానిని గురించి యెచట తెలుపబడినది?
ఉత్తరము:- సాంఖ్యశాస్త్రమునందు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి